సాక్షి, తాడేపల్లి : తుగ్లక్ పాలన అంటే చంద్రబాబు నాయుడిదే అనే విషయం లోకేశ్ తెలుసుకోవాలని పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. తుగ్లక్ అంటే ఎవరో అసలు లోకేశ్‌కు తెలుసా అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నుంచి మూటా- ముల్లె సర్దుకుని చంద్రబాబు పారిపోయివచ్చిన విషయం లోకేశ్ మర్చిపోయాడా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలనపై విమర్శలు గుప్పిస్తున్న లోకేశ్ తీరును బొత్స ఎండగట్టారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...వందరోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. పెట్టిన తొలి సంతకాలకు చట్ట రూపం తెచ్చిన వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. నాడు చంద్రబాబు పెట్టిన మొదటి సంతకాలకు విలువలేకుండా పోయిందని.. ప్రతిపక్షంలో ఉండటాన్ని తట్టుకోలేకే ఆయన.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కిడ్నీ బాధితుల కోసం 200 పడకల ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించిన విషయం.. లోకేశ్, చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
సమాధానం చెప్పండి బాబూ..!
‘చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఇప్పుడు శాంతియుత పాలన సాగుతుంటే పెయిడ్ ఆర్టిస్టులతో పునరావాస కేంద్రాలను పెడుతున్నారు. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మరు. ముందు కోడెల టాక్స్ వసూళ్లు చేశాడా లేదా.. చింతమనేని దళితులను కులం పేరుతో దూషించారా లేదా.. కూన రవి కుమార్ ఉద్యోగులను తిట్టారా లేదా...దళిత ఎమ్మెల్యే శ్రీదేవిని టీడీపీ నేతలు దూషించారా లేదా.. సోమిరెడ్డి తప్పుడు పత్రాలతో భూములు కాజేశారా లేదా వీటన్నింటికి సమాధానం చంద్రబాబు చెప్పాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ఓడిపోయినా చంద్రబాబులో మార్పు రాలేదని. వరదలు వస్తే చంద్రబాబు బురద రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాకు నటించడం రాదు..
అమరావతి విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న దుష్ర్పచారంపై స్పందించిన బొత్స...‘అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా. నాకు ఉన్న సమాచారం ప్రకారం అలా జరుగలేదు. ఏదైనా ఒక చట్టం చేశారంటే దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అమరావతిలో తాత్కాలికంగా భవనాలు కట్టినట్లే అమరావతిని తాత్కాలిక రాజధానిగా చంద్రబాబు పెట్టారు. అమరావతికి ఒక అడ్రస్ లేకుండా చంద్రబాబు చేశారు. అమరావతిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నలు సంధించారు. అదే విధంగా.. ‘పవన్ కల్యాణ్ గతంలో రాజధానికి ఐదు వేల ఎకరాలు సరిపోతాయని చెప్పారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని గతంలో పవన్ చెప్పారా లేదా. ఇప్పుడు మంత్రులు ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో పవన్ చెప్పనక్కరలేదు. మీలాగా నాకు నటించడం రాదు’ అని పవన్ కల్యాణ్ తీరును దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment