‘మాలెగావ్’ మచ్చ | accuses in malegaon blasts are not involved in incident | Sakshi
Sakshi News home page

‘మాలెగావ్’ మచ్చ

Published Thu, Apr 28 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

‘మాలెగావ్’ మచ్చ

‘మాలెగావ్’ మచ్చ

మహారాష్ట్రలోని మాలెగావ్‌లో పదేళ్లక్రితం సంభవించిన పేలుళ్ల ఉదంతంలో అరెస్టయిన నిందితులంతా నిర్దోషులని ముంబై ప్రత్యేక కోర్టు సోమవారం తేల్చి చెప్పింది. 37మంది మరణానికి, 125మంది గాయాలపాలు కావడానికి దారి తీసిన ఆ ఉదంతం మాలెగావ్ మసీదుకు సమీపంలో ఉన్న ముస్లిం శ్మశానం వద్ద ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో 2006 సెప్టెంబర్‌లో చోటచేసుకుంది. దేశంలో ఉగ్రవాదుల బాంబులు పేలి జన నష్టమూ, ఆస్తినష్టమూ సంభవించి నప్పుడు సమాజంలో భయాందోళనలతోపాటే ఆగ్రహావేశాలు రగులుతాయి. కారకులైనవారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వస్తుంది.

కానీ ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆ ఉదంతాలూ, అవి సృష్టించిన ఆగ్రహావేశాల తీవ్రత చల్లారు తుంది. నిందితులంతా నిర్దోషులని తేలినప్పుడు రెండు రకాల ప్రమాదాలుం టాయి. ఒకపక్క ఉగ్రవాద ఉదంతాలకు పాల్పడినవారు స్వేచ్ఛగా  సంచరిస్తూ మళ్లీ మళ్లీ ఇలాంటి పాపాలకు పథక రచన చేస్తుంటారు. నేరగాళ్లని ముద్రేయించు కున్నవారూ, వారి కుటుంబసభ్యులూ అన్నివిధాలా నష్టపోతారు. వారు నిర్దోషులే నని న్యాయస్థానాలు చెప్పినా కోల్పోయినవి తిరిగి రావు. పైగా అలాంటివారిని జీవితాంతమూ అనుమాన దృక్కులు వెంటాడుతూనే ఉంటాయి.

మాలెగావ్ పేలుళ్ల కేసు చరిత్ర, అది తీసుకున్న మలుపులు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తొలుత దర్యాప్తు చేసిన మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) 9మంది ముస్లిం యువకులు ఈ పేలుళ్లకు కారణమని నిర్ధారించుకుని 2006 డిసెంబర్‌లో చార్జిషీటు దాఖలు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేశాక ఆ సంస్థ సైతం అదే నిర్ధారణకొచ్చింది. అనంతరకాలంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వేరే కోణాన్ని ఆవిష్కరించింది. ఈ పేలుళ్లకు అసలు కారకులు హిందూ అతివాద సంస్థకు చెందిన 8మంది అని తేల్చి వారిలో నలుగుర్ని 2011లో అరెస్టుచేసింది. మరో నలుగురు ఈనాటికీ చట్టానికి చిక్కలేదు. ఎన్‌ఐఏ దర్యాప్తు తర్వాత ఈ కేసులో జైళ్లలో ఉన్న ముస్లిం యువ కులకు బెయిల్ లభించింది.

వీరందరినీ కేసు నుంచి విముక్తం చేయొచ్చునని 2013లో కోర్టుకు ఎన్‌ఐఏ తెలిపింది. తమను నిర్దోషులుగా ప్రకటించాలని కోరుతూ నిందితులు సైతం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై తీర్పు రాబోతున్న తరుణంలో ఈ నెల మొదట్లో ఎన్‌ఐఏ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఈ కేసులో ‘మరింత దర్యాప్తు’ అవసరమని న్యాయస్థానానికి తెలి పింది. అయినా ముంబై ప్రత్యేక కోర్టు మాత్రం నిందితులు నిర్దోషులనే భావిం చింది. కేంద్రంలో ప్రభుత్వం మారబట్టే ఎన్‌ఐఏ తన వాదనను సవరించు కోవడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలను ఆ సంస్థ డీజీ శరత్‌కుమార్ తోసిపుచ్చుతున్నారు. తాము ‘మరింత దర్యాప్తు’ అవసరమన్నామే తప్ప...‘తిరిగి దర్యాప్తు చేయాల’ని చెప్పలేదంటున్నారు. మంచిదే. ఏం చెప్పినా అనవసరమైన అనుమానాలకైతే ఆస్కారమీయకూడదని గ్రహించి ఉంటే బాగుండేది.

పేలుళ్ల కేసులో తొలుత నిందితులుగా భావించినవారొకరైతే అనంతర కాలంలో వేరొకరు దోషులుగా తేలడం ఈ కేసులో మాత్రమే కాదు...వేరే కేసుల్లోనూ జరిగాయి.  మాలెగావ్‌లోనే 2008లో రెండోసారి జరిగిన పేలుళ్ల ఉదంతంలోనూ, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులోనూ ఈ మాదిరే జరిగింది. ఏ తప్పూ చేయనివారు అయిదేళ్లపాటు జైళ్లలో మగ్గడం విషాదకరమని అప్పటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై అన్నప్పటికీ అలాంటి తరహా కేసులు ఏమీ తగ్గలేదు. దర్యాప్తు క్రమమంతా లొసుగులతో నడిచి అమాయకులు జైలుపాలు కావడం, నేరస్తులు బయట పెద్ద మనుషులుగా చలామణి కావడం అన్నది కొనసాగుతూనే ఉంది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు న్నాయన్న ఆరోపణతో అరెస్టయిన ఒక యువకుడు 20 ఏళ్లపాటు జైల్లో గడిపి 2013లో నిర్దోషిగా బయటపడ్డాడు.

మాలెగావ్ కేసులో తొలుత దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు నిందితులపై వ్యక్తిగత ద్వేషమేమీ లేదు గనుక జరిగిన తప్పిదానికి వారిని బాధ్యుల్ని చేయలేమని ముంబై ప్రత్యేక కోర్టు అభిప్రాయ పడింది. ఆ అధికారులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోయి ఉండొచ్చు నన్నది. అయితే క్రిమినల్ కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలినపక్షంలో దర్యాప్తు అధికారులను అందుకు బాధ్యులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతిని ఇక్కడ ప్రస్తావించు కోవాలి. ఉద్దేశపూర్వకంగా దర్యాప్తును భ్రష్టుపట్టించినా, నిర్లక్ష్యంగా వ్యవహ రించినా బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సందర్భంగా న్యాయ మూర్తులు సూచించారు. దర్యాప్తు అధికారులు తెలిసి చేసినా...చేతగాకనో, అనాలోచితంగానో చేసినా ఒక నిండు జీవితంలో చీకట్లు ముసురుకుంటాయి. అంతేకాదు...అసలు నేరస్తులు తమ పని తాము చేసుకుపోతూ సమాజానికి పెద్ద బెడదగా మారతారు.

అయితే దర్యాప్తు అధికారుల్లో  నిపుణత కొరవడటం అన్నది దానికదే పుట్టుకు రాదు. సకల వ్యవస్థలనూ భ్రష్టుపట్టించే రాజకీయ నాయకత్వమే ఇలాంటి పరిస్థితులకు దోహదపడుతుంది. పోలీసు వ్యవస్థ తమ చెప్పుచేతల్లో ఉంటే చాలు...మిగిలినవి పట్టించుకోవద్దనుకునే పాలకులున్నప్పుడు చివరకు నడిచేది ఇష్టారాజ్యమే. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో దాదాపు 75 లక్షల కేసులు క్రిమినల్ కేసులే. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఇతరత్రా తీసుకునే చర్యల మాటెలా ఉన్నా... ఆషామాషీగా, అలవోకగా కేసులు పెట్టే తీరును సరిచేస్తే తప్ప ఈ కేసుల భారం తగ్గదు.

ఎందుకంటే పోలీసులు పెట్టే కేసుల్లో దాదాపు 60 శాతం అనవసరమైనవేనని చాన్నాళ్లక్రితం జాతీయ పోలీసు కమిషన్ నివేదిక తెలిపింది. పోలీసుల విధి నిర్వహణలో రాజకీయ జోక్యం తగ్గడం తోపాటు...వారికి జవాబుదారీతనం అలవాటు చేయాలి. పోలీసుల తప్పిదం కారణంగా ఎవరైనా నిష్కారణంగా జైలుపాలయ్యారని తేలినప్పుడు తగిన నష్టపరిహారాన్ని అందించాలి. బాధ్యులైన అధికారులపై చర్యలుండాలి. ఇవన్నీ అమల్లోకి రానప్పుడు మాలెగావ్ కేసులో జరిగిన తప్పిదాలవంటివి పున రావృతమవుతూనే ఉంటాయి. అమాయకులు ఇబ్బందులకు లోనవుతూనే ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement