RTC charges hike
-
TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. పెరిగిన టికెట్ ధరలు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులపై టీఎస్ఆర్టీసీ మరో భారం మోపింది. ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జాతీయ రహదారులపై టోల్ చార్జీలను అయిదు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం నుంచి ఆ నిర్ణయం అమల్లోకి రానుండటంతో ఆర్టీసీపై మరింత భారం పడనుంది. పెరిగిన టోల్ చార్జీల భారాన్ని ప్రయాణికులపైనే వేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టీసీ టికెట్లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచింది. టోల్ ఛార్జీలను పెంపుతో టికెట్ ధరలు సైతం పెరిగాయి. ఆర్డీనరి నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 వరకు పెంచినట్లు ప్రకటించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.15 పెంచింది. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ఛార్జీ రూ.20 వసూలు చేస్తున్నారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ.4 పెంచారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. చదవండి: కేసీఆర్‌ది కొంపముంచే సర్కార్: బండి సంజయ్ -
మరో షాకిచ్చిన తెలంగాణ ఆర్టీసీ.. ఈసారి ఏకంగా రూ.10
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే సెస్సుల పేరుతో చార్జీలు పెంచిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రిజర్వేషన్ చార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. రిజర్వేషన్ ధరలను రూ.20 నుంచి 30 రూపాయలకు పెంచేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. అయితే, గుట్టుచప్పుడు కాకుండా చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న యాజమాన్యం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. పెరిగిన రిజర్వేషన్ చార్జీలు మార్చి 27 నుంచి అమలు కానున్నట్టు సమాచారం. (చదవండి: సర్కారు గొర్రెల్ని తీసుకొని.. లాభాలు పంచుకుందామంటూ..) -
TSRTC: మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీజిల్ రేట్లు పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచామన్నారు. ‘‘పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీకి 2 రూపాయలు, ఆపై బస్సులకు 5 రూపాయలు పెంచాం. డీజిల్ ధరలు ఇదే విధంగా పెరిగితే మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం ఉందని’’ సజ్జనార్ పేర్కొన్నారు. చదవండి: గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు ‘‘కొత్త బస్సుల కొనుగోలు కోసం కొంత మంది బ్యాంకర్లు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లోన్లు రాగానే కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం. ఇప్పటికే ఉన్న కొన్ని బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని’’ ఆర్టీసీ ఎండీ అన్నారు. -
డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా.. బస్సు చార్జీల సవరణ!
టిమ్స్‌తో సులువే.. గతంలో టికెట్లు ఇచ్చే విధానం అమల్లో ఉన్నప్పుడు, టికెట్ చార్జీలు సవరిస్తే వాటిపై కొత్త ధరలను ప్రింట్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం టిమ్స్ యంత్రాల ద్వారా టికెట్లు ఇస్తున్నారు. వీటిల్లో చార్జీల పట్టికను సవరించటం సులభం. తరచూ ధరలు మారినా, రాత్రికి రాత్రే వాటిల్లో సవరించే వెసులుబాటు ఉన్నందున కొత్త విధానం ఇబ్బంది కాదని అధికారులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరల్లో మార్పులు జరిగినప్పుడల్లా టీఎస్ఆర్టీసీ టికెట్ చార్జీలు కూడా మార్చే విధానం తెరపైకి వస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణ ఆర్టీసీలో కూడా ప్రవేశపెట్టాలన్న నిపుణుల సూచనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆర్టీసీపై డీజిల్ భారాన్ని ఎప్పటికప్పుడు తగ్గించ డంతో పాటు, ఒకేసారి చార్జీలు భారీగా పెంచిన భావన ప్రజల్లో లేకుండా ఉంటుందన్న కోణంలో దీనికి ప్రాధాన్యం లభిస్తోంది. దీనిపై తెలంగాణ ఆర్టీసీ కూడా ఆసక్తి కనబరుస్తోంది. వాస్తవానికి రెండేళ్ల కిందటే ఈ అంశం చర్చకు వచ్చింది. 2019లో ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె అనంతరం పరిస్థితులు తిరిగి సద్దుమణిగే సమయంలో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అదే సంవత్సరం డిసెంబర్లో ఆర్టీసీ చార్జీలు పెంచారు. ఆ తర్వాత డీజిల్ ధరల మార్పులకు తగ్గట్టుగా బస్సు ఛార్జీలు సవరించే విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో చర్చించారు. కానీ ఆ వెంటనే కోవిడ్ సమ స్య రావటంతో అది కాస్తా పెండింగులో పడింది. నిర్ణయాధికారం ఆర్టీసీకే.. 2019లో ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.66గా ఉంది. ఆ సంవత్సరం ఆరంభంలో అది రూ.62గా ఉంది. రెండేళ్లలో లీటర్‌పై ఏకంగా రూ.39 వరకు పెరిగింది. ఫలితంగా రోజుకు ఆర్టీసీపై రూ.2 కోట్ల అదనపు భారం పడుతోంది. ఇటీవల సీఎం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మరోసారి ఆర్టీసీ బస్సు చార్జీలను సవరించాలన్న అంశం చర్చకు వచ్చింది. దీంతో ప్రతిపాదన పంపాలని, తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. గతంలో లాగా కిలోమీటర్‌కు 20 పైసలు పెంచితే ఉండే ప్రభావం, 25 పైసలు, 30 పైసలు పెంచితే ఎంతుంటుందన్న వివరాలు పొందుపరిచారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కిలోమీటర్‌కు 25 పైసలు పెంచాలని ఆర్టీసీ కోరుతోంది. ఇదే సమయంలో ఇలా కొంతకాలం తర్వాత ఒకేసారి భారీగా పెంచటం కంటే, డీజిల్ ధరలు మారినప్పు డల్లా చార్జీలు సవరించే అధికారాన్ని ఆర్టీసీకి కట్టబెట్టాలన్న సూచన మరోసారి తెరపైకి వచ్చింది. ఒకేసారి చార్జీలు పెంచితే ప్రజలు భారంగా భావిస్తారు. డీజిల్ ధరలు మారినప్పుడల్లా అదే దామాషా ప్రకారం చార్జీలు పెంచితే, ఆ భారం కూడా స్వల్పంగానే ఉన్నట్లు ప్రయాణికులకు కన్పిస్తుంది. వెంటవెంటనే చార్జీలు మారితే డీజిల్ పెంపుతో వచ్చే నష్టాలను ఆర్టీసీ అధిగమిస్తూ నష్టాలకు చెక్ పెట్టొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. (చదవండి: యాదాద్రిలో 250 విల్లాలు.. ఒక్కోటి 2 కోట్లు) -
‘ఆ రోజు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం’
సాక్షి, హైదరాబాద్ : కరెంట్ చార్జీలు పెంచిన రోజు నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎంపీ మాట్లాడుతూ.. తమ కమీషన్ల కోసం జెన్కోను నష్టాల బాట పట్టించారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన తప్పుల భారాన్ని ప్రజలపై రుద్దితే సహించమని హెచ్చరించారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని ప్రజా ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. (గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు) సోనియా గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ -
సిటీ పల్లెటూర్
సాక్షి, హైదరాబాద్: మహానగరం పల్లె బాట పట్టింది. సంక్రాంతి సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్ శుక్రవారం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు రైల్వేతో సహా, ఆర్టీసీ, ప్రైవేట్ ఆపరేటర్లు రంగంలోకి దిగారు. ప్రైవేట్ రైళ్లలో ప్రత్యేక చార్జీలను విధించారు. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు పెంచగా, రాష్ట్రంలోని (200 కి.మీ. లోపు) ప్రాంతాలకు నడిచే ప్రత్యేక బస్సుల్లో 10 నుంచి 20 శాతం వరకు చార్జీలను పెంచారు. ఇక ప్రైవేట్ బస్సులు యథావిధిగా దారి దోపిడీ సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీలను రెట్టింపు చేశాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 20 లక్షల మందికిపైగా తెలుగు రాష్ట్రాల్లోని సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. పండుగ రద్దీ విమానాలను సైతం తాకింది. ఆర్టీసీ 50 శాతం అదనం... సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ 3,500 రెగ్యులర్ బస్సులకు తోడు సుమారు 5,500 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి తదితర దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో 50 శాతం, తెలంగాణలోని వివిధ జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో 10 నుంచి 20 శాతం అదనపు చార్జీలు విధించారు. ఇప్పటికే అన్ని రెగ్యులర్ బస్సుల్లో సీట్లు రిజర్వ్ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని, ఇవి నగర శివార్ల నుంచే బయలు దేరేలా కార్యచరణ చేపట్టినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ప్రైవేట్ ఆపరేటర్ల దారి దోపిడీ... నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు రెట్టింపయ్యాయి. ఒక్కో ట్రావెల్స్ సంస్థ ఒక్కో విధంగా చార్జీలు వసూలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి సాధారణ రోజుల్లో రూ.750 వరకు ఉంటే ఇప్పుడు రూ.1,350కి పెంచారు. రాజమండ్రికి సాధారణంగా రూ.900 వరకు ఉంటుంది. ప్రస్తుతం కొన్ని ట్రావెల్స్ రూ.1,800, మరికొన్ని రూ.2,090 వరకు వసూలు చేస్తున్నాయి. ఫ్లైట్ జర్నీకి సైతం డిమాండ్... పలు రూట్లలో ప్రయాణికుల డిమాండ్ పెరగడంతో విమాన చార్జీలు సైతంపెరిగాయి. ఈ నెల 13న హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు చార్జీ ఉండగా, తిరుపతికి రూ.4,600 వరకు ఉంది. ఇక రాజమండ్రికి రూ.11,339 వరకు చార్జీలున్నాయి. ఏ రోజుకు ఆ రోజు డిమాండ్ మేరకు చార్జీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతిరోజు సుమారు 40 వేల మంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతుండగా, పండుగ రద్దీ దృష్ట్యా ఈ సంఖ్య మరో 5 వేలకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ ప్రజలు భారీగా స్వగ్రామాలకు వేళ్తుండడంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. రైళ్లలో చార్జీలు ‘ప్రత్యేక’ం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో సంక్రాంతి రద్దీ ప్రారంభమైంది. సాధారణ రోజుల్లో రాకపోకలు సాగించే సుమారు 120 రైళ్లతో పాటు సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లను ఏర్పాటు చేశారు. మార్చి వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లలోనూ వందల్లో వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీలపైన 30 శాతం అదనపు బాదుడుకు తెరలేపారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు థర్డ్ ఏసీ రూ.645. ప్రస్తుతం ఈ ప్రత్యేక చార్జీలు రూ.1,130 వరకు పెరిగాయి. అలాగే విశాఖకు స్లీపర్ రూ.395 ఉండగా ప్రత్యే రైళ్లలో రూ.500కు పెరిగింది. ఇలా అన్ని రూట్లలోనూ స్పెషల్ ట్రైన్స్‌లో చార్జీలు పెంచారు. -
సంక్రాంతికి ఆర్టీసీ చార్జీల బాదుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ పండగ బాదుడుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ నడిపే ప్రత్యేక సర్వీసులకు టికెట్ ధరపై 50% అదనపు మొత్తాన్ని వసూలు చేయాలని అధికారులు ఆదివారం నిర్ణయించారు. దూరప్రాంతాలకు తిరిగే అన్ని ప్రత్యేక బస్సుల్లో ఈ అదనపు రేట్లు అమల్లో ఉంటాయి. రాష్ట్రం పరిధిలో..తక్కువ దూరంలోని ప్రాంతాల మధ్య తిరిగే ప్రత్యేక బస్సుల విషయంలో మాత్రం స్థానిక అధికారులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. వీటిల్లో కూడా చాలా ప్రాంతాల్లో 50% అదనపు మొత్తం వసూలుకే స్థానిక అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే బస్సు చార్జీలు పెరిగిన నేపథ్యంలో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకుంటే మాత్రం... 50% అదనపు రుసుము కాకుండా, సాధారణ టికెట్ ధర కంటే కొంత మొత్తం పెంచి దాన్ని సమీప పెద్ద సంఖ్యకు రౌండాఫ్ చేసి వసూలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికి 4,779 అదనపు సర్వీసులు తిప్పాలని అధికారులు ప్రణా ళిక సిద్ధం చేశారు. 10వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఒకేసారి ఇన్ని సర్వీసులు రోడ్డెక్కుతున్నందున బస్టాండ్లు, ఇతర పాయింట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. -
యాదాద్రిలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో
నల్గొండ: పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శనివారం నల్గొండ జిల్లా యాదాద్రిలోని ప్రముఖ శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం వద్ద ప్రభుత్వ తీరుకు నిరససగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. వైకుంఠ ద్వారానికి వెళ్లే దారిలో నాయకులు బైఠాయించారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి... ధర్నాకు దిగన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
'కమీషన్లు తీసుకుంటూ ఖజానాపై భారం వేస్తుంది'
హైదరాబాద్ : రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో గీతారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆర్టీసీ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలుపై ఈ ప్రభుత్వం వందల కోట్ల భారం వేసిందని విమర్శించారు. తగ్గించకపోతే ఇతర పార్టీలతో కలసి కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని ఆమె హెచ్చరించారు. మిషన్ భగీరథ, పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల నిర్మాణ వ్యయాలను అంచనాలను ఇష్టానుసారంగా ప్రభుత్వం పెంచేస్తుందని చెప్పారు. కమీషన్లు తీసుకుంటూ ఖజానాపై భారం వేస్తుందని టీఆర్ఎస్పై గీతారెడ్డి మండిపడ్డారు. -
బస్సుల చార్జీల పెంపు పై నిరసన
-
‘ప్రత్యేక’మేంటో చెప్పకుండానే బాదుడా?
ప్రభుత్వం, ఆర్టీసీలపై హైకోర్టు ఆగ్రహం స్పష్టతనివ్వాలని ప్రభుత్వానికి ఆదేశం అప్పటివరకు అధిక చార్జీలు వసూలు చేయవద్దని ఆర్టీసీకి స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సందర్భాలేమిటో స్పష్టత ఇవ్వకుండా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేసుకునేందుకు ఆర్టీసీకి అనుమతినిస్తూ జీవో జారీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక సందర్భాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చేంత వరకు అధిక చార్జీలు వసూలు చేయవద్దని ఆర్టీసీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పండుగలు, ఇతర పర్వదినాలు, వేసవి సెలవుల్లో ప్రత్యేక బస్సుల పేరుతో దాదాపు 150 శాతం అధికంగా ఆర్టీసీ చార్జీలను వసూలు చేస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన రామరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ప్రత్యేక సందర్భాల్లో అధిక మొత్తాలను వసూలు చేసుకునేందుకు ప్రభుత్వమే ఆర్టీసీకి అనుమతినిస్తూ 2003లోనే జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది జి.ఎల్.నర్సింహారావు కోర్టుకు నివేదించారు. పండుగ రోజుల్లో అధిక చార్జీలను ఎలా వసూలు చేస్తారని ఆర్టీసీని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రత్యేక సందర్భాలని జీవోలో పేర్కొన్నప్పుడు, దాని గురించి స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, స్పష్టతనిచ్చే వరకు అధిక చార్జీలను వసూలు చేయవద్దని ఆర్టీసీని ఆదేశించింది. నెలరోజుల్లో స్పష్టతనివ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
జనంపైకి ‘ప్రగతి చక్రం’!
రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందోనని జనమంతా కళవళపడుతున్నవేళ ఇదే అదునుగా ఆర్టీసీ చార్జీల పెంపునకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏమంత పెంచలేదని సన్నాయి నొక్కులు నొక్కుతూనే అన్ని రకాల సర్వీసుల్లోనూ టిక్కెట్ల ధరలపై సగటున 9.5 శాతంమేర అదనంగా వడ్డించారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు సామాన్యుడికి ఊపిరాడనివ్వకుండా చేస్తుంటే ఆర్టీసీ తన వంతు బాదుడుకు సిద్ధపడింది. కనీస చార్జీల జోలికె ళ్లలేదంటూనే రెండో స్టేజీనుంచి ధరల మోత మోగించింది. సామాన్య పౌరులు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులనుంచి గరుడ, గరుడ ప్లస్ వరకూ దేన్నీ వదల్లేదు. ఎవరినీ కనికరించలేదు. తరతమ భేదాలు లేకుండా అన్ని తరగతులవారిపైనా భారం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా రోజూ దాదాపు 1.40 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా వారిలో సగంమంది గ్రామీణ ప్రాంతాలవారే. వాస్తవానికి ఆర్టీసీ చార్జీలు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గత నెలలో కథనాలు వెలువడ్డాయి. ఏటా రూ. 500 కోట్ల మేర చార్జీలను పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని ఆ కథనాలు వెల్లడించాయి. కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారుకు ఇది సరిపోలేదేమో... మరో వందకోట్ల రూపాయల బాదుడును జతచేసింది. గత నాలుగేళ్లలో ఇలా చార్జీలను పెంచడం ఇది నాలుగోసారి. గత మూడేళ్లలోనే టిక్కెట్ల ధరలు 50 శాతంపైగా పెరిగాయి. చార్జీలు పెంచే ప్రతిసారీ ప్రభుత్వం డీజిల్ ధరలను సాకుగా చెబుతుంది. ఈసారి ఉద్యమాలు కూడా అందుకు తోడయ్యాయి. ఆర్టీసీ నష్టాల బాటలో ఉన్నదన్న సంగతి యదార్థమే. అందుకు కేవలం డీజిల్ చార్జీలనూ, ఉద్యమాలనూ సాకుగా చూపడం మాత్రం అన్యాయం. సామాన్య జనానికి రవాణా సదుపాయం కల్పించడం కోసమంటూ ఏర్పడిన ఆర్టీసీని చిక్కుల్లో పడేస్తున్నదీ, చిక్కిపోయేలా చేస్తున్నదీ సర్కారే. ఒకపక్క వివిధ రూపాల్లో ఆర్టీసీని ిపిండుతూ దాని కష్టాలకు మరేవో కారణాలు చెప్పడం సర్కారుకే చెల్లింది. డీజిల్‌పైనా, విడిభాగాల కొనుగోలుపైనా ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఏటా దాదాపు రూ. 700 కోట్లు రాబడుతోంది. మోటారు వాహనాల పన్ను రూపంలో మరో 450 కోట్ల రూపాయలు వసూలుచేస్తోంది. ఇక బస్సు పాస్‌లకు ఇచ్చే రాయితీలను రీయింబర్స్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆ బాపతు బకాయిలు రూ. 1,000 కోట్లు ఉండవచ్చని అంచనా. ఇవన్నీ కలుపుకుంటే ఆర్టీసీకి ఇప్పుడు వస్తున్నాయంటున్న నష్టాల బెడద చాలా వరకూ తీరుతుంది. బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఆర్టీసీ వెన్నువిరిగి, అది ప్రైవేటీకరణ ముప్పులో చిక్కుకోగా తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వం దాన్ని అన్నివిధాలా ఆదుకుంది. ఆర్టీసీ చెల్లించే వ్యాట్‌ను 12 శాతంనుంచి 7 శాతానికి తగ్గించింది. అయిదేళ్లకాలంలో ఒక్కసారికూడా చార్జీలు పెంచకుండా ఆ సంస్థను లాభాలబాట పట్టించింది. ఏమి చేసి ఆయన ఈ అద్భుతాన్ని సాధించగలిగారో పరిశీలించవలసిందిపోయి, ఆ విధానాలను అమలుచేయవలసిందిపోయి చార్జీల పెంపే ఏకైక పరిష్కారమన్నట్టు ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గత పదేళ్లలో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ రద్దీకి దీటుగా ఆర్టీసీ బస్సులను సమకూర్చలేక పోతున్నది. సాధారణ సమయాల్లో ఇలా చేతులెత్తేస్తూ పండుగల పేరుచెప్పి ప్రయాణికులను నిలువుదోపిడీ చేయడంలో ప్రైవేటు బస్సు యాజమాన్యాలతో పోటీపడుతోంది. తలుపులు, కిటికీలు కూడా సరిగాలేని సిటీ బస్సుల్ని ప్రధాన పట్టణాలకు తిప్పుతూ రెండుచేతులా సంపాదిస్తోంది. ఇన్ని చేస్తున్నా నష్టాలే దాపురించడానికి కారణం ఏమిటి? ఎప్పటికప్పుడు పనితీరుని సమీక్షించుకుంటూ అవసరమైన మార్పులు చేసుకుంటే, అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుంటే ఆర్టీసీ లాభాలు సాధించడం అసాధ్యమేమీ కాదు. కానీ, ఆ పని చేయడంలో సంస్థ దారుణంగా విఫలమవుతున్నది. కనుకనే ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించవలసి వస్తున్నది. అటు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఇదే అదునుగా ఒక నంబరుతో నాలుగైదు బస్సులు తిప్పుతూ ఆర్టీసీ ఆదాయానికి కన్నం పెడుతున్నారు. సిటీ రూట్లలో నష్టాలను తగ్గించుకోవడానికంటూ ట్రిప్పులను గణనీయంగా తగ్గించారు. రాత్రి 9 గంటలు దాటితే బస్సుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. పర్యవసానంగా నగర పౌరులు ఆటోలపైనా, ఇతర వాహనాలపైనా ఆధారపడవలసివస్తున్నది. ఆర్టీసీ నిర్వహణ ఇంత అస్తవ్యస్థంగా ఉంటున్నా సర్కారు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఆ సంస్థ సామర్థ్యం పెంపునకు ఎలాంటి సూచనలూ చేయదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై పరుగులు పెడుతున్న ప్రైవేటు బస్సులనూ అదుపుచేయదు. మొన్నీమధ్య బెంగళూరునుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు పెను ప్రమాదంలో చిక్కుకున్నాక రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో దాదాపు 200 బస్సుల్ని సీజ్ చేశారు. అంటే, ఇన్నేళ్లుగా ఈ బస్సులన్నీ అడిగే నాథుడులేక ఇష్టమొచ్చినట్టు తిరిగాయన్నమాట. అన్ని స్థాయిల్లో లాలూచీ లేకుండా ఇలా తిరగడం సాధ్యమేనా? తప్పులన్నీ తమవద్ద పెట్టుకుని, దేన్నీ సరిదిద్దలేని అశక్తతను కప్పిపుచ్చుకుని... బస్సెక్కడానికివచ్చే సామాన్య పౌరుల జేబులకు చిల్లుపెట్టడమే ఏకైక మార్గమన్నట్టు పాలకులు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీకి ఇప్పటివరకూ దాదాపు రూ. 4,200 కోట్ల అప్పులున్నాయి. ప్రైవేటు బస్సుల్ని నియంత్రిస్తే... వ్యాట్, ఇతర పన్నుల చెల్లింపునుంచి ఆర్టీసీకి ఒకటి రెండేళ్లు మినహాయింపునిస్తే ఈ అప్పుల్లో సింహభాగం తీరిపోతుంది. కానీ, ఆ రూటును ఎంచుకోవడంమాని చార్జీల పెంపుతోనే సమస్య తీరుతుందన్నట్టు అటు ఆర్టీసీ, ఇటు ప్రభుత్వమూ భావించాయి. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థలు ఇంతకన్నా తక్కువ చార్జీలనే వసూలు చేస్తూ కళకళలాడుతుంటే ఇక్కడే ఎందుకిలా జరుగుతున్నదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ విధానాలను పునస్సమీక్షించుకోవాలి. -
ఆర్టీసీ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: జనక్‌ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఐదుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచిందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే నాలుగుసార్లు పెంచారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ప్రజలపై ఒక్క రూపాయి భారం వేయకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తే... కిరణ్ ప్రజలపై పన్నులు వేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మద్దతుతో అవిశ్వాసం నుంచి గట్టెక్కి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కిరణ్.. అచ్చంగా ఆయన పాలసీలనే అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు అప్పట్లో చేసిన ప్రయత్నాలను కిరణ్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. అందుకే చార్జీలు పెంచినా చంద్రబాబు కిమ్మనడం లేదని జనక్‌ప్రసాద్ విమర్శించారు.