‘నీట్’కు ప్రాణప్రతిష్ట! | article on national eligebility test | Sakshi
Sakshi News home page

‘నీట్’కు ప్రాణప్రతిష్ట!

Published Wed, Apr 13 2016 1:01 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

‘నీట్’కు ప్రాణప్రతిష్ట! - Sakshi

‘నీట్’కు ప్రాణప్రతిష్ట!

వైద్య విద్యను అభ్యసించాలని కోరుకునే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో ఇకపై ఒకే ఉమ్మడి ప్రవేశపరీక్ష ఉండబోతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ లోగడ ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన 2-1 మెజారిటీ తీర్పును వెనక్కి తీసుకుంటు న్నట్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం తేల్చిచెప్పింది. ఈ తాజా నిర్ణయంతో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు ప్రాణప్రతిష్ట చేసినట్టయింది. పాత తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకునే వరకూ ‘నీట్’ అమల్లో ఉంటుందని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించింది. అయితే ధర్మాసనం ‘నీట్’ మంచిచెడ్డల జోలికి పోలేదు. గతంలో ముగ్గురు న్యాయమూర్తుల మధ్యా ఎలాంటి చర్చా జరకుండానే తీర్పు వెలువడిందన్న కారణాన్ని చూపి మాత్రమే వెనక్కు తీసుకుంది.

యూపీఏ హయాంలో మొగ్గతొడిగిన ‘నీట్’పై ఆది నుంచీ విద్యార్థుల్లో అనేక అనుమానాలున్నాయి. పలు రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకా ముందూ చూడకుండా దీనికి అంగీకారం తెలపడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. 2013లో ఒకపక్క ఎంసెట్, మరోపక్క నీట్ నిర్వహించడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఎంసెట్ రాయాలా...నీట్ రాస్తే సరిపోతుందా అనేది తేల్చుకోలేకపోయారు. చివరకు ఎంసెట్ ఆధారంగానే వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలు చేపట్టవచ్చునని అప్పట్లో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

వాస్తవానికి ‘నీట్’ రూపుదిద్దుకోవడానికి సుప్రీంకోర్టు 2011లో ఇచ్చిన తీర్పు ప్రధాన కారణం. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న అనేకానేక పరీక్షలు అవినీతికి తావిస్తున్నాయని, ఎన్నో అవకతవకలు చోటుచేసుకుంటున్నా యని సుప్రీంకోర్టు భావించింది. ప్రతిభావంతులకు ఏ కళాశాలలోనూ ప్రవేశం లభించని స్థితి ఉండగా...డబ్బు, పలుకుబడి ఉన్నవారు దొడ్డిదారిన సీట్లు సంపా దిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకత ఉండేలా, అందరికీ సమానావ కాశాలు లభించేలా ఒకే ఉమ్మడి పరీక్ష రూపొందించాలని భారత వైద్య మండలి (ఎంసీఐ)ని ఆదేశించింది. పర్యవసానంగా ‘నీట్’ ఉనికిలోకి వచ్చింది. వైద్య విద్యా ప్రవేశాలకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తున్న మాట వాస్తవమే. అందువల్ల వీటి కోసం సంసిద్ధం కావడం విద్యార్థులకు పెద్ద సమస్యగా మారుతున్నది.

అయితే అంతమాత్రాన ‘నీట్’ను సర్వరోగ నివారిణిగా భావించలేం. పాత సమస్యలు పోయినా దీంతో కొత్త సమస్యలు ఏర్పడే ప్రమాదం వచ్చిపడింది. ఇందుకు అందరికంటే ముందు ఎంసీఐనీ, కేంద్ర ప్రభుత్వాన్నీ తప్పుబట్టాలి. ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ అమలులో ఉన్నదనిగానీ, రాష్ట్రాల మనోభావాలను గౌరవించాలనిగానీ ఎంసీఐ అనుకోలేదు. హిందీయేతర ప్రాంతాల విద్యార్థుల కోసం ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలుండాలన్న డిమాండుకు అది తొలుత అంగీకరించలేదు. గుజరాత్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు గట్టిగా పట్టుబట్టడంవల్ల చివరకు దిగొచ్చింది. అయితే దానికొక మెలిక పెట్టింది. ఆయా భాషల్లో ప్రశ్నపత్రాలు ఇచ్చేందుకు సిద్ధమేగానీ...ఆ భాషల్లో జవాబులు రాసే విద్యార్ధులు జాతీయ స్థాయి కోటాకు అనర్హులవుతారని నిబంధన విధిం చింది. అదే సమయంలో హిందీ భాషలో పరీక్ష రాసే విద్యార్ధులు మాత్రం జాతీయ కోటాలో సీట్లు సంపాదించుకునే వెసులుబాటు కల్పించింది. మరోపక్క ప్రమా ణాలరీత్యా నాసిరకంగా ఉండే ఈ జాతీయ స్థాయి పరీక్షలో తాము పాలుపంచు కోబోమని ఎయిమ్స్ వంటి ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు నిక్కచ్చిగా చెప్పాయి. ఒకే ఉమ్మడి పరీక్ష ఉండాలన్న ఉద్దేశం కాస్తా వీటి మొరాయింపుతో మూలన బడినట్టయింది.

‘నీట్’లో ఉండే ఇతర లోటుపాట్లు ఇంతకన్నా భయంకరమైనవి. వృత్తి విద్యా కోర్సుల్ని సాధించడానికి ప్రయత్నించే లక్షలాదిమంది విద్యార్ధుల్లో అంతరాల దొంతరలుంటాయి. ఆర్ధిక స్థోమత బాగున్నవారికీ, అది సరిగా లేనివారికీ తేడా లుంటాయి. ఢిల్లీలో చదువుకున్న విద్యార్ధికీ...నాగాలాండ్‌లో చదువుకున్న విద్యార్ధికీ ఒకే రకమైన విద్యావకాశాలు అందుబాటులో ఉండవు. ఒక రాష్ట్రంలోనే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలుంటాయి. ఎంతో వెనకబడినవీ ఉంటాయి. ఇలాంటి వారంతా జాతీయస్థాయి పరీక్షలో పోటీ పడాలంటే సామాన్యమైన విషయం కాదు. వీటికితోడు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ సిలబస్ విద్యార్ధులకు ‘నీట్’ అనుకూలంగా ఉంటుంది తప్ప...ప్రాంతీయ భాషల్లో చదువుకున్నవారికి కొరు కుడు పడదు. ‘నీట్’ ద్వారా సీట్ల కేటాయింపు జరిగితే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ స్థానికేతర విద్యార్ధుల సంఖ్య పెరగడమే కాదు...స్థానికుల్లో కూడా ఉన్నత వర్గాలవారే అధికంగా ఉండే ప్రమాదం ఉంటుంది.

ఏతావాతా సమాజంలో వైద్యులు కావాలనుకున్నవారందరికీ ఇది సమానావకాశాలు ఇస్తుందన్న నమ్మకం లేదు. అలాంటపుడు ‘నీట్’ మౌలిక ఉద్దేశమే దెబ్బతింటుందన్న సంగతిని గుర్తిం చాలి. రకరకాల సెట్‌లతో సమస్యలున్నమాట...ప్రైవేటు విద్యా సంస్థలు అక్రమా లకు పాల్పడుతున్న మాట వాస్తవమైనా వాటిని అరికట్టడానికి వేరే తోవలు వెదకాలి. ఒక రాష్ట్రం నిర్వహించే సెట్‌ను వేరే రాష్ట్రం గుర్తించి తమ సీట్లలో కొంత శాతాన్ని కేటాయిస్తే ఈ సమస్య కొంతవరకూ తీరుతుంది. అలాగే ప్రైవేటు, మైనారిటీ కళాశాలలకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించవచ్చు.

ఈ ఏడాదే ‘నీట్’ నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించినా తగిన వ్యవధి లేదు గనుక ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు. కనీసం వచ్చే విద్యా సంవత్సరం లోపు అయినా ‘నీట్’ లోటుపాట్లపై సమగ్రమైన చర్చ జరిగి మెరుగైన విధానం రూపొందితే విద్యార్ధులకు మేలు కలుగుతుంది. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో  విద్యను బలవంతంగా ఉమ్మడి జాబితాలో చేర్చడంవల్ల ఎంతో నష్టం జరిగింది. దాన్ని ‘నీట్’ మరింత దిగజార్చకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement