ఎందుకీ సమావేషాలు..? | zptc meetings are running with out members | Sakshi
Sakshi News home page

ఎందుకీ సమావేషాలు..?

Published Mon, Mar 27 2017 7:53 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

ఎందుకీ సమావేషాలు..?

ఎందుకీ సమావేషాలు..?

► నిస్సారంగా జెడ్పీ స్థాయి సమావేశాలు
► కోరం లేక నాలుగు సమావేశాలు వాయిదా
► మంత్రి పుట్టిన రోజే కారణమంటూ గుసగుసలు  


జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచించాల్సిన అపూర్వ వేదిక తన స్థాయి కోల్పోతోంది. సరికొత్త తీర్మానాలకు పురుడు పోయాల్సిన అపురూప ప్రాంగణం నేతల తీరుతో అధ్వానంగా మారుతోంది. అత్యంత కీలకమైన జెడ్పీ స్థాయి సమావేశాలకు నాయకులు కనీస సంఖ్యలోనూ హాజరు కాకపోవడంతో అవి వాయిదాకు దారి తీస్తున్నాయి. ఆదివారం నాటి జెడ్పీ స్థాయి సంఘ సమావేశం తీరు ఈ విషయాలను మరోసారి రుజువు చేసింది.

అరసవల్లి: జిల్లా పరిషత్‌ స్థాయి సమావేశాలు నేతల నిర్లక్ష్య తీరుతో అభాసుపాలవుతున్నాయి. అత్యంత కీలకమైన ఈ సమావేశాలకు నాయకులు హాజరు కాకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఆదివారం కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పుట్టిన రోజు కావడంతో ఆయా ప్రాం తాల్లో టీడీపీ ప్రతినిధులు సంబరాలు చేసుకుని, జెడ్పీ సమావేశాలకు డుమ్మా కొట్టారనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆదివారం మొత్తం 7 జిల్లా పరిషత్‌ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించేందుకు జెడ్పీ సీఈఓ బి.నగేష్‌ అందరికీ ప్రత్యేక ఆహ్వానాలను పంపించారు. ఒక్కో కమిటీలో గరిష్టంగా ఉన్న 9 మంది జెడ్పీటీసీ సభ్యులందరికీ ఈ ఆహ్వానాలు అందాయి. అయితే వీటిని పెద్దగా పట్టించుకోని మన జెడ్పీటీసీలు సమావేశాలను లైట్‌ తీసుకున్నారు. దీంతో కోరం లేకపోవడంతో(కనీస సంఖ్యలో హాజరు లేకపోవడం) 2వ, 3వ, 5వ, 6వ స్థాయి సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇక మిగిలిన మూడు స్థాయి సమావేశాలకు కేవలం ‘కోరం’కు సరిపడే ముగ్గురు (వీరిలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ఒకరు) మాత్రమే హాజరుకావడం విశేషం. అంటే గరిష్టంగా సభ్యుల హాజరు ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమే అని స్పష్టమవుతోంది. అలాగే హాజరైన ప్రతినిధులు కూడా ఏదో వచ్చామా వెళ్లామా అన్న ధోరణి ప్రదర్శించడంతో మిగిలిన సమావేశాలు కూడా నిస్సారంగా ముగిశాయి. నాయకుల నిర్లక్ష్య ధోరణిపై అధికారులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరి వల్ల విలువైన సమయం వృథా అంటూ ఓ కీలక శాఖ అధికారే వ్యాఖ్యానించారు.

అగ్ర నేతల జాడ ఏదీ?: జిల్లా జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలకు జిల్లాకు చెందిన అగ్రనేతలైన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటుంది. ఒక్కో కమిటీలో ఒక్కో అగ్రనేతకు చోటు ఉంటుంది. అయితే ఆదివారం నాటి సమావేశాలకు ఒక్క అగ్రనేత కూడా హాజరుకాకపోవడం గమనార్హం. కేవలం మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు కావడంతోనే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు లోకల్‌ కార్యక్రమాలు, పర్యటనల్లో మునిగితేలారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఒక్కరే జరిగిన మూడు స్థాయి సమావేశాలకు కోరంలో ఒక సభ్యురాలిగా ఉండటం విశేషం.

అధికారులే విఫలమయ్యారు: రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, పలు కీలక పథకాలను ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్లడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఆదివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన 1వ, 4వ,7వ స్థాయి సంఘ సమావేశాల్లో మాట్లాడారు. జిల్లా స్థాయి అ ధికారులు ఎప్పటికప్పుడు మండలాల్లో, పంచాయతీల్లో పథకాల అమలును సమీక్షించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోం దని, అయితే వైద్యారోగ్య శాఖ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. అలాగే జెడ్పీ సమావేశాల్లో జెడ్పీటీసీ సభ్యుల తీర్మానాలను అధికారులు పట్టించుకోవడం లేదని, తీర్మానాల తదుపరి చర్యలను సభ్యులకు చెప్పడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఎం.పురంలో రూ.50 లక్షలతో పెద్ద చెరువు పనులకు టెండర్లు ఖరారైనా, నేటికీ పనులు ప్రారంభించకపోవడంపై ఆమె అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు మాత్రం అంతా చేసేస్తామంటూ పాత పాటే పాడారు. పలువురు జెడ్పీటిసీ సభ్యులు కూడా తమ పరి ధిలోని సమస్యలను సంబంధిత అ ధికారులకు విన్నవించుకున్నారు. సమావేశాలకు జెడ్పీ సీఈఓ బి.నగేష్, వయోజన విద్య డీడీ కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి తిరుపతిరావు, డీఈవో సుబ్బారావు, విద్యుత్‌ శాఖ డీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement