టిమ్స్‌తో సులువే.. గతంలో టికెట్లు ఇచ్చే విధానం అమల్లో ఉన్నప్పుడు, టికెట్ చార్జీలు సవరిస్తే వాటిపై కొత్త ధరలను ప్రింట్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం టిమ్స్ యంత్రాల ద్వారా టికెట్లు ఇస్తున్నారు. వీటిల్లో చార్జీల పట్టికను సవరించటం సులభం. తరచూ ధరలు మారినా, రాత్రికి రాత్రే వాటిల్లో సవరించే వెసులుబాటు ఉన్నందున కొత్త విధానం ఇబ్బంది కాదని అధికారులు చెబుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరల్లో మార్పులు జరిగినప్పుడల్లా టీఎస్‌ఆర్టీసీ టికెట్ చార్జీలు కూడా మార్చే విధానం తెరపైకి వస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణ ఆర్టీసీలో కూడా ప్రవేశపెట్టాలన్న నిపుణుల సూచనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆర్టీసీపై డీజిల్ భారాన్ని ఎప్పటికప్పుడు తగ్గించ డంతో పాటు, ఒకేసారి చార్జీలు భారీగా పెంచిన భావన ప్రజల్లో లేకుండా ఉంటుందన్న కోణంలో దీనికి ప్రాధాన్యం లభిస్తోంది. దీనిపై తెలంగాణ ఆర్టీసీ కూడా ఆసక్తి కనబరుస్తోంది.
వాస్తవానికి రెండేళ్ల కిందటే ఈ అంశం చర్చకు వచ్చింది. 2019లో ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె అనంతరం పరిస్థితులు తిరిగి సద్దుమణిగే సమయంలో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అదే సంవత్సరం డిసెంబర్‌లో ఆర్టీసీ చార్జీలు పెంచారు. ఆ తర్వాత డీజిల్ ధరల మార్పులకు తగ్గట్టుగా బస్సు ఛార్జీలు సవరించే విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో చర్చించారు. కానీ ఆ వెంటనే కోవిడ్ సమ స్య రావటంతో అది కాస్తా పెండింగులో పడింది.
నిర్ణయాధికారం ఆర్టీసీకే..
2019లో ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.66గా ఉంది. ఆ సంవత్సరం ఆరంభంలో అది రూ.62గా ఉంది. రెండేళ్లలో లీటర్‌పై ఏకంగా రూ.39 వరకు పెరిగింది. ఫలితంగా రోజుకు ఆర్టీసీపై రూ.2 కోట్ల అదనపు భారం పడుతోంది. ఇటీవల సీఎం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మరోసారి ఆర్టీసీ బస్సు చార్జీలను సవరించాలన్న అంశం చర్చకు వచ్చింది. దీంతో ప్రతిపాదన పంపాలని, తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు.
ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. గతంలో లాగా కిలోమీటర్‌కు 20 పైసలు పెంచితే ఉండే ప్రభావం, 25 పైసలు, 30 పైసలు పెంచితే ఎంతుంటుందన్న వివరాలు పొందుపరిచారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కిలోమీటర్‌కు 25 పైసలు పెంచాలని ఆర్టీసీ కోరుతోంది. ఇదే సమయంలో ఇలా కొంతకాలం తర్వాత ఒకేసారి భారీగా పెంచటం కంటే, డీజిల్ ధరలు మారినప్పు డల్లా చార్జీలు సవరించే అధికారాన్ని ఆర్టీసీకి కట్టబెట్టాలన్న సూచన మరోసారి తెరపైకి వచ్చింది.
ఒకేసారి చార్జీలు పెంచితే ప్రజలు భారంగా భావిస్తారు. డీజిల్ ధరలు మారినప్పుడల్లా అదే దామాషా ప్రకారం చార్జీలు పెంచితే, ఆ భారం కూడా స్వల్పంగానే ఉన్నట్లు ప్రయాణికులకు కన్పిస్తుంది. వెంటవెంటనే చార్జీలు మారితే డీజిల్ పెంపుతో వచ్చే నష్టాలను ఆర్టీసీ అధిగమిస్తూ నష్టాలకు చెక్ పెట్టొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. (చదవండి: యాదాద్రిలో 250 విల్లాలు.. ఒక్కోటి 2 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment