హైకోర్టు లోకాయుక్త ఆదేశాలు బేఖాతర్
హైకోర్టు లోకాయుక్త ఆదేశాలు బేఖాతర్
Published Thu, May 4 2017 11:05 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
ఇందిరాసత్యనగర్ పుంత ఆక్రమణదారులకు
అనుకూలంగా హైకోర్టు, లోకాయుక్త ఆదేశాలు
ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థ
అమలు కాని కోర్టు, లోకాయుక్త ఆదేశాలు
రోడ్డు పేరుతో ఇళ్ల తొలగింపునకు పూనుకున్న యంత్రాంగం
రాజమహేంద్రవరం నగరంలోని ఇందిరా సత్యనగర్ పుంతవాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని హైకోర్టు , లోకాయుక్తలు ఆదేశించాయి. అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నేటి పాలకులు తాము అనుకున్న విధంగా ముందుకు సాగుతున్నారు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, రాజమహేంద్రవరం: నగరంలోని ఇందిరా సత్యనగర్ పుంత (పీఅండ్ టీ కాలనీ) నివాసితుల వివాదం ఎన్నో దశాబ్దాలుగా సాగుతోంది. 44, 47 డివిజన్ల పరిధిలోని రెవెన్యూ సర్వే నంబర్ 89లో ఉన్న ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డును 80 అడుగుల నుంచి తగ్గించాలని 1989లో రాజమండ్రి పురపాలక సంఘం చైర్మన్‌గా ఏసీవై రెడ్డి ఉన్న సమయంలో తీర్మానించారు. అక్కడే ఆక్రమణదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గ్రామీణ, పట్టణ ప్రణాళిక విభాగాన్ని అనుమతి కోరుతూ 1989 డిసెంబర్ 11వ తేదీన తీర్మానం నంబర్ 666 చేశారు. ఆ తీర్మానాన్ని నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఆతర్వాత మరో పదేళ్లకు 1998 జనవరి 1వ తేదీన ఆ రోడ్డును 80 అడుగుల నుంచి 40 అడుగులకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 19, ఎంఏ జారీ చేసింది. అనంతరం పుంతలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలు 1989లో అప్పటి పురపాలక సంఘం చేసిన తీర్మానాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టును (డబ్యూపీ నం.22093/2005) ఆశ్రయించారు. అప్పుడు నగరపాలక సంస్థ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో పుంతలో రోడ్డు వేసేందుకుగాను అక్కడ ఉన్న ఆక్రమణదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో చోట పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. పూర్వాపరాలు విచారించిన హైకోర్టు ఈ విషయంపై ఆక్రమణదారులు నగరపాలక సంస్థను సంప్రదించాలని తీర్పు వెలువరించింది.
అక్కడే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న లోకాయుక్త...
అదే సమయంలో పుంత వాసులు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఆసంఘం అధ్యక్షుడు పి.బి.ముత్తారావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను ఆశ్రయించారు. రాజమండ్రి పురపాలక సంఘం పుంతలోనే ఆక్రమణదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా చేసిన 666 తీర్మానాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ 1248/2005 ఫిర్యాదు చేశారు. విచారించిన లోకాయుక్త అప్పటి రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.జితేంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ సి.నగరాజారావు, సిటీ ప్లానర్ ఆర్‌జే విద్యుల్లత, ఫిర్యాదు దారులను విచారించింది. వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా 2007 అక్టోబర్ 1న తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం రెవెన్యూ సర్వే నంబర్ 89లోని పోరంబోకు పుంతలో చిరకాలంగా కాపురం ఉంటున్న ఇందిరాసత్యన గర్ వాసులకు రాజమండ్రి నగరపాలక సంస్థ దాఖలు చేసిన ప్లాను ప్రకారం జీ ప్లస్ 1 గ్రూపు ఇళ్లు (6+6) తొమ్మిది బ్లాకులలో 108 మందికి కట్టించి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దానికి నగరపాలక సంస్థ అంగీకారం తెలిపింది.
ఇళ్లు కట్టకుండానే రోడ్డు నిర్మాణానికి యత్నం
లోకాయుక్త ఆదేశాలు జారీ చేసి పదేళ్లు గడచినా ఇళ్ల నిర్మాణానికి నగరపాలక సంస్థ ఎటువంచి చర్యలు చేపట్టలేదు. లోకయుక్త, హైకోర్టు తీర్పులను అమలు చేయకుండానే తాజాగా నగరపాలక సంస్థ యంత్రాంగం అక్కడ 80 అడుగుల రోడ్డు వేసేందుకు పూనుకుంది. దీనిపై పుంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు, లోకాయుక్త తీర్పులు అమలు చేయకుండా తమ ఇళ్లను తొలగించే ప్రయత్నం మానుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు, లోకాయుక్త తీర్పు ప్రకారం తమకు 108 ఇళ్లు కట్టించి ఇచ్చిన తర్వాత 40 అడుగుల మేర రోడ్డు వేయాలని కోరుతున్నారు.
పేదలకు పునరావాసం కల్పించాలి
పుంతలో ఉంటున్న పేదలకు పునరావాసం కల్పించాలి. ప్రస్తుతం వాంబే గృహాలు ఖాళీగా ఉన్న చోట ఇవ్వాలి. అద్దెలు కట్టుకునే స్థోమత వారికి లేదు. ఇళ్లు కట్టించి ఇచ్చిన తర్వాతే రోడ్డు వేయాలని చెప్పాం.
– రేలంగి శ్రీదేవి, 47వ డివిజన్ కార్పొరేటర్
మమ్మల్ని రోడ్డున పడేయకండి
ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇది పోరంబోకు పుంత అయినా బాగు చేసుకుని నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఈ మధ్య కాలంలో జరిగిన పుంత ఆక్రమణలపై విచారణ చేయాలి. కోర్టు, లోకాయుక్త తీర్పులను అమలు చేయాలి. ఆ తర్వాతే రోడ్డు వేయాలి.
– దాసరి జోసెఫ్‌రాజు, పీఅండ్‌టీ కాలనీ
మాకు న్యాయం చేయాలి
ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇప్పడు రోడ్డు వేస్తాం అంటే మేము వ్యతిరేకించడం లేదు. కానీ కోర్టు, లోకాయుక్త తీర్పు ప్రకారం అర్హులైన వారికి వాంబే గృహాలు కట్టించి ఇవ్వాలి. అప్పటి వరకు వారిని ఇబ్బందులు పెట్టవద్దని కోరుతున్నాం.
– కొమ్ము జిగ్లర్, వైఎస్సార్ సీపీ నేత, 44వ డివిజన్
Advertisement
Advertisement