సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ పండగ బాదుడుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ నడిపే ప్రత్యేక సర్వీసులకు టికెట్ ధరపై 50% అదనపు మొత్తాన్ని వసూలు చేయాలని అధికారులు ఆదివారం నిర్ణయించారు. దూరప్రాంతాలకు తిరిగే అన్ని ప్రత్యేక బస్సుల్లో ఈ అదనపు రేట్లు అమల్లో ఉంటాయి. రాష్ట్రం పరిధిలో..తక్కువ దూరంలోని ప్రాంతాల మధ్య తిరిగే ప్రత్యేక బస్సుల విషయంలో మాత్రం స్థానిక అధికారులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. వీటిల్లో కూడా చాలా ప్రాంతాల్లో 50% అదనపు మొత్తం వసూలుకే స్థానిక అధికారులు మొగ్గు చూపుతున్నారు.
ఇటీవలే బస్సు చార్జీలు పెరిగిన నేపథ్యంలో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకుంటే మాత్రం... 50% అదనపు రుసుము కాకుండా, సాధారణ టికెట్ ధర కంటే కొంత మొత్తం పెంచి దాన్ని సమీప పెద్ద సంఖ్యకు రౌండాఫ్ చేసి వసూలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికి 4,779 అదనపు సర్వీసులు తిప్పాలని అధికారులు ప్రణా ళిక సిద్ధం చేశారు. 10వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఒకేసారి ఇన్ని సర్వీసులు రోడ్డెక్కుతున్నందున బస్టాండ్లు, ఇతర పాయింట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment