సంయమనం అవసరం
రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులను ఆపడానికి గత నెల కశ్మీర్‌లో ఒక యువకుణ్ణి జీపు బయొనెట్‌కు బంధించిన ఉదంతంపై చెలరేగిన వివాదం సజావుగా సద్దుమణగడం అటు సైన్యానికి, ఇటు నేతలకు ఇష్టం లేనట్టుంది. ఆ ఘటనపై సైన్యానికి చెందిన కమిటీ విచారణ ఇంకా పూర్తి కాలేదు. అటు జమ్మూ–కశ్మీర్ పోలీసులు కూడా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదింకా ఒక కొలిక్కి వచ్చినట్టు లేదు. ఈలోగానే ఆ నిర్ణయం తీసుకున్న మేజర్ ఎన్‌ఎల్ గోగోయ్‌కు సైనిక దళాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డును సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ అందజేశారు. విశిష్ట సేవలకూ, విధుల పట్ల అంకితభావం ప్రదర్శించిన వారికీ ఆర్మీ చీఫ్ నుంచి సాధారణంగా ఈ అవార్డు లభిస్తుంది. మరోపక్క జనరల్ గోగోయ్ తన చర్యను సమర్ధించుకుంటూ కొన్ని చానెళ్లకు ఇంటర్వూ్యలిచ్చారు.
యువకుణ్ణి జీపు బయొనెట్‌కి బంధించడం దేశంలోనే కాదు... అంతర్జాతీయంగా కూడా పెద్ద వార్త అయింది. రాళ్లు రువ్వుతున్న గుంపు నుంచి నిరపాయకరంగా తప్పించుకోవడానికి, ప్రాణనష్టం వాటిల్లకుండా చూడటానికి ఇది ఉపయోగపడిందని సైన్యం నుంచి రిటైరైన అధికారులు ప్రశంసించారు. సృజనాత్మకమైన చర్యగా కొనియాడారు. సైన్యం తీసుకునే చర్యను సమర్ధించడమే దేశభక్తికి ప్రతీకగా, నిజమైన జాతీయవాదంగా విశ్వసించేవారి మాట సరేసరి. దేశంలో ప్రస్తుతం అలజడి చెలరేగని ప్రాంతాలంటూ లేవు. ఏదో ఒక సమస్యపై ఉద్యమాలు సాగుతున్నాయి. వాటిల్లో కొన్ని అప్పుడప్పుడు హింసాత్మక రూపం తీసుకుంటుంటే ఈశాన్య ప్రాంతంలోని మిలిటెంట్లు, అడవుల్లో పోరాడే మావో యిస్టుల కార్యకలాపాలు సాయుధమైనవి. కశ్మీర్‌లో మిలిటెంట్లు రాళ్లు రువ్వడం ఇటీవలికాలంలో సర్వసాధారణమైంది.
బలగాలను ప్రతిఘటించడం తమ వల్ల కానప్పుడూ, తీవ్ర నష్టం తప్పదని గుర్తించినప్పుడు సామాన్య ప్రజానీకాన్ని రక్షణ కవచంగా చేసుకుని ఘర్షణ ప్రాంతం నుంచి తప్పించుకోవడం వీరందరూ చేసే పని. అటువంటప్పుడు మేజర్ గోగోయ్ చర్యకు అవార్డు ఇచ్చిన ఆర్మీ చీఫ్‌గానీ, అది సృజనాత్మకమైనదిగా చెబుతున్న కొందరు రిటైర్డ్ సైనికాధికారులుగానీ దీనిలో ఏం కొత్తదనం వెదికారో అనూహ్యం. ఆ ఉదంతం జరిగిన రోజు శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌లో హింస చెలరేగి 8 మంది చనిపోయారు. ఇదంతా పరిస్థితి తీవ్రతను సూచిస్తున్న మాట వాస్తవమే అయినా మిలిటెంట్ల తరహా లోనే సాధారణ పౌరుణ్ణి రక్షణ కవచంగా ఉపయోగించుకోవడం ఎట్లా సరైంది అవుతుంది?
పరాయి దేశాల సైన్యంతో తలపడటానికీ, ఆంతరంగిక భద్రతను పరిరక్షించ డానికి తీసుకునే చర్యలకూ మధ్య తేడా ఉంటుంది. ఆంతరంగిక భద్రతా చర్యలు మన బలగాలకు కత్తి మీద సాము లాంటివి. తప్పించుకుపోతున్నవారిని ఏమి చేసైనా నిరోధించాలని భావించి విచక్షణ కోల్పోయి కాల్పులకు దిగితే సాధారణ పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఘర్షణ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఎలా వ్యవహరించాలన్న విషయమై నిర్దిష్టమైన నియమాలున్నాయి. వాటిని అతి క్రమిస్తే చట్టరీత్యా నేరమవుతుంది. అందుకే మేజర్ గోగోయ్ తీసుకున్న చర్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన వెంటనే సైన్యం విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 43 రోజులు గడిచాయి. ఆ విచారణ, దర్యాప్తు ఏమ య్యాయో ఇంకా తేలలేదు. ఈలోగా అవార్డు ప్రకటించడంవల్ల ఆ విచారణ, పోలీ సులు చేసే దర్యాప్తు ప్రజానీకం దృష్టిలో పలచన అయ్యే ప్రమాదం లేదా?
జెనివా ఒడంబడిక ప్రోటోకాల్ 1 ప్రకారం సాధారణ పౌరులను రక్షణ కవ చంగా వినియోగించుకోవడం యుద్ధ నేరమవుతుంది. ఈ ఒడంబడికపై సంత కాలు చేసిన దేశాల్లో మన దేశమూ ఉంది. జెనివా ఒడంబడిక వరకూ పోనవసరం లేదు. మన రాజ్యాంగమే జీవించే హక్కుతో సహా పౌరుల ప్రాథమిక హక్కులకు పూచీ పడుతోంది. ఈ ప్రాథమిక హక్కులను మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో విలువైనవిగా, పవిత్రమైనవిగా భావించారు. అసలు సొంత పౌరులను రక్షణ కవ చంగా మార్చుకునే సంప్రదాయం ఎక్కడా లేదు. ఇజ్రాయెల్ సైన్యం అలాంటి పని చేస్తున్నా అది పాలస్తీనా పౌరులను వినియోగించి వారి ప్రాంతంలో సైనిక చర్యలకు పాల్పడుతుంది తప్ప తమ గడ్డపై కాదు.
ప్రపంచ దేశాల్లో మన త్రివిధ దళాలకు మంచి పేరు ప్రతిష్టలున్నాయి. యుద్ధ సమయాల్లోగానీ, ప్రకృతి వైపరీత్యాలప్పుడుగానీ వృత్తి పట్ల వారికుండే అంకిత భావం, సామర్ధ్యం ఏపాటివో ఈ దేశ ప్రజలకు తెలుసు. కశ్మీర్ విషయానికే వస్తే మిలిటెంట్ ఉద్యమం ఉధృతంగా ఉన్న తొలినాళ్లలో సైన్యంపై చిత్రహింసలకు సంబంధించి, లాకప్ డెత్‌లకు సంబంధించి తరచు ఆరోపణలొచ్చేవిగానీ ఇటీ
వలి కాలంలో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇలాంటి చర్యలు వాటిని మస కబార్చకూడదు. తాము నిర్బంధించిన యువకుడు అంతక్రితం వరకూ రాళ్లు రువ్వాడని సైన్యం చెబుతుంటే, తాను శాలువాలకు ఎంబ్రాయిడరీ చేసి పొట్ట పోసుకునే వ్యక్తినని అతను అంటున్నాడు. పైగా ఓటేసి వస్తుండగా తనను పట్టుకున్నారని చెబుతున్నాడు.
ఇప్పుడు కశ్మీర్ లోయ మహోద్రిక్తంగా ఉంది. నిత్యం అక్కడ ఏదో ఒక చోట ఆందోళనలు సాగుతున్నాయి. వేర్పాటువాద సంస్థలు సైతం దిగ్భ్రాంతి చెందేలా ఐఎస్ ఉగ్రవాదుల జెండాలు సైతం అక్క డక్కడ కనిపిస్తున్నాయి. ఆందోళనలో పాలుపంచుకుంటున్నవారైనా, రాళ్లు రువ్వుతున్న వారైనా సంఖ్యాపరంగా చూస్తే ఇప్పటికీ స్వల్పం. స్థానికుల మనసు గెలుచుకునేలా, సమస్యాత్మకంగా మారిన మిలిటెంట్లను ఏకాకుల్ని చేసేలా భద్రతా బలగాల చర్యలుండాలి తప్ప సగటు పౌరుణ్ణి దూరం చేసుకునేలా, వారిని భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించకూడదు. అటు రాజకీయ నాయకత్వమూ, ఇటు భద్రతా బలగాలు దీన్ని గమనించుకుని సంయమనంతో మెలిగినప్పుడే తిరిగి అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఆస్కార ముంటుంది.