
'ఒంగోలు జాతి గిత్తలను వృద్ధి చేయాలి'
న్యూఢిల్లీ : ఒంగోలు జాతి పశుసంపదను కాపాడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్కి వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం న్యూఢిల్లీలో రాధామోహన్ సింగ్తో వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఒంగోలు జాతి గిత్తల కృత్రిమ పిండాలు బ్రెజిల్కు ఇవ్వవద్దని రాధామోహన్ సింగ్ను కోరినట్లు చెప్పారు. దొడ్డిదారిలో ఒంగోలు జాతి గిత్తల కృత్రిమ పిండాలను బ్రెజిల్ తీసుకుంటుందని ఆరోపించారు. కృత్రిమ పిండాలు ఇస్తే భారత్ తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బ్రెజిల్లో పశు సంపద వృద్ధికి అనుసరిస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని మనదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశానికి గర్వకారణమైన ఒంగోలు జాతి పశువులను వృద్ధి చేయాలన్నారు. పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహించాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.