బాబు ఘరానా మోసగాడు
- కదిరి నియోజకవర్గ ప్లీనరీలో వైఎస్సార్‌సీపీ నేతలు
- ఎవరినోట విన్నా మోసపోయామన్న మాటే : ఎంపీ మిథున్‌రెడ్డి
- బాబు అంతటి అవినీతిపరుడు మరొకడు లేడు : శంకరనారాయణ
కదిరి : చంద్రబాబు ఘరానా మోసగాడని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. కదిరిలో శనివారం వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నదీం అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లి ఎవరిని పలకరించినా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని, ఇక ఆయన మాటలు నమ్మే ప్రసక్తే లేదంటున్నారని చెప్పారు. హామీ మేరకు ఆయన రైతుల రుణాలను మాఫీ చేయలేదని, ఇప్పటికే ఎంతోమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన చెందారు. ఆ కుటుంబాలన్నింటినీ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వరుస కరువులతో అనంతపురం జిల్లా ముఖ్యంగా కదిరి ప్రాంత ప్రజలు వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, ప్రభుత్వం ఏ మాత్రం ఉపశమన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీలో ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. అలాగే సిద్దారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. శంకర్‌నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే మరొకరు లేరన్నారు. ఆయన పాలనలో అవినీతి పెరిగిపోయిందని, దాని గురించి చెప్పుకొంటూ పోతే సమయం సరిపోదని అన్నారు. రైతులకు న్యాయబద్దంగా అందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వెంటనే రైతుల ఖాతాలో జమ చేయకపోతే పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నదీం అహమ్మద్ మాట్లాడుతూ చంద్రబాబుకు ముస్లిములంటే అస్సలు గిట్టదని, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మైనార్టీ కూడా లేరని అన్నారు. మతతత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ కూడా ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించిందని, చంద్రబాబు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదని, ఆయన ముస్లింల ద్రోహి అని విమర్శించారు. ముస్లింలకు న్యాయం జరిగేది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనేనని చెప్పారు.
ఎన్నికలెప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు : సిద్ధారెడ్డి
మూడేళ్లకే చంద్రబాబు పాలనపై విసిగివేసారిన ప్రజలు ఎన్నికలెప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ.సిద్ధారెడ్డి అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన ప్రజలను కూడా ఎంతోమందిని వేధించారన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుని రాజన్న రాజ్యాన్ని మళ్లీ చూద్దామని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, వైఎస్సార్‌సీపీ మడకశిర సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, పార్టీ సీఈసీ సభ్యులు జక్కల ఆదిశేషు, పూల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఫర్హానా ఫయాజ్, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.