దోచుకోవడమే టీడీపీ ధ్యేయం | ysrcp pleanary in kalyanadurg | Sakshi
Sakshi News home page

దోచుకోవడమే టీడీపీ ధ్యేయం

Published Sun, Jun 4 2017 11:49 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

దోచుకోవడమే టీడీపీ ధ్యేయం - Sakshi

దోచుకోవడమే టీడీపీ ధ్యేయం

- దుర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి : అనంత వెంకట్రామిరెడ్డి
- మనవడికి అవినీతి పాఠాలు నేర్పిన బాబు : విశ్వేశ్వరరెడ్డి
- మూడేళ్లలో అభివృద్ధి గుండు సున్నా : శంకర నారాయణ
- రాజన్న రాజ్యాన్ని తీసుకొద్దాం : గురునాథ్‌రెడ్డి
- జగన్‌ సీఎం కావడం తథ్యం : డాక్టర్‌ తిప్పేస్వామి
- కళ్యాణదుర్గం ప్లీనరీలో టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు


కళ్యాణదుర్గం : టీడీపీ పాలన దోచుకోవడమే ధ్యేయంగా సాగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అనంత మాట్లాడుతూ ప్రజలు టీడీపీ నాయకులను నమ్మి ఓట్లేస్తే వారు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతి పనిలోనూ దోచుకోవడానికి చూస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణదుర్గం అభివృద్ధి చెందిందంటే దివంగత లక్ష్మీదేవమ్మ, అనంత వెంకటరెడ్డిల హయాంలోనేనని, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీతోనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఆ నమ్మకాన్ని ప్రజలకు కలిగించేలా ధైర్యంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైఎస్సార్‌ సిద్ధాంతాలతో ఏర్పడ్డ వైఎస్సార్‌సీపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. ఎన్ని కష్టాలు కలిగించినా అధికార పార్టీ దౌర్జన్యాలకు లొంగని కార్యకర్తలు ఇక్కడ ఉన్నారని, ఐకమత్యంతో, క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు. పరిటాల రవి మంత్రిగా ఉంటూ శాసిస్తున్న సమయంలోనూ ఎదురొడ్డి పోరాడిన నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎందరో ఉన్నారన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలతో విసిగిపోయిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆ పార్టీని ఓడించాలనే కసి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆయన కుమారుల చేతుల్లో బందీ అయ్యారని, వారు ఎమ్మెల్యే పీఠాన్ని అవినీతి పీఠంగా మార్చుకున్నారని విమర్శించారు. భవిష్యత్‌లో గాలిని సైతం తమ అనుమతితోనే పీల్చుకోవాలనే స్థాయికి టీడీపీ నాయకులు దిగజారారని, ఇలాంటి పరిస్థితుల్లో అందరం ఐకమత్యంతో పోరాడి ఇక్కడ కూడా వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.

- ప్లీనరీ పరిశీలకుడిగా హాజరైన ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పాలు తాగే మనువడికి అవినీతి పాఠాలు నేర్పిన ఘనుడు సీఎం చంద్రబాబు అని విమర్శించారు. అక్షరాభ్యాసం సమయంలో అ - అంటే అమరావతి, ఆ - అంటే ఆదాయమని, అమరావతిలో ఆదాయం ఉందంటూ మనువడికి విద్య నేర్పిన చరిత్ర సీఎంకే దక్కిందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సమాధానం చెప్పాలంటే చంద్రబాబు వణికి పోతున్నారన్నారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారన్నారు. పరిస్థితి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉందని, అందరూ ఐకమత్యంతో టీడీపీ అరాచకాలు, మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి, నిరంకుశత్వం, అప్రజాస్వామిక పాలన తప్ప చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చారన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆయన భయపడకుండా ప్రత్యేక హోదా కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు.

- పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు మూడేళ్ల పాలనలో అభివృద్ధి గుండుసున్నా అన్నారు. జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు వరకు అవినీతిలో కూరుకుపోయారన్నారు. ఇసుకను తైలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారని, నీరు - చెట్టు పథకంలో నిలువు దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పట్టిసీమలో 600 కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ అక్షింతలు వేసినా వారికి సిగ్గు రాలేదన్నారు. జిల్లాలో టీడీపీని ఆదరించినా ప్రజాప్రతినిధులు చేసిందేమీ లేదన్నారు. టీడీపీ నాయకులు పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. హంద్రీనీవా నీరు రావాలంటే జగన్‌ సీఎం కావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగేందు కోసం వైఎస్సార్‌సీపీని గెలిపించి రాజన్న రాజ్యాన్ని తీసుకొద్దామన్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు కూడా ఎవరి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో గుర్తించాలని ఆయన కోరారు. వైఎస్సార్‌సీపీ మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి మాట్లాడుతూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. కళ్యాణదుర్గంలో ఉషాశ్రీచరణ్‌ గెలవడం కూడా ఖాయమన్నారు. దళితులంతా టీడీపీ మోసాలను గ్రహించి వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలన్నారు.

సేవ చేయడానికే వచ్చా.. ఒక్క అవకాశం ఇవ్వండి
‘ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆశీస్సులతో కళ్యాణదుర్గం వచ్చా.. అందులో భాగంగానే గడపగడపకూ తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి’ అని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌ కోరారు. ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తుండగా టీడీపీ అడ్డుకుందని, ఇక నుంచి మరీ ఎక్కువగా ఉచిత కంటి ఆపరేషన్లు చేపడతామని అన్నారు. వికలాంగులకు కృత్రిమ అవయవాలు కూడా అందజేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నం కుటుంబ సభ్యుల లావాదేవీలు లక్షలు, కోట్లకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. కళ్యాణదుర్గం చెరువులకు నీరు నింపేదాక పోరాటాలు చేస్తామన్నారను. మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందంటూ.. ఎమ్మెల్యే రోజా, తహసీల్దార్‌ వనజాక్షి ఉదంతాలను ప్రస్తావించారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం అందరితో కలిసి శ్రమిస్తానన్నారు.
- ఉషాశ్రీచరణ్, కళ్యాణదుర్గం సమన్వయకర్త

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement