కేసులెన్ని పెట్టినా పోరుబాటే!
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన స్పష్టీకరణ
► బాధితుల తరఫున జగన్ నాయకత్వంలో పోరాటం
► అణచి వేయాలనుకుంటే ప్రభుత్వానికి భంగపాటే
► ప్రజలను జలగల్లా పీల్చి పిప్పిచేస్తున్న జన్మభూమి కమిటీలు
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: అధికారమదంతో టీడీపీ నాయకులు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వైనాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, ఇది అభివృద్ధిని అడ్డుకోవడమెలా అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగంతో అడ్డుకోవాలనుకుంటే భంగపాటు తప్పదన్నారు. హామీల వలవేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు మూడో సంవత్సరం గడిచిపోతున్నా ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గార మండలం శ్రీకూర్మంలో సర్పంచ్ బరాటం రామశేషు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ధర్మాన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వేలాది సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికీ గండికొడుతూ జన్మభూమి కమిటీలను స్థానిక సంస్థల నెత్తిన రుద్దిందని విమర్శించారు. పింఛను, రేషన్‌కార్డు ఉన్నవారికి తీసేయడం, కావాల్సిన వారికి కుంటిసాకులు చెప్పి అందకుండా చేయడం జన్మభూమి కమిటీల పనిగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న సర్పంచుల అధికారాలను హరిస్తున్న కిరికిరి కమిటీలనే ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికలుగా భావిస్తున్నారంటే ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తే ప్రపంచం మెచ్చే గొప్ప రాజధాని కడతానని చంద్రబాబు చెబుతుంటారని, మళ్లీ అదే నోటితో మరో 50 ఏళ్ల వరకూ నిర్మాణం పూర్తికాదనీ చెబుతారని విమర్శించారు. రాజధాని పూర్తయ్యేవరకూ పింఛను కోసం పండుటాకులు ఎదురుచూడాల్సిందేనా అని ప్రశ్నించారు.
ఒక్కరికై నా హామీలు నెరవేర్చారా?...
రుణాలు మాఫీ చేస్తానన్న కల్లబొల్లి మాటలతో డ్వాక్రా మహిళలను మోసం చేశారని, లక్ష రూపాయల రుణానికి రూ.30 వేల చొప్పున పెరిగిపోరుున వడ్డీ ముందు రూ.3 వేలు ఏమూలకు వస్తుందని ధర్మాన ప్రశ్నించారు. రైతులు బ్యాంకు మెట్లు ఎక్కలేని పరిస్థితి తెచ్చారని విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలని జిల్లా అంతటా నినాదాలు రారుుంచారని, ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలని నిరుద్యోగ యువత కోరుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఐదేళ్ల పాటు విద్యుత్తు చార్జీలు పెంచని ఘనత వైఎస్‌ది అరుుతే చాపకింద నీరులా విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను వడ్డిస్తున్న గొప్పతనం చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు.
ఇవేమి కేబినెట్ మీటింగ్‌లు?
పజలకు మేలు చేసే ప్రతిపాదనలపై చర్చించే అవకాశం రాలేదని చెబుతున్నారని, అదే అనుయాయులకు భారీ ఎత్తున భూపందేరానికి మాత్రం నిర్ణయాలు జరిగిపోతున్నాయని... ఇవేమి కేబినెట్ మీటింగ్‌లని ధర్మాన విమర్శించారు. కేబినెట్ సమావేశాల్లో చర్చ ఉండదని, ప్రజల సంక్షేమానికి నిర్ణయాలే ఉంటాయని గుర్తు చేశారు. తప్పు చేసి గొప్పగా చెప్పుకోవడమూ చంద్రబాబుకు, టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. డబ్బు కట్టలతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు నల్లధనం విషయం పసుపు కండువాలేసి వారిని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు తెలియదా? అని ధర్మాన ప్రశ్నించారు. ఇలాంటి మోసపూరిత టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మం గడ్డపై నుంచే ప్రారంభమవ్వాలని పిలుపునిచ్చారు.