మీకు తెలుగు వాళ్లు దొరకలేదా?
రాజధాని నిర్మాణం విషయంలో స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం చారిత్రిక తప్పిదం చేస్తోందని వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్విస్ చాలెంజ్ విధానంపై విజయ్ కేల్కర్ లాంటి నిపుణులు అభ్యంతరం తెలిపినా చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేకిన్ ఇండియా అని నినాదం ఇస్తుంటే.. చంద్రబాబు మాత్రం మేడిన్ సింగపూర్ అంటున్నారని.. రాజధాని నిర్మాణ పనులు చేయించడానికి తెలుగువాళ్లు ఎవరూ దొరకలేదా అని కన్నబాబు ప్రశ్నించారు.
ఛత్తీస్గఢ్ లాంటి కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వాటి రాజధాని నగరాలను సింగపూర్ కంపెనీలతో కట్టించారా.. లేక భారతీయ నిపుణులను తీసుకున్నారా అనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదా అని ఆయన నిలదీశారు. అసలు ఏ ప్రాతిపదికన ప్రభుత్వం తమవద్ద కేవలం 42 శాతం ఉంచుకుని సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటా ఇస్తోందని కన్నబాబు అడిగారు.అమరావతి నిర్మాణానికి తెలుగు ఇంజనీర్లు, ఏపీ కంపెనీల వాళ్లు పనికిరారా, ఇది తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కాదా అన్నారు. చంద్రబాబు సింగపూర్ జపం చేయడం ఇది మొదటిసారి కాదని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సింగపూర్ అంటూనే ఉంటారని.. ఆ దేశంలోని కంపెనీలలో ఆయనకు వాటాలు ఉన్నాయి కాబట్టే ఈ ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అమరావతి ఒప్పందాలన్నింటినీ సమీక్షిస్తామని హెచ్చరించారు. తెలుగుజాతి భవిష్యత్తును విదేశీయులకు తాకట్టు పెట్టొద్దని కోరారు.