సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సంక్షోభం కోలుకోలేని దెబ్బతీసింది. తాజాగా పెరుగుతున్న డీజిల్ ధరలతో పాటే పెరిగిపోతున్న నష్టాలు ఆర్టీసీని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బస్సు చార్జీలు పెంచితే తప్ప, ప్రగతిరథం ముందుకు సాగని పరిస్థితిలో ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతి పాదన పంపినా ఇంతవరకు ఆమోదం లభించక పోవడంతో రోజు గడవడమే గగనంగా మారింది. దీంతో నేరుగా చార్జీలు కాకుండా, ఇతరత్రా రుసుములు, ఫీజులను పెంచటం ద్వారా ఎక్కడెక్కడ చార్జీలను సవరించేందుకు అవకాశం ఉందో వెతికి మరీ ఆదాయార్జనకు ప్రయత్నిస్తోంది.
చిన్నచిన్న రుసుములే అయినా అన్నీ కలిపేసరికి ప్రయాణికుల జేబుకు బాగానే కత్తెర పడుతోంది. ఇతర పట్టణాల నుంచి నగరానికి వచ్చే బస్సుల్లో చార్జీ కేటగిరీల వారీగా కొన్ని రోజుల వ్యవధిలోనే రూ.10–20 వరకు పెరిగిపోయింది. ఇవేవీ అధికారికంగా వెల్లడించకుండా, అంతర్గత నిర్ణయాలతో ఆర్టీసీ పని కానిచ్చేస్తోంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాటికి అనుగుణంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సగటు జీవిపై, చార్జీల్లో ‘అనధికార పెంపు’ మరింత భారం మోపుతోంది.
సేఫ్టీ సెస్‌తో మొదలు..
రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా సేఫ్టీ సెస్‌ను విధించాలని నాటి ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. కానీ అది వెంటనే అమలు కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీకి అది గుర్తొచ్చింది. బస్సు ప్రమాదాల్లో చనిపోయేవారికి చెల్లించే పరిహారం సాలీనా సగటున రూ.30 కోట్ల వరకు ఉంటోంది. దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండనందున.. ఇప్పుడు ఆ మొత్తాన్ని జనం నుంచే రాబట్టాలని నిర్ణయించి సేఫ్టీ సెస్ పెంపు ప్రతిపాదన ఫైలుకు ఇటీవల దుమ్ముదులిపింది.
ప్రతి టికెట్‌పై రూపాయి చొప్పున చార్జీ విధించింది. వింటే అది చిన్న మొత్తమే.. కానీ, ఆ రూపాయి విధింపుతో మారిన టికెట్ చార్జీలు కండక్టర్లకు–ప్రయాణికుల మధ్య చిల్లర తగాదాలకు కారణమవుతుందని చెప్పి చార్జీని రౌండ్ ఆఫ్ చేసింది. అంటే రూ.15, రూ.20, రూ.25, రూ.30... ఇలా అన్నమాట. దీంతో నిర్ధారిత స్టేజీల తర్వాత రూపాయి చార్జీ కాస్తా రూ.5కు పెరిగిపోయింది.
ఎమినిటీస్ (వసతుల) సెస్..
సేఫ్టీ సెస్ విధించి ఐదారురోజులు గడవకముండే ఆర్టీసీకి మరో సెస్ గుర్తొచ్చింది. బస్టాండ్లలో ప్రయాణికులకు వసతులు మెరుగుపరిచే ఉద్దేశంతో 2013లో ప్రారంభించిన ప్యాసింజర్ ఎమినిటీస్ సెస్‌ను సవరించేసింది. పల్లె వెలుగు మినహా ఇతర కేటగిరీ బస్సుల్లో టికెట్‌పై రూపాయిగా ఉన్న సెస్‌ను ఒకేసారి రూ.5కు పెంచేసింది. అంటే కొత్తగా రూ.4 పెరిగిందన్నమాట. ఇప్పుడు బేస్ టికెట్ ఫేర్‌లో దీన్ని కూడా చేర్చి టికెట్ ధరలను రౌండాఫ్ చేసింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో తదుపరి రూ.5కు (ధర రూ.21 ఉంటే రూ.25కు), సూపర్ లగ్జరీ నుంచి ఆ పై కేటగిరీ సర్వీసుల్లో రూ.10కి రౌండాఫ్ (టికెట్ ధర రూ.21 ఉంటే రూ.30కి) చేసింది. ఈ కొత్త చార్జీలు ఆదివారం ఉదయం నుంచి అమల్లోకి తెచ్చింది.
రౌండాఫ్‌తో పెరిగిన భారం
♦రెండు సెస్‌లు కలిపి రూ.5 మేర మాత్రమే విధిస్తున్నట్టు కనిపిస్తున్నా.. రౌండాఫ్ వల్ల టికెట్ ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పు చోటుచేసుకుంది.
♦నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు రూ.195గా ఉన్న ఎక్స్‌ప్రెస్ చార్జీ ఇప్పుడు రూ.205కు, రూ.270గా ఉన్న సూపర్ లగ్జరీ చార్జీ రూ.280కి, రూ.330గా ఉన్న రాజధాని చార్జీ రూ.350కి చేరింది.
♦కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రూ.175గా ఉన్న ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.190కి, రూ.220గా ఉన్న సూపర్‌లగ్జరీ చార్జీ రూ.235కు, రూ.305 గా ఉన్న రాజధాని చార్జీ రూ.320కి చేరింది.
♦వరంగల్ నుంచి హైదరాబాద్‌కు... రూ.190గా ఉన్న డీలక్స్ చార్జీ రూ.200కు, రూ.215గా ఉన్న సూపర్‌లగ్జరీ చార్జీ రూ.230కి, రూ.295గా ఉన్న రాజధాని చార్జీ రూ.310కి పెరిగింది.
త్వరలో సమాచార సెస్!
ఇప్పటికే విధించిన సెస్సులకు తోడుగా ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ (ప్రయాణికుల సమాచార) సెస్ పేరుతో మరో పెంపును త్వరలో అమలు చేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. నాలుగు రోజుల క్రితం బస్సు పాస్ ధరలను కూడా సంస్థ పెంచేసిన సంగతి తెలిసిందే. గతంలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మరీ చార్జీలు సవరించారు. ఇక ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే వారికి రిజర్వేషన్ చార్జీలను కూడా రూ.20 నుంచి రూ.30కి పెంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment