'జన్మభూమి కమిటీల అక్రమాలపై పార్లమెంట్ లో పోరాడుతాం'
ఒంగోలు: జన్మభూమి కమిటీల ఏర్పాటు, నిర్వహణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జన్మభూమి కమిటీల వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని.. ఆ కమిటీల అరాచకాలపై పార్లమెంట్లో పోరాడతామన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలకు జన్మభూమి కమిటీ బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన వ్యతిరేకించారు. నిఘా వ్యవస్థ నిద్రపోవడం వల్లే తూర్పుగోదావరి జిల్లా తుని కాపు గర్జనలో దుర్ఘటన చోటుచేసుకుందని.. రైలు తగలబెట్టడం అంటే గడ్డి వాములు తగలబెట్టడం కాదని.. రిజర్వేషన్ల కోసం కాపులు చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి ఉందన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఒంగోలు ఎంపీ ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా ప్రాజెక్టుపై జాప్యం చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయడం లేదని విమర్శించారు. పోలవరానికి తక్షణమే రూ.2 వేల కోట్లు మంజూరు చేయాల్సిందిగా సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా ప్యానెల్ ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. పోలవరం అథారిటీని ఏర్పాటుచేయాలని ప్యానెల్ను కోరినట్లు సుబ్బారెడ్డి వివరించారు.