ఆర్టీసీ చార్జీల పెంపును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఐదుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచిందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే నాలుగుసార్లు పెంచారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ప్రజలపై ఒక్క రూపాయి భారం వేయకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తే... కిరణ్ ప్రజలపై పన్నులు వేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మద్దతుతో అవిశ్వాసం నుంచి గట్టెక్కి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కిరణ్.. అచ్చంగా ఆయన పాలసీలనే అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు అప్పట్లో చేసిన ప్రయత్నాలను కిరణ్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. అందుకే చార్జీలు పెంచినా చంద్రబాబు కిమ్మనడం లేదని జనక్‌ప్రసాద్ విమర్శించారు.