
దొంగలు ఏకమవుతున్నారు
- ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని బలోపేతం చేయాలి
- జగన్ సీఎం అయితేనే ప్రజలకు న్యాయం
- మడకశిర వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ఎంపీ మిథున్‌రెడ్డి
- ఇక్కడి నుంచే బోణీ కొట్టాలి : శంకరనారాయణ
- చంద్రబాబు అబద్ధాల కోరు : గురునాథరెడ్డి
మడకశిర : రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా మరోమారు దొంగలందరూ ఏకమవుతున్నారని, వారి ప్రయత్నాలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఇన్‌చార్జ్, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. మడకశిరలోని శ్రీ సరస్వతీ విద్యామందిరం ఆవరణలో గురువారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి అధ్యక్షతన ప్లీనరీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మిథున్‌రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, ప్లీనరీ ఇన్‌చార్జ్ గిర్రాజు నగేష్ తదితరులు హాజరయ్యారు. ముందుగా నేతలందరూ అమరాపురం బస్టాండులోని వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.
అనంతరం ర్యాలీగా బయల్దేరి సభాస్థలికి చేరుకున్నారు. ప్లీనరీలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ 2018లోనే ఎన్నికలు వస్తాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్సార్ హయాంలో పార్టీలకు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తే, ఈ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిధులు లేవని టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నీరు - చెట్టు పనులకు మాత్రం నిధులు ఉంటాయా అని ప్రశ్నించారు. కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని కాపాడుకోవాలని సూచించారు. జగన్ సీఎం అయితే కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్దన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, జిల్లా కార్యదర్శులు రంగేగౌడ్, వాగేష్, డాక్టర్ దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
సైనికుల్లా పనిచేయాలి - పార్టీ రాష్ట్ర నేత గిర్రాజు నగేష్
పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం కావాలి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సైనికుల్లా పని చేయాలి. ప్రజాకంటక టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి.
చంద్రబాబు పిట్టలదొర - అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి
చంద్రబాబు పిట్టలదొర. సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. జిల్లాలోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. మడకశిరలో వైఎస్సార్‌సీపీని గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలి.
ఇక్కడి నుంచే బోణీ కొట్టాలి - వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ
వైఎస్సార్ హయాంలో మడకశిర నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే బోణీ కొట్టాలి. జగన్‌ను సీఎం చేయాలి. జిల్లాలోని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అవినీతిలో కూరుకుపోయారు. అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి - ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
బెల్టుషాపులను తొలగించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. హామీలను నిలబెట్టుకోలేని బాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. అలగే జగన్‌ను సీఎం చేసే బాధ్యతను పార్టీ శ్రేణులు భుజానికెత్తుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది.
చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలి
చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచారు. ఆయన పాలనకు చరమగీతం పాడాలి. పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అక్రమార్జనపై దృష్టి పెడుతున్నారు. గతేడాది వేరుశనగ నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం, బీమా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రుణాలు మాఫీ కాక రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతుంటే నయవంచన దీక్షలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తూ అందరికీ అండగా ఉంటుంది. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి.
- డాక్టర్ తిప్పేస్వామి, వైఎస్సార్‌సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త