ఎనిమిదిన్నరేళ్లక్రితం విజయవాడ నగరంలో పదకొండేళ్ల చిన్నారి నాగవైష్ణవిని అపహరించి అత్యంత దుర్మార్గంగా హతమార్చిన మానవ మృగాలకు యావజ్జీవ శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు గురువారం వెలువరించిన తీర్పు ఆ కుటుంబానికి మాత్రమే కాదు...హృదయమున్న ప్రతి ఒక్కరికీ సాంత్వన కలగజేస్తుంది. ఆ ఉదంతం గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పటికీ దిగ్భ్రాంతి కలుగుతుంది. ఆస్తిపాస్తుల కోసం మనుషులెంతకు తెగించగలరో, ఎలాంటి క్రౌర్యానికి ఒడిగట్టగలరో ఆ ఘటన నిరూపించింది. ఎంతో నాగరికంగా కనబడే ఈ సమాజంలో ఇటువంటివారు కూడా మసులుతుంటారా అని అందరూ విస్మయపడ్డారు. వైష్ణవి తన సోదరుడితో కలిసి కారులో బడికెళ్తుండగా దుండగులు ఆ కారును అడ్డగించి ఆమెను అపహరించారు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన గురించి విని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అందరూ భయభ్రాంతులకు లోన య్యారు. ఆమెను ఏం చేశారో, ఎక్కడికి తీసుకెళ్లారో అని ప్రతి ఒక్కరూ ఆవేదనపడ్డారు. ఆమె కుటుంబసభ్యులతోపాటు అందరూ తల్లడిల్లారు. నిజానికి వైష్ణవితోపాటు ఆమె సోదరుణ్ణి కూడా అపహరించి హతమార్చాలని దుండగులు పథకం పన్నారు.
కానీ అపహరణ యత్నాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన డ్రైవర్‌తో వారు తలపడుతున్నప్పుడు బాలుడు అక్కడినుంచి తప్పించుకోగలిగాడు. వారు డ్రైవర్‌ను అక్కడికక్కడే హతమార్చి వైష్ణవిని అపహరించి గుంటూరు జిల్లాకు తీసు కుపోయారు. దారిలోనే ఆమెను హతమార్చి, ఆచూకీ సైతం అందకూడదని భావించి బాయిలర్‌లో బూడిదగా మార్చారు. ఎముకలు సైతం దొరకని పరిస్థితుల్లో వైష్ణవి చెవి పోగుల్లో ఉన్న వజ్రం కేసులో కీలక సాక్ష్యంగా మారింది. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా నేరగాళ్లు తప్పించుకోవడానికి వీల్లేకుండా చేశాయి. తన గారాలపట్టీ లేదన్న వార్త విన్న వెంటనే తండ్రి ప్రభాకర్ కన్నుమూశారు. ఇలా ఇద్దరి ప్రాణాలు తీసి, మరొకరి మరణానికి కారకులైన దుండ గులకు ఇన్నాళ్లకు శిక్ష పడింది.
నేరాలు జరిగినప్పుడల్లా విస్మయపడటం, దుండగులకు కఠిన శిక్షలు పడాలని కోరడం సర్వసాధారణం. ఆ తర్వాత కొన్నాళ్లకే అది మరుగున పడిపోతుంది. ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు. అక్కడే సమస్య మూలాలున్నాయి. సమాజం ఏమరుపాటుతో ఉన్నప్పుడు ఏ వ్యవస్థలూ చురుగ్గా, సక్రమంగా పనిచేయవు. నేరం జరిగినప్పుడు వెనువెంటనే పోలీసు యంత్రాంగం కదలడం, సమర్థవంతమైన దర్యాప్తు చేయడం, పకడ్బందీ సాక్ష్యాధారాలు సేక రించడం ముఖ్యం. వాటిని నివేదించాకే న్యాయస్థానాల్లో విచారణ మొదలవుతుంది. సాక్ష్యా ధారాల్లో లోపాలున్నప్పుడు న్యాయస్థానాలు కూడా నిస్సహాయమవుతాయి. విచారణలు నత్త నడకన సాగుతాయి. ఇప్పుడు వైష్ణవి విషాద ఉదంతంలో కూడా తీర్పు రావడానికి సుదీర్ఘ సమయం పట్టింది.
తన కుమార్తెను హతమార్చడంతోపాటు భర్త మరణానికి కారకులైనవారికి శిక్ష పడాలని ఎదురుచూసిన వైష్ణవి తల్లి నర్మదాదేవి గతేడాది అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ కేసు తీరుతెన్నులను చూస్తూ వచ్చిన ప్రభాకర్ సోదరుడు కూడా చనిపోయారు. వైష్ణవి విషాద ఉదంతంలో ఆమె తండ్రి తప్పిదం కూడా ఉంది. తన మొదటి భార్య సోదరుడు, వైష్ణవికి వరసకు మేనమామ అయిన వెంకటరావు తన ఆస్తిపై కన్నేసి రెండో భార్యపై కుట్రలు పన్నుతున్నాడని తెలిసినా ఆ సమస్యను కుటుంబ పరిధిలోనే సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘోర ఉదంతానికి ఆరేళ్ల ముందు ఇదే వెంకటరావు వైష్ణవిని అపహరించినప్పుడు ఆ సంగతిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా పరిష్కరించుకున్నాడు. రెండోసారి కూడా అలాగే చేయొచ్చునన్న భావనతో చివరి వరకూ అనుమానితులెవరో చెప్పలేదు. ఘటన జరిగిన మరుక్షణం ఆయన దుండగుల ఆనుపానులిచ్చి ఉంటే వైష్ణవిని పోలీసులు రక్షించగలిగేవారేమో.
నేరాలకు గల మూలకారణాలను దుంపనాశనం చేయడం మనలాంటి సమాజంలో అసాధ్యం. ఎంత పకడ్బందీ నిఘా ఉన్నచోటైనా అవి తప్పవు. కానీ నేరం జరిగిన వెంటనే కదిలే యంత్రాంగం ఉన్నప్పుడు, సత్వరం శిక్షలు పడేలా చూసే సమర్ధవంతమైన వ్యవస్థ ఉన్నప్పుడు వాటిని కనిష్ట స్థాయికి పరిమితం చేయడానికి వీలుంటుంది. డబ్బు, హోదా, పలుకుబడి వంటివి దర్యాప్తును ప్రభావితం చేసే దుస్థితి లేకుండా చూడాలి. నేర పరిశోధన చేసే యంత్రాంగానికి మందీమార్బలం తగినంతగా ఉండాలి.
వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంచాలి. దర్యాప్తులపై పటిష్టమైన పర్యవేక్షణ కూడా ముఖ్యం. ఇవన్నీ కొరవడినప్పుడు నేరాలు విజృంభిస్తాయి. నేరగాళ్లు రెచ్చిపోతారు. తమ కేమీ కాదన్న ధీమాతో ఉంటారు. అలాంటి ధీమా ఎవరిలోనూ ఏర్పడకుండా చూడటమే ప్రభు త్వాల కర్తవ్యం కావాలి. వెంటవెంటనే శిక్షలు పడుతుంటే నేరగాళ్ల వెన్నులో చలిపుడుతుంది. ఒక కేసులో పడే శిక్ష ఎందరినో అటువైపు మళ్లకుండా చేస్తుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో అది కరువవుతున్నది.
దేశంలో పిల్లల అపహరణ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మొన్న మార్చిలో విడుదల చేసిన 2016నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక చెబుతోంది. మొత్తంగా పిల్లల అపహరణ, వారిపై అత్యాచారాలు 2006–16 మధ్య 500 శాతం పెరిగాయని ఆ నివేదిక వివ రించింది. రికార్డులకెక్కని వాటిని కూడా కలుపుకుంటే ఈ నేరాల శాతం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం నేరాల్లో పిల్లల పట్ల సాగే నేరాల సంఖ్యే అధికమని ఎన్‌సీఆర్‌బీ నివేదిక అంటున్నది. మహిళల పట్ల నేరాలు ఆ తర్వాతి స్థానంలో ఉంటున్నాయి. ప్రపంచంలో జరిగే అప హరణల్లో 10 శాతం మన దేశంలోనే చోటు చేసుకుంటున్నాయి. వైష్ణవి కేసులో ఇప్పుడు వెలు వడింది కింది కోర్టు తీర్పే. శిక్షపడినవారు ఎటూ అప్పీల్‌కెళ్తారు. ఉన్నత న్యాయస్థానాల్లోనైనా సత్వరం విచారణలు పూర్తయి ఈ శిక్షలు ఖరారు కావాలని ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment