బొత్స సత్యనారాయణ
సాక్షి, విజయవాడ : ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ప్రజాదరణే.. ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందనటానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శనివారం ఉదయం కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం విజయవాడలో పార్టీ ప్రతినిధులు బొత్స, పార్థసారథి, లేళ్ల అప్పిరెడ్డిలు మీడియా సాక్షిగా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
‘ప్రజలు వైఎస్ జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా అహంపూరితంగా వ్యవహరిస్తున్నారు. పూలే జయంతి రోజున కనీసం నివాళులు కూడా అర్పించకుండా బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అవమానపరిచారు. లాభం లేనిదే ఆయన ఏపని చేయటం లేదు. కానీ, ఇటువంటి వాటిని పర్వదినాలుగా ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అని ఆయా నేతలు పేర్కొన్నారు.
రాజధానిని వాడుకుంటున్నారు
తన బినామీల రియల్ ఎస్టేట్ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని వాడుకుంటున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాడికొండ మండలంలో 14 ఎకరాల భూమిని రాజధాని ప్రకటనకు ముందే ఎలా కొన్నారో చెప్పాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ఇప్పటికే ఇద్దరు సీఎస్‌లు(మాజీ) చంద్రబాబు దోపిడీని బయటపెట్టారు. రాజధానిలో హెరిటేజ్ కంపెనీ భూములను ఎలా కొనుగోలు చేసింది? భూముల కొనుగోళ్లపై నిజాలను బయటపెట్టాలి’ అని బొత్స, పార్థసారథిలు డిమాండ్ చేశారు.
అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేశారు
చివరకు అగ్రిగోల్డ్ ఆస్తులపై కూడా కన్నేసిన కొందరు వాటిని కాజేయడానికి కుట్ర పన్నారని బొత్స ఆరోపించారు. ‘ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని బాధితులు చెబుతున్నారు. ఈ నెల 3న ఢిల్లీలో బాబు.. అమర్ సింగ్, సుభాష్ చంద్ర, అవ్వా సీతారంను కలిశారు. వాటాలు తేలకపోవటంతో కోర్టులో అఫిడవిట్ వేయించారు. అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు’ అని మండిపడ్డారు. కానీ, వైఎస్సార్ సీపీ మాత్రం అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటుందని అని బొత్స, అప్పిరెడ్డిలు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment