
పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు..
విశాఖపట్నం: ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం గుడివాడ అమర్‌నాథ్ చేపట్టిన దీక్షకు ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. అమర్నాథ్ చేపట్టిన దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరిన సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా రైల్వే జోన్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా రైల్వే జోన్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలపై పలుమార్లు ప్రధానమంత్రిని కలిసినా, పార్లమెంట్లో లేవనెత్తినా కూడా ఫలితం మాత్రం లేదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కేవలం 200 కోట్లతో 2018 నాటికి పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనూ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.