మళ్లీ మరోసారి నల్లడబ్బు పతాక శీర్షికలకెక్కింది. మన పాలకుల చిత్తశుద్ధిని సందే హాస్పదం చేసింది. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తీసుకొస్తామన్న హామీలు హామీలుగానే మిగిలిపోతుండగా తాజాగా స్విట్జర్లాండ్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు శాఖలోనూ, ఇతరచోట్లా నల్ల ఖాతాలున్న భారతీయుల వివరాలు వెల్లడ య్యాయి.
ఫ్రాన్స్ మన దేశానికి 2011లో అందించిన జాబితాలో 628మంది భారతీ యులుండగా...ఇప్పుడు వెల్లడైన జాబితాలో ఆ సంఖ్య 1,195కు చేరుకుంది. ఇందు లో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, మాజీ అధికారులున్నారు. పన్ను ఎగ్గొట్టినట్టు తగిన ఆధారాలున్న పక్షంలో అలాంటి వారి వివరాలను మాత్రమే వెల్లడిస్తామని ఫ్రాన్స్ విధించిన షరతువల్ల గతంలో 628మంది వివరాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టు నియమిం చిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అందజేసింది.
నిబంధనల మేరకు పన్నులు చెల్లించకుండా కోట్లాది రూపాయలు దేశం దాటిస్తున్నవారి వివరాలను బహిరంగ పరచడంలో మన ప్రభుత్వానికి ఒడంబడికలు, నిబంధనలు అడ్డొస్తుండగా... మీడియా గతంలో వలే మరోసారి ఖాతాల వివరాలను బట్టబయలు చేసింది. పాత ఖాతాల్లో మొత్తం రూ. 4,500 కోట్లుండగా...తాజాగా వెల్లడించిన ఖాతాల్లో ఆ మొత్తం దాదాపు రూ. 25,420 కోట్లు. ఈ వివరాలన్నీ 2007 నాటివి గనుక ఇందులో ఎంత డబ్బు స్విస్ ఎల్లలు దాటి ఉంటుందో, ఎన్ని ఖాతాలు మూతపడి ఉంటాయో అంచనా వేయడం సాధ్యంకాదు.
ఇప్పుడు మీడియా వెల్లడించిన వివరాలు కూడా గతంలో వలే హెచ్‌ఎస్‌బీసీ మాజీ ఉద్యోగి అందించినవే. వివిధ దేశాల్లోని మీడియా సంస్థలు సమష్టిగా దర్యాప్తు చేసి వెలికితీస్తున్న ఇలాంటి వివరాలు ఇంత యంత్రాంగమున్న ప్రభుత్వానికి ఎందు కు దొరకడంలేదో అర్ధంకాని విషయం. ఆ మాజీ ఉద్యోగిని తాము కూడా సంప్రదిస్తు న్నామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం ఆశాజనకమైన పరిణామం. ఆయనంటున్నట్టు విదేశాల్లో ఖాతాలున్న ప్రతి ఒక్కరూ దోషులు కానవసరం లేదు.
వ్యాపార లావాదేవీల రీత్యా ప్రపంచంలో ఏమూలైనా ఖాతాను తెరిచే స్వేచ్ఛ ఎవరి కైనా ఉంటుంది. ఏటా సమర్పించే ఆదాయ పన్ను వివరాల్లో వాటిని కూడా వెల్లడిం చి ఉంటే ఆ ఖాతాలు సవ్యమైనవే అవుతాయి. ఇప్పుడు వెల్లడైన జాబితాలో అంబానీ సోదరులు, యశోవర్ధన్ బిర్లా, లక్ష్మణదాస్ రహేజా, రాజన్ నందా, ఆనంద్ చాంద్ బర్మన్‌వంటి వ్యాపార దిగ్గజాలతోపాటు నారాయణ్ రాణే, స్మితా ఠాక్రే వంటి రాజకీయవేత్తల పేర్లు కూడా ఉన్నాయి. అంబానీ సోదరులతోపాటు మరికొందరు విదేశాల్లో తమకు అక్రమ ఖాతాలేవీ లేవని చెబుతున్నారు.
గతం లోనూ, ఇప్పుడూ వెల్లడైన ఖాతాదారుల జాబితాలు దొంగిలించిన సమాచారం ఆధారంగా చేసుకున్నవేనని ఫ్రాన్స్ ప్రభుత్వం చెప్పడాన్నిబట్టి చూస్తే వాటిని కొట్టి పారేయడానికి లేదని సులభంగానే అర్ధమవుతుంది. మరోపక్క చాలామంది తమ పేర్లు ఎందుకున్నాయో తెలియదంటున్నారు. కనుక నిజం అనేది ఈ రెండింటి మధ్యా ఎక్కడో ఉంటుంది. 2011 నాటి జాబితాలోని నిజానిజాలను వెలికితీసే పని ఎంత వరకూ వచ్చిందో తెలియని పరిస్థితుల్లో తాజా జాబితా విషయంలో ఎప్పుడు దర్యాప్తు ప్రారంభమవుతుందో, ఎన్నాళ్లకు వాస్తవాలు వెల్లడవుతాయో అంచనా కందదు.
దేశంనుంచి ఏటా లెక్కలు చూపని దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల డబ్బు దేశం దాటిపోతున్నదని గతంలో సీవీసీగా పనిచేసి ప్రత్యూష్ సిన్హా చెప్పారు. పన్ను ఎగవేతలు, ఇతర అవినీతి కార్యకలాపాలవల్ల నల్ల డబ్బు తరలిపోతున్న దేశా ల జాబితాలో భారత్ తొలి పది స్థానాల్లో ఉన్నదని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ సంస్థ చాన్నాళ్లక్రితం వెల్లడించింది. నల్లడబ్బు ఆనుపానులు రాబట్టడానికి 81 దేశాలతో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం కుదర్చుకున్నామని, మరికొన్నిటితో పన్ను సమాచార బదిలీ ఒప్పందాలు కుదుర్చుకున్నామని యూపీఏ సర్కారు లోగడ చెప్పింది. అందుకనుగుణంగా చాలా సమాచారం సేకరించామని, అయితే ఒడంబడి కల్లో ఉన్న నిబంధనలవల్ల వివరాలు వెల్లడించలేకపోతున్నామని చెప్పింది. యూపీ ఏ సర్కారు చట్టాలను కట్టుదిట్టం చేసి ఉంటే విదేశీ బ్యాంకులు ఇలా మన ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకునే స్థితి ఉండేది కాదు. బ్యాంకుల గోప్యతకు కాలం చెల్లిందని జీ-20 శిఖరాగ్ర సదస్సు 2009లోనే ప్రకటించింది.
అటు తర్వాత చాలా దేశాలు తమ తమ దేశాల్లో చట్టాలను కఠినం చేశాయి. విదేశీ పన్ను అనువర్తన చట్టాన్ని తీసుకొచ్చిన అమెరికా...తమ జాతీయులు డబ్బు దాచుకున్న సందర్భాల్లో ఆ వివరా లను వెల్లడించాల్సిన బాధ్యతను విదేశీ బ్యాంకింగ్ సంస్థలపైనే ఉంచింది. అలా వెల్లడించని పక్షంలో తమ దేశంలో ఆ సంస్థల పెట్టుబడులపై 30 శాతం జరిమానా విధిస్తామని ఆ చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. బ్రిటన్ అయితే నల్లడబ్బు పోగేసినవారికి పదేళ్ల జైలు, ఆస్తుల జప్తు, భారీగా జరిమానా విధింపు వంటి అంశాల తో చట్టం తీసుకొచ్చింది. ఫ్రాన్స్, ఐర్లాండ్, ఈయూ వంటివి కూడా ఈ తోవనే వెళ్లాయి. ఆ దేశాలన్నీ స్విట్జర్లాండ్ బ్యాంకులను, ఇతర బ్యాంకులను దారికి తెచ్చుకో గలిగాయి.
ఆ దేశాలు పెట్టిన నిబంధనలకు తలొగ్గి నల్ల ధనం దాచుకున్నవారి సమస్త వివరాలను అందజేస్తున్న బ్యాంకులు మన దగ్గరకొచ్చేసరికి మాత్రం ఎందుకు బెట్టుచేస్తున్నాయో...మన ప్రభుత్వం ఎందుకని చురుగ్గా వ్యవహరించలేకపోతు న్నదో అర్ధంకాని విషయం. అక్రమాస్తులు ఉన్నాయని తేలిన పక్షంలో అలాంటివారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణ చేయాలని గతంలో సిట్ సూచించింది. ఇదే సమయంలో పన్నుల చట్టాలను సరళీకరించి, పారద ర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది. దేశ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న నల్లధనం విషయంలో కఠినంగా వ్యవహరించాలని అంతర్జాతీయంగా అవగాహన ఏర్పడిన నేపథ్యంలో మన దేశం కనీసం ఇప్పుడైనా కదలాలి. పటిష్టమైన చర్యలకు నడుం బిగించాలి.
మళ్లీ నల్లడబ్బు గబ్బు!
Published Thu, Feb 12 2015 1:38 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement
Advertisement