
వృత్తి పట్ల నిబద్ధత.. కేసులు ఛేదించడంలో ముందంజ.. చురుకుదనంతో నెరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించడంలో తనకు తానే సాటి.. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మేటి.. కనిగిరి సీఐ మరవనేని సుబ్బారావు. క్లిష్టమైన కేసులను సైతం సవాల్‌కు స్వీకరించి నిందితులను కటకటాల వెనక్కి నెడుతూ డీజీపీ వంటి ఉన్నత స్థాయి పోలీసు అధికారి నుంచి ఆయన శెభాష్ అనిపించుకుంటున్నారు.
కనిగిరి: సీఐ మరవనేని సుబ్బారావు విధి నిర్వహణలో అటు ఉన్నతాధికారుల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. 2004లో గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్‌ఐగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు మంచి పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు. పదోన్నతి తర్వాత 2013లో సీఐడీ సీఐగా నెల్లూరులో పనిచేశారు. సీఐగా పిడుగురాళ్లలో రెండేళ్లు పనిచేశారు. గురుజాలలో ఎస్‌ఐగా పనిచేసినప్పుడు ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం మోపి మంచి పేరు గడించారు. ప్రసుత్తం 12 నెలల నుంచి కనిగిరి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు.
చిరిగిన టికెట్ ముక్కే ఆధారం
2017 ఫిబ్రవరిలో హెచ్‌ఎంపాడు మండలం వేములపాడు ఘాట్ వద్ద కారు దహనమైంది. పక్కనే ఓ మహిళ మృతదేహం ఉండటం అప్పట్లో సంచలనం రేపింది. కారు దహనం సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు సాయంత్రానికి అక్కడికి 100 మీటర్ల దూరంలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు. మహిళను పెట్రోల్ పోసి దారుణంగా శరీరం మొత్తం కాల్చేశారు. కేవలం పాదాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదట్లో ఆ రెండు ఘటనలు ఒకే నేరానికి సంబంధించినవిగా భావించారు. కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన సీఐ సుబ్బారావు.. సంఘటన స్థలంలో దూరంగా పడి ఉన్న చిరిగిన బస్సు టికెట్ ముక్కను గుర్తించారు. దాని ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించి రెండు వేర్వేరు ఘటనలుగా నిర్ధారించారు. వారం రోజుల్లో రెండు కేసులనూ చేధించారు. వివాహేతర సంబంధ నేపథ్యంలో గుంటూరుకు చెందిన మహిళను నిందితుడు వేములపాడు ఘాట్ వద్దకు తీసుకొచ్చి పెట్రోలు పోసి కాల్చి దారుణంగా హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడికి సైతం సంకెళ్లు వేశారు. దహనమై ఉన్న కారు దొంగతనం చేసి తీసుకొచ్చిందిగా గుర్తించారు. ఆ కేసులో నిందితులను పట్టుకుని ఉప్పగుండూరు, గన్నవరం, విజయవాడ ప్రాంతాల నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన మూడు కార్లను రికవరీ చేశారు. ఈ కేసులో రాష్ట్ర స్థాయిలో పోలీసు శాఖ ఇచ్చే ఏబీసీడీ అవార్డుల్లో ఆయన నాలుగో స్థానంలో గుర్తింపు పొందారు.
కేసును ఛాలెంజ్‌గా తీసుకోవడం ఆయన ప్రత్యేకం
సంక్లిష్టమైన కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుంటారు. పీసీపల్లి మండలం ఇర్లపాడులో చిన్నారి సియోని (5) లైంగికదాడి, హత్య కేసును సీఐ సుబ్బారావు అత్యంత ఛాలెంజ్‌గా తీసుకుని ఛేదించారు. నిందితుడికి కనీసం అధార్‌కార్డు, రేషన్ కార్డులేదు. ఫోన్ సైతం ఉపయోగించడు. నిందితుడు పేరయ్య చిన్నారిని కిడ్నాప్ చేసిన రోజు (జూన్ 20)న తొలుత చిన్నారి సియోని తండ్రితో జరిపిన సంభాషణ విషయాలు, ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 40 రోజులు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జల్లెడపట్టి కేసును ఒక కొలిక్కి తెచ్చారు. ఆగస్టు 29న గుంటూరు జిల్లా పొన్నూరులో నిందితుడిని సీఐ బృందం పట్టుకుంది. ఈ కేసులో ఎస్పీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. పోలీస్ శాఖ అందించే స్మార్ట్ కాప్ అవార్డును సైతం ఎస్పీ చేతుల మీదుగా తీసుకున్నారు. పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2017 ఏబీసీడీ అవార్డుకు (జూన్, జూలై, అగస్టు)కు సీఐ సుబ్బారావును ఎంపిక చేశారు. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 13న విజయవాడలో అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు చేతులమీదుగా ఏబీసీడీ (అవార్డ్ ఆఫ్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డును సీఐ అందుకున్నారు.
అంతేనా..
రాష్ట్రంలోనే సంచలనం రేపిన రాజమండ్రిలో మసీద్ మౌజన్ హత్య కేసును సీఐ రెండు రోజుల్లో ఛేదించారు. కనిగిరి సీఐతో కూడిన బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడు సంఘటన స్థలంలో వదిలిన రాజఖైనీపై గల వేలిముద్రల ఆధారంగా.. సాంకేతికతను వినియోగించుకున్నారు. డిసెంబర్ 30న దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో సాంకేతికతతో పాటు ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన చోరీ ఘటనలు.. కీలకంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించి రెండు రోజుల్లో అనంతపురం జిల్లా ఉరవకొండలో నిందితుడు మణిరత్నం అలియాస్ మణిని పట్టుకున్నారు. దీంతో సీఐ సుబ్బారావుకు రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందాయి. ఇటీవల కనిగిరి వచ్చిన ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా సీఐ మరవనేనిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment