ప్రత్యేక సందర్భాలేమిటో స్పష్టత ఇవ్వకుండా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేసుకునేందుకు ఆర్టీసీకి అనుమతినిస్తూ జీవో జారీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం, ఆర్టీసీలపై హైకోర్టు ఆగ్రహం
స్పష్టతనివ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
అప్పటివరకు అధిక చార్జీలు వసూలు చేయవద్దని ఆర్టీసీకి స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సందర్భాలేమిటో స్పష్టత ఇవ్వకుండా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేసుకునేందుకు ఆర్టీసీకి అనుమతినిస్తూ జీవో జారీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక సందర్భాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చేంత వరకు అధిక చార్జీలు వసూలు చేయవద్దని ఆర్టీసీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పండుగలు, ఇతర పర్వదినాలు, వేసవి సెలవుల్లో ప్రత్యేక బస్సుల పేరుతో దాదాపు 150 శాతం అధికంగా ఆర్టీసీ చార్జీలను వసూలు చేస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన రామరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది.
ప్రత్యేక సందర్భాల్లో అధిక మొత్తాలను వసూలు చేసుకునేందుకు ప్రభుత్వమే ఆర్టీసీకి అనుమతినిస్తూ 2003లోనే జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది జి.ఎల్.నర్సింహారావు కోర్టుకు నివేదించారు. పండుగ రోజుల్లో అధిక చార్జీలను ఎలా వసూలు చేస్తారని ఆర్టీసీని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రత్యేక సందర్భాలని జీవోలో పేర్కొన్నప్పుడు, దాని గురించి స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, స్పష్టతనిచ్చే వరకు అధిక చార్జీలను వసూలు చేయవద్దని ఆర్టీసీని ఆదేశించింది. నెలరోజుల్లో స్పష్టతనివ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.