బుడి బుడి నడకలతో మొదలైన బ్రిక్స్ దేశాల ఆచరణ ఇప్పుడు కాస్త వేగం పుంజుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్),
బుడి బుడి నడకలతో మొదలైన బ్రిక్స్ దేశాల ఆచరణ ఇప్పుడు కాస్త వేగం పుంజుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్), ప్రపం చబ్యాంకువంటి అంతర్జాతీయ ఆర్ధిక వేదికల్లో పెత్తందారీతనం పెరిగి, అవి పరమ అప్రజాస్వామికంగా తయారైన ప్రస్తుత దశలో ఇలాంటి ప్రాంతీయ కూటముల అవసరం అంతా ఇంతా కాదు. డాలర్‌ను మాత్రమే రిజర్వ్ కరెన్సీగా భావించే ఆ సంస్థల తీరువల్లా, అంతర్జా తీయ మార్కెట్‌లను నియంత్రించలేని వాటి నిస్సహాయతవల్ల సంక్షో భాలు బయలుదేరడం... అవి దేశదేశాలనూ చుట్టుముట్టడం వర్తమాన ప్రపంచ వాస్తవం. మొదట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మాత్రమే ఏర్పడిన కూటమి దక్షిణాఫ్రికా చేరాక బ్రిక్స్‌గా రూపుదిద్దు కుంది. తొలి శిఖరాగ్ర సదస్సునాటికే వచ్చిపడిన ఆర్ధికమాంద్యంలో ఈ కూటమి దేశాలు వ్యవహరించిన తీరు ఆ మాంద్యం తీవ్రతను చాలా తగ్గించిందనే చెప్పాలి. ఇందుకు అప్పటికే జీ-20వంటి వేదికల్లో ఈ కూటమి దేశాలు పనిచేయడం చాలా అక్కరకొచ్చింది.
ఆరేళ్ల సుదీర్ఘ అనుభవం తర్వాత ఇప్పుడు బ్రెజిల్‌లోని ఫోర్ట లేజాలో రెండురోజులపాటు జరిగిన శిఖరాగ్ర సదస్సు బ్రిక్స్ బ్యాంకును, అత్యవసర రిజర్వు నిధిని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రక టించింది. ఆకాంక్షలనుంచి ఆచరణ వరకూ జరిపిన ఈ ఆరేళ్ల ప్రయా ణంలోనూ బ్రిక్స్ దేశాలకు ఎన్నో అనుభవాలయ్యాయి. ప్రాంతీయ దేశాలు ఒక కూటమిగా ఏర్పడి అగ్రరాజ్యాలనుంచి, సంస్థలనుంచి స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడం, తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లే పరిస్థితులు ఏర్పడితే సమైక్యంగా ప్రతిఘటించడం ఒక మంచి పరిణామం. బ్రిక్స్ ఏర్పడిననాడు దాన్ని అగ్ర రాజ్యాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పటికే ఉన్న అనేక కూటములకు మరొకటి వచ్చిచేరిందన్న భావనకూడా వాటికి ఉంది. దానికితోడు బ్రిక్స్ దేశాలమధ్య పొడసూపిన విభేదాలు కూడా తక్కువేమీ కాదు. బ్రిక్స్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండాలనే అంశం దగ్గరనుంచి బ్యాంకు తొలి చైర్మన్ ఎవరు కావాలన్న అంశం వరకూ ఎన్నిటినో తేల్చుకోవాల్సి వచ్చింది. బ్యాంకు ప్రధాన కార్యాలయం గురించీ, చైర్మన్‌గిరీ గురించి మన దేశమూ, చైనా పోటీపడ్డాయి. చివరకు ప్రధాన కార్యాలయం చైనా వాణిజ్య రాజధాని షాంఘైకు పోగా, ఆరేళ్లపాటుండే చైర్మన్ పదవి మన దేశానికి దక్కింది. బ్యాంకు గురించి 2012లో తొలిసారి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రతిపాదించారు. ఆ తర్వాత సభ్య దేశాలమధ్య ఎడతెగని సంప్రదింపులు జరుగుతున్నా అవి ఒక కొలిక్కిరాలేదు. ఈసారైనా బ్యాంకు ఏర్పాటు కల సాకారమ వుతుందానన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. వంద కోట్ల డాలర్ల రిజర్వు నిధితో మరో రెండేళ్లలో ప్రారంభమయ్యే ఈ బ్యాంకు సభ్య దేశాల్లో మౌలిక సదుపాయాల పెంపునకు అవసరమైన రుణాలను సమకూరుస్తుంది. రుణాలివ్వడం సభ్యదేశాలకే పరిమితం చేయాలా లేక ఇతర వర్ధమాన దేశాలకు కూడా అందించాలా అన్న అంశాన్ని ఇంకా నిర్ధారించవలసి ఉన్నది.
బ్రిక్స్ బలంగా ఉంటే, దానిద్వారా ప్రాంతీయ సహకారం పెరిగితే వనరుల సమీకరణ విస్తృతమవుతుంది. మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే వీలుంటుంది. మౌలిక సదుపాయాల కోసం ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు సంస్థలను సంప్రదించినప్పుడు అవి సవాలక్ష షరతులు విధిస్తున్నాయి. బ్రిక్స్ బ్యాంకు వర్ధమాన దేశాలకు అవసరమైన స్థాయిలో రుణాలివ్వలేకపోవచ్చుగానీ వాటి అవసరాల్లో కొంత భాగాన్నయినా భరిస్తుంది. ఆ రకంగా చిన్న దేశాలకు ఎంతో మేలు కలిగే అవకాశం ఉన్నది. ఇక ఐఎంఎఫ్‌ను పునర్వ్యవస్థీకరించా లని చాన్నాళ్లుగా డిమాండు ఉన్నా దాన్ని పట్టించుకునే నాథుడు లేడు. అగ్రదేశాలకున్న ‘అతి సభ్యత్వాన్ని’ తగ్గించి, వర్ధమాన దేశాలకు వాటి వాటాకు అనుగుణంగా సభ్యత్వమివ్వాలని ఎప్పటినుంచో కోరుతు న్నారు. సరైన ప్రాతినిధ్యంలేని దేశాలన్నిటికీ కలిపి 48 శాతం కోటా ఇవ్వాలన్న అంశంలో చివరకు ఒప్పందం కుదిరినా అమెరికా కాంగ్రెస్ అయిదేళ్లుగా దాన్ని ఎటూ తేల్చకుండా వదిలేసింది. గత ఏడాది జన వరిలో కోటా పెంపు సమస్య ఎజెండాలోకొచ్చినప్పుడు ఐఎంఎఫ్ దాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. ఇతర సంస్కరణల ప్రతిపాద నలు ఇంతవరకూ చర్చకే రాలేదు. ఈ పరిస్థితుల్లో బ్రిక్స్ బ్యాంకు ఎంతో కొంతమేర ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగపడుతుంది. అయితే, బ్రిక్స్ తాజా చర్యల పర్యవసానంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తాయని, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు పెత్తనం తగ్గు తుందన్న భ్రమలు ఎవరికీ లేవు. అయితే, స్వల్పస్థాయిలోనైనా బ్రిక్స్ బ్యాంకువంటివి ప్రభావం చూపగలవు. వర్ధమాన దేశాలు ఇకనుంచి తమ స్వరాన్ని పెంచగలవు. బేరమాడేందుకు సాహసించగలవు.
బ్రిక్స్ వేదికనుంచి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రా యెల్, సిరియా, ఇరాక్ ఘర్షణలవంటి ప్రపంచ సంక్షోభాలలో సమష్టి స్వరం వినిపిద్దామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంతో పోరాడుతున్న అఫ్ఘానిస్థాన్‌కు సాయపడదామని కోరారు. ఇది శుభసూచకం. ఏక ధ్రువ ప్రపంచాన్ని కలగంటూ ప్రతి అడుగునూ ఆ దిశగానే వేస్తూ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెడుతున్న అమెరికాపై ఏదో ఒక మేర ఒత్తిడి తెచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. శిఖరాగ్ర సదస్సు సంద ర్భంగా సభ్యదేశాల అధినేతలతో మోడీ చర్చలు జరిపారు. ముఖ్యంగా చైనాతో సరిహద్దు సమస్య విషయమై మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను తేల్చుకుందామని జి జిన్‌పింగ్ ముందుకు రావడం కూడా ఆశావహమైన పరిణామం. మొత్తానికి బ్రిక్స్ సదస్సు ఒక మంచి వాతావరణంలో ముగిసింది. ఒక కొత్త దశను వాగ్దానం చేసింది.