పెదబాబు శాంక్షన్లు.. చినబాబు కలెక్షన్లు | botsa sathyanarayana fires on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

పెదబాబు శాంక్షన్లు.. చినబాబు కలెక్షన్లు

Published Mon, Mar 7 2016 1:48 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

పెదబాబు శాంక్షన్లు.. చినబాబు కలెక్షన్లు - Sakshi

పెదబాబు శాంక్షన్లు.. చినబాబు కలెక్షన్లు

హైదరాబాద్: రాజధాని భూబాగోతంపై విచారణ చేస్తారా లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అసైన్డ్ భూములను ఎవరైనా కొనుక్కోవచ్చా లేదా అన్నారు. దైవసాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు, ప్రజలందరికీ ఏమని చెప్పారు? అని నిలదీశారు. రాగద్వేషాలకు అతీతంగా, ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎవరితోనూ ఈ విషయాలను తెలియజెప్పకుండా నా ధర్మాన్ని నిర్వర్తిస్తానని చెప్పారా లేదా? అలా ప్రమాణం చేసిన మీరు, మంత్రులు రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని, అక్కడి అమాయక రైతుల వద్ద తక్కువ ధరకు భూములు కొని వందల కోట్లు వెనకేసుకుంది నిజమా కాదా అని ప్రశ్నించారు.

పెద్దబాబు శాంక్షన్లు చేస్తుంటే చినబాబు వసూళ్లు చేస్తున్నారని అన్నారు. పార్టీ పరంగా తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ప్రాంతానికి వ్యతిరేకం కాదని, రాజధాని పేరిట జరుగుతున్న దోపిడీ, అవినీతిని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని దానిమీద విచారణ జరపాలని ప్రతిపక్షంగా కోరుతున్నారు. అయినా, ఇప్పటి వరకు దానిపై సమాధానం ఎందుకు లేదన్నారు. వేమూరు రవికుమార్ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఆయనకు ఐటీ విభాగంలో ప్రధాన పదవి కట్టబెట్టారని, లోకేశ్కు సన్నిహిత సహచరుడని, ఆయన పేరు మీద భూములు కూడా కొన్నారని అన్నారు.

'రాజధాని ప్రకటించకముందే భూములు కొన్నారన్నది అభియోగం. 500 ఎకరాలు కొన్నారని, 50 కోట్లు చెల్లించారని, 650 కోట్లు వచ్చాయని చంద్రబాబు అంటున్నారు. ఆయన, ఆయన భార్య, బంధువులు కొనుక్కుంటే తప్పేంటని చంద్రబాబు అంటున్నారు. ఈరోజు అక్కడ భూములు కొనుక్కుని వ్యాపారం, వ్యవసాయం ఏం చేసుకున్నా తప్పులేదు.. కానీ, ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి.. నీ కుమారుడితో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి ఆ ప్రాంతంలోనే ఎందుకు అన్ని భూములు కొనాలి? అక్కడేమైనా బంగారం పండుతుందా? ఒక వేళ విశాఖలో భూములు కొంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఎందుకు కొన్నారని అడిగితే సమాధానం లేదు' అని బొత్స అన్నారు.

'నారాయణ ఇంకో మాట చెబుతున్నారు. ఆయన సంస్థలో కర్ణాటకలో పనిచేస్తున్న ప్రమీల అనే మహిళ అక్కడ 17 ఎకరాలు కొన్నారు. ఆయన బావమరిది సాంబశివరావు కూడా కొన్నారు. వాటన్నింటికీ సమాధానం చెప్పకుండా.. కొనుక్కుంటే తప్పేంటని అడుగుతున్నారు. ఇక రావెల కిషోర్ బాబు భార్య శాంతిజ్యోతి పేరు మీద అసైన్డ్ భూములు కొన్నారు. అసలు అలా అసైన్డ్ భూములను ఎవరైనా కొనొచ్చా? మంత్రులు ఎవరైనా కొంటే.. అలా కొనడం తప్పని ముందు చెప్పాలి. తర్వాత ఏ శిక్ష విధిస్తారో ప్రజలకు చెప్పాలి. కానీ అదేది ఇప్పటి వరకు లేదు' అని బొత్స చెప్పారు.

పక్క ఊరే కావడం వల్ల ధూళిపాళ్ల నరేంద్ర కొనుక్కున్నారని అనుకోవచ్చని, అయితే, 50 ఎకరాలు అగ్రిమెంటు, 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అవన్నీ పోరంబోకు భూములని వాటిని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని నిలదీశారు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇలాగే కొన్నా, దానికీ సమాధానం లేదని చెప్పారు. కేవలం 500 లావాదేవీలే జరిగాయని, అంతా కలిపి 400 ఎకరాలు కూడా ఉండదని చంద్రబాబు చెప్పారు. అదే నిజమైతే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ వెబ్‌సైట్‌ను ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది? అని బొత్స ప్రశ్నించారు. నేడు పర్వదినం అని, తప్పు మాట్లాడితే ఆ పాపం వదలదని చెప్పారు. ఏ కారణంతో ఇదంతా చేశారో సమాధానం చెప్పాలని, ఊకదంపుడు ఉపన్యాసాలు ఆపాలని డిమాండ్ చేశారు? అలా చెబితే ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు, అమాయకత్వం అవుతుందని అన్నారు.

కృష్ణా కరకట్టపై లింగమనేని ఎస్టేట్ ఒక అక్రమ కట్టడం అని చెప్పారు. దానికి ప్రభుత్వ ఖర్చుతో ఎందుకు మరమ్మతులు చేయించారని, అక్రమ కట్టడంలో చంద్రబాబు ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. వైఎస్ హయాంలో తమపై ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించామని అలాంటి విచారణ మీరు ఎందుకు జరిపించరని ప్రశ్నించారు. భూదందాపై మీరే కేంద్రానికి లేఖ రాసి సీబీఐ విచారణ జరిపించుకోవాలని, బీజేపీ నేతలు కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement