
జనంపైకి ‘ప్రగతి చక్రం’!
రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందోనని జనమంతా కళవళపడుతున్నవేళ ఇదే అదునుగా ఆర్టీసీ చార్జీల పెంపునకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏమంత పెంచలేదని సన్నాయి నొక్కులు నొక్కుతూనే అన్ని రకాల సర్వీసుల్లోనూ టిక్కెట్ల ధరలపై సగటున 9.5 శాతంమేర అదనంగా వడ్డించారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు సామాన్యుడికి ఊపిరాడనివ్వకుండా చేస్తుంటే ఆర్టీసీ తన వంతు బాదుడుకు సిద్ధపడింది. కనీస చార్జీల జోలికె ళ్లలేదంటూనే రెండో స్టేజీనుంచి ధరల మోత మోగించింది. సామాన్య పౌరులు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులనుంచి గరుడ, గరుడ ప్లస్ వరకూ దేన్నీ వదల్లేదు. ఎవరినీ కనికరించలేదు. తరతమ భేదాలు లేకుండా అన్ని తరగతులవారిపైనా భారం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా రోజూ దాదాపు 1.40 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా వారిలో సగంమంది గ్రామీణ ప్రాంతాలవారే. వాస్తవానికి ఆర్టీసీ చార్జీలు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గత నెలలో కథనాలు వెలువడ్డాయి. ఏటా రూ. 500 కోట్ల మేర చార్జీలను పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని ఆ కథనాలు వెల్లడించాయి. కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారుకు ఇది సరిపోలేదేమో... మరో వందకోట్ల రూపాయల బాదుడును జతచేసింది. గత నాలుగేళ్లలో ఇలా చార్జీలను పెంచడం ఇది నాలుగోసారి. గత మూడేళ్లలోనే టిక్కెట్ల ధరలు 50 శాతంపైగా పెరిగాయి. చార్జీలు పెంచే ప్రతిసారీ ప్రభుత్వం డీజిల్ ధరలను సాకుగా చెబుతుంది. ఈసారి ఉద్యమాలు కూడా అందుకు తోడయ్యాయి.
ఆర్టీసీ నష్టాల బాటలో ఉన్నదన్న సంగతి యదార్థమే. అందుకు కేవలం డీజిల్ చార్జీలనూ, ఉద్యమాలనూ సాకుగా చూపడం మాత్రం అన్యాయం. సామాన్య జనానికి రవాణా సదుపాయం కల్పించడం కోసమంటూ ఏర్పడిన ఆర్టీసీని చిక్కుల్లో పడేస్తున్నదీ, చిక్కిపోయేలా చేస్తున్నదీ సర్కారే. ఒకపక్క వివిధ రూపాల్లో ఆర్టీసీని ిపిండుతూ దాని కష్టాలకు మరేవో కారణాలు చెప్పడం సర్కారుకే చెల్లింది. డీజిల్‌పైనా, విడిభాగాల కొనుగోలుపైనా ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఏటా దాదాపు రూ. 700 కోట్లు రాబడుతోంది. మోటారు వాహనాల పన్ను రూపంలో మరో 450 కోట్ల రూపాయలు వసూలుచేస్తోంది. ఇక బస్సు పాస్‌లకు ఇచ్చే రాయితీలను రీయింబర్స్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆ బాపతు బకాయిలు రూ. 1,000 కోట్లు ఉండవచ్చని అంచనా. ఇవన్నీ కలుపుకుంటే ఆర్టీసీకి ఇప్పుడు వస్తున్నాయంటున్న నష్టాల బెడద చాలా వరకూ తీరుతుంది. బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఆర్టీసీ వెన్నువిరిగి, అది ప్రైవేటీకరణ ముప్పులో చిక్కుకోగా తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వం దాన్ని అన్నివిధాలా ఆదుకుంది. ఆర్టీసీ చెల్లించే వ్యాట్‌ను 12 శాతంనుంచి 7 శాతానికి తగ్గించింది. అయిదేళ్లకాలంలో ఒక్కసారికూడా చార్జీలు పెంచకుండా ఆ సంస్థను లాభాలబాట పట్టించింది. ఏమి చేసి ఆయన ఈ అద్భుతాన్ని సాధించగలిగారో పరిశీలించవలసిందిపోయి, ఆ విధానాలను అమలుచేయవలసిందిపోయి చార్జీల పెంపే ఏకైక పరిష్కారమన్నట్టు ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గత పదేళ్లలో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ రద్దీకి దీటుగా ఆర్టీసీ బస్సులను సమకూర్చలేక పోతున్నది. సాధారణ సమయాల్లో ఇలా చేతులెత్తేస్తూ పండుగల పేరుచెప్పి ప్రయాణికులను నిలువుదోపిడీ చేయడంలో ప్రైవేటు బస్సు యాజమాన్యాలతో పోటీపడుతోంది. తలుపులు, కిటికీలు కూడా సరిగాలేని సిటీ బస్సుల్ని ప్రధాన పట్టణాలకు తిప్పుతూ రెండుచేతులా సంపాదిస్తోంది. ఇన్ని చేస్తున్నా నష్టాలే దాపురించడానికి కారణం ఏమిటి? ఎప్పటికప్పుడు పనితీరుని సమీక్షించుకుంటూ అవసరమైన మార్పులు చేసుకుంటే, అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుంటే ఆర్టీసీ లాభాలు సాధించడం అసాధ్యమేమీ కాదు. కానీ, ఆ పని చేయడంలో సంస్థ దారుణంగా విఫలమవుతున్నది. కనుకనే ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించవలసి వస్తున్నది.
అటు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఇదే అదునుగా ఒక నంబరుతో నాలుగైదు బస్సులు తిప్పుతూ ఆర్టీసీ ఆదాయానికి కన్నం పెడుతున్నారు. సిటీ రూట్లలో నష్టాలను తగ్గించుకోవడానికంటూ ట్రిప్పులను గణనీయంగా తగ్గించారు. రాత్రి 9 గంటలు దాటితే బస్సుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. పర్యవసానంగా నగర పౌరులు ఆటోలపైనా, ఇతర వాహనాలపైనా ఆధారపడవలసివస్తున్నది. ఆర్టీసీ నిర్వహణ ఇంత అస్తవ్యస్థంగా ఉంటున్నా సర్కారు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఆ సంస్థ సామర్థ్యం పెంపునకు ఎలాంటి సూచనలూ చేయదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై పరుగులు పెడుతున్న ప్రైవేటు బస్సులనూ అదుపుచేయదు. మొన్నీమధ్య బెంగళూరునుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు పెను ప్రమాదంలో చిక్కుకున్నాక రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో దాదాపు 200 బస్సుల్ని సీజ్ చేశారు. అంటే, ఇన్నేళ్లుగా ఈ బస్సులన్నీ అడిగే నాథుడులేక ఇష్టమొచ్చినట్టు తిరిగాయన్నమాట. అన్ని స్థాయిల్లో లాలూచీ లేకుండా ఇలా తిరగడం సాధ్యమేనా? తప్పులన్నీ తమవద్ద పెట్టుకుని, దేన్నీ సరిదిద్దలేని అశక్తతను కప్పిపుచ్చుకుని... బస్సెక్కడానికివచ్చే సామాన్య పౌరుల జేబులకు చిల్లుపెట్టడమే ఏకైక మార్గమన్నట్టు పాలకులు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీకి ఇప్పటివరకూ దాదాపు రూ. 4,200 కోట్ల అప్పులున్నాయి. ప్రైవేటు బస్సుల్ని నియంత్రిస్తే... వ్యాట్, ఇతర పన్నుల చెల్లింపునుంచి ఆర్టీసీకి ఒకటి రెండేళ్లు మినహాయింపునిస్తే ఈ అప్పుల్లో సింహభాగం తీరిపోతుంది. కానీ, ఆ రూటును ఎంచుకోవడంమాని చార్జీల పెంపుతోనే సమస్య తీరుతుందన్నట్టు అటు ఆర్టీసీ, ఇటు ప్రభుత్వమూ భావించాయి. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థలు ఇంతకన్నా తక్కువ చార్జీలనే వసూలు చేస్తూ కళకళలాడుతుంటే ఇక్కడే ఎందుకిలా జరుగుతున్నదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ విధానాలను పునస్సమీక్షించుకోవాలి.