ఇదో‘రాజ’ మార్గం
ఇదో‘రాజ’ మార్గం
Published Sat, Jan 21 2017 11:35 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
- రూ 20 లక్షలు కొట్టేసే ఎత్తుగడ
- విద్యార్థుల పేరు చెప్పి కొల్లగొట్టే యత్నం
- మూడేళ్ల క్రితం రూ.8 లక్షలతో రహదారి నిర్మాణం
- అదే రోడ్డుపై మళ్లీ రూ.20 లక్షలతో...
- జెడ్పీ స్కూలు పక్కన నేతల ఇళ్లుండడమే అవినీతికి కారణం
- మెట్టలో ముఖ్యనేత బాగోతం
సాక్షి ప్రతినిధి కాకినాడ: తన గొప్ప కోసం పార్టీ నేతల మెప్పు కోసం ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఒక ముఖ్య నేత పక్కా ప్లాన్ వేశారు. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ . 20 లక్షలు పనుల పేరుతో జేబులు నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు జిల్లా పరిషత్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. విద్యార్థులు పేరుచెప్పి నిక్షేపంలా ఉన్న సీసీ రోడ్డుపై మరో ‘రాజ’మార్గం వేసి ఈ దోపిడీకి తెరతీశారు. ఒక టీడీపీ ముఖ్యనేత బాగోతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
కార్పొరేట్ రహదారే...
మెట్ట ప్రాంతలో ప్రత్తిపాడు ప్రధాన రహదారి నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు మూడేళ్ల క్రితం రూ.8 లక్షలతో 300 మీటర్లు సిమెంట్ రోడ్డు వేశారు. ఈ రోడ్డును అనుకుని డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మరో ఇద్దరు టీడీపీ నేతల ఇళ్లున్నాయి. అప్పట్లో విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టారు. నిక్షేపంలా ఉన్న ఈ రోడ్డుపై రూ.10 లక్షలు వెచ్చించి హడావుడిగా పైన మరో రోడ్డును ముఖ్యనేత ప్రోద్బలంతో వేశారు. జిల్లాలో మరెక్కాడా ప్రజలు నడిచేందుకు ఇటువంటి రోడ్డు భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించదు. ఈ రోడ్డుపై పార్కింగ్ టైల్స్ వేశారు. ఈ విధమైన రోడ్డు పెట్రోల్ బంకులు, స్టార్ హోటల్స్ పార్కింగ్ స్థలాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇటీవల ఆ నేత ఇంట ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా నలు మూలల నుంచి అధికార పార్టీ నేతలు వస్తారని హడావిడిగా ఆ రోడ్డు వేయించారు. పాఠశాల విద్యార్థులకు, స్థానికుల కోసమనే ముసుగు వేసి, తన స్వప్రయోజనం కోసం ఈ హంగామా చేశారు. ఇది ఒక వైపు మాత్రమే. రెండో వైపున మరో రూ.10 లక్షలు వెచ్చించి మరో సిమెంట్ రోడ్డును కూడా వేయించుకున్నారు. ఇవన్నీ కూడా ఆ ముఖ్యనేత అనుచరుడే దగ్గరుండి వేయించాడు. రెండు రోడ్లు పని ముందు పూర్తి చేయిచేస్తే తరువాత ఏదో ఒక పద్దు నుంచి బిల్లులు చేయిస్తానని భరోనిచ్చారు. ఈ నేపధ్యంలో డిసెంబర్ నెలలో వేడుకల నాటికి పనులు పూర్తి చేసి అప్పగించారు. ఈ రెండు పనులకు సంబంధించి రెండు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు మండల పరిషత్ అధికారులపై ఒత్తిడి తెచ్చి బిల్లుల కోసం జెడ్పీకి పంపించే పనిలో ఉన్నారు.
బిల్లుల కోసం ఒత్తిళ్లు...
రూ.20 లక్షలు వెచ్చించి పనులు చేసిన ఆ నాయకుడు ప్రస్తుతం బిల్లులు మంజూరు చేయించుకునేందుకు ఒత్తిడి తీసుకువస్తున్నారు. జిల్లా పరిషత్‌లో ఇదివరకటిలా నిధులు అందుబాటులో లేవు. ఏదో ఒక రకంగా సర్దుబాటు చేయాలంటూ ఆ నేత జెడ్పీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అవసరం లేకున్నా అడ్డంగా రోడ్లు వేసి నిధులు నొక్కేందుకు ఈ నేతలు చేస్తున్న ప్రయత్నాలపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే మండలంలో రోడ్లన్నీ అధ్వానమే...
ఇదే మండలంలోని చాలా గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారి జనం నరకం కళ్ల చూస్తున్నారు. ఆ రోడ్లను ఆధునికీకరించాలని జనం మొత్తుకుంటున్నా పాలకులకు చెవికెక్కటం లేదు. ఇందులో జెడ్పీ హైస్కూల్‌కు ఒక పక్కన అవసరం లేకపోయినా లక్షలు కుమ్మరించి వేసిన సిమెంట్ రోడ్డు, పార్కింగ్ టైల్స్‌ను వేసుకున్నారు. కానీ స్కూల్‌కు మరో పక్కన ఎస్సీ, బీసీలు నివసించే తోటవీధి, క్వారీ కాలనీల్లో పట్టుమని పదివేలు కూడా వెచ్చించటానికి నేతలకు చేతులు రాలేదు.ఎస్సీ బీసీల నివాసం ఉండే ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి తమ ఇంటి చుట్టూ మాత్రం రోడ్లు వేయించుకున్నారని స్థానికులు నేతలపై మండిపడుతున్నారు. వీటితోపాటు మండలంలో 37 గ్రామాలకు ప్రధాన రహదారైన రాచపల్లి అడ్డు రోడ్డు జంక‌్షన్ నుంచి రాచపల్లి వరకు జెడ్పీ రోడ్డు మరమ్మతులు లేక అధ్వాన స్థితికి చేరుకుంది. గోకవరం వద్ద రోడ్డు శిథిలమైంది. ఒమ్మంగి – శరభవరం గ్రామాల మధ్య ఆర్ అండ్ బీ రోడ్డు (తారు రోడ్డు) నామరూపాలు లేకుండా పోయి గ్రావెల్ రోడ్డుగా మారిపోయింది. రాళ్లు లేచి కాళ్లు గొప్పులు కట్టేస్తున్నాయి. అయినా దీని కోసం నేతలు పట్టించుకోరా అని ఆ ప్రాంతవాసులు ధ్వజమెత్తుతున్నారు.
Advertisement
Advertisement