
రైతు సమస్యలపై వైఎస్సార్‌సీపీ ధర్నా
మడకశిర : రైతు సమస్యలపై వైఎస్సార్‌సీపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మడకశిరలో గురువారం ఆందోళన నిర్వహించారు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు కే ఆనందరంగారెడ్డి, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రైతు విభాగం కార్యదర్శి ఎస్.ఆర్.అంజనరెడ్డి మాట్లాడుతూ 2015కు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే ఇవ్వాలన్నారు.
పంటబీమాకు ముడిపెట్టకుండా 2016కు సంబంధించిన పంట నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. పశువులకు గడ్డి, దాణాను ఉచితంగా సరఫరా చేసి ఆదుకోవాలన్నారు. ఉపాధి పథకం ద్వారా కూలీలకు విరివిగా పనులు కల్పించాలని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణ మాఫీని అమలు చేయాలని తెలిపారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక డిప్యూటీ తహసీల్దార్ శ్యామలాదేవికి అందజేశారు. ఈ ధర్నాలో మండల కన్వీనర్ ఈచలడ్డి హనుమంతరాయప్ప, కౌన్సిలర్ పార్వతమ్మ దాసన్న, స్థానిక నాయకులు దశనాథ్‌రెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, హిద్దూ, టైలర్ వెంకటేష్, ఉగ్రప్ప, మంజు, రాము, తిమ్మారెడ్డి, ఉదుగూరు నాగరాజు, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.