ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ రెండున్నరేళ్లక్రితం ప్రమాణస్వీకారం చేసినప్పుడు మీడియా అంతా ఆయనకు బ్రహ్మ రథం పట్టింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం బరువు బాధ్యతలు అతి పిన్న వయస్కుడు చేపట్టారని, ఆయన నేతృత్వంలో యూపీ కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేశాయి. కానీ, యూపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇంతకాలం గడిచినా ఆయనకు పాలనపై పట్టు రాలేదని స్పష్టమవుతున్నది. అత్యాచారాలతోసహా మహిళలపై ఎడతెగకుండా సాగుతున్న హింస ఒకపక్క... అడపా దడపా సంభవిస్తున్న మత ఘర్షణలు మరోపక్క ఆ రాష్ట్రంలో సామా న్యులకు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నాయి. అఖిలేష్ ప్రభు త్వాన్ని పట్టిపీడిస్తున్న అపరిపక్వత, అవగాహన లేమి నేరగాళ్లకు బాగా అందివస్తున్నది. మతం పేరిట ప్రజల్ని విభజించడానికి, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి సాగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో అఖిలేష్ సర్కారు విఫలమవుతున్నది. అది మొద్దునిద్ర పోతున్నదా లేక అచేతన స్థితికి చేరిందా అన్నది అర్ధంకావడం కూడా కష్టమే. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ప్రారంభమవుతున్న ఘర్షణలు చివరకు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. గృహదహనాలు, ఆస్తుల ధ్వంసం, లూటీలు సాగిపోతున్నాయి.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు మొదలు కొని ఈనాటి వరకూ ఆ రాష్ట్రంలో... మరీ ముఖ్యంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో విడవకుండా సాగుతున్న మత ఘర్షణల విష యంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఆ ప్రాం తంలో ఏదో ఒక మూల మత ఘర్షణలు జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. మే 16 నుంచి గత నెల 25 వరకూ ఈ ప్రాంతంలో మొత్తం 605 మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఒక ఆంగ్ల దినపత్రిక పరిశీలనలో తేలింది. ఇందులో నిరుడు అల్లర్లతో అట్టుడికిన ముజఫర్‌నగర్ ప్రాంతంతోసహా సహా అనేక పట్టణాలు, గ్రామాలు న్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు తాజాగా మీరట్ జిల్లాలోని ఒక మదర్సాలో పని చేస్తున్న యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం జరిపి మతమార్పిడికి పాల్పడ్డా రన్న వార్త ఆ ప్రాంతాన్ని అట్టుడికిస్తున్నది. ఈ ఉదంతంలో బాధితు రాలు ఫిర్యాదును పోలీసులు స్వీకరించేందుకు నిరాకరించారని తేల డంతో పరిస్థితి మరింత విషమించింది. ప్రభుత్వ జోక్యంతో చివరకు ఫిర్యాదు తీసుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిని అరెస్టుచేశారు. అయితే, ఇన్ని నెలలుగా వరసబెట్టి ఘర్షణలు, ఉద్రిక్త తలు చోటుచేసుకుంటున్న రాష్ట్రంలో పోలీసులు ఇంత నిర్లక్ష్యాన్ని ఎందుకు ప్రదర్శించవలసి వచ్చిందన్నది కీలకమైన ప్రశ్న.
మత ఘర్షణలకూ, ఎన్నికలకూ సంబంధం ఉన్నదని ఇప్పటికే జరిగిన అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అసాంఘిక శక్తులు, రాజ కీయ పార్టీలమధ్య విడదీయరాని బంధం ఏర్పడటమూ... మతాన్ని, సంస్కృతిని తమ స్వప్రయోజనాల కోణంలోనుంచి నిర్వచించి ఉద్రిక్త తలను రెచ్చగొట్టడమూ రాను రాను పెరుగుతున్నదని ఆ అధ్యయ నాలు చెబుతున్నాయి. యూపీలో ఇప్పుడు జరిగిన 605 మత ఘర్షణలనూ గమనిస్తే మరోసారి ఇదే వాస్తవం బయటపడుతుంది. 259 ఘర్షణలు సంభవించిన పశ్చిమ యూపీలో మొత్తం అయిదు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. ప్రాంతాలవారీగా చూస్తే 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సిన తెరైలో 29, ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సిన అవధ్‌లో 53, రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సిన తూర్పు యూపీలో 16, రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 6 ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఎక్కువ ఘటనలు ఉప ఎన్నికలు జరగాల్సిన నియోజకవర్గాల్లోనే కేంద్రీకృతం కావడం గమనార్హం. ప్రార్థనా స్థలాల నిర్మాణం, లౌడ్ స్పీకర్లను అమర్చడంవంటి కారణాలే ఈ ఘర్షణల్లో చాలావాటికి ప్రధాన కారణం కావడం కూడా యాదృచ్ఛికం కాదు. దాదాపు నిత్యమూ చోటుచేసుకుంటున్న ఈ అల్లర్లన్నిటి వెనకా ఒక స్పష్టమైన పథకం కనబడుతుండగా యూపీ ప్రభుత్వం ఎందుకని మిన్నకున్నదని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ అల్లర్లతో ప్రయోజనం పొందాలనుకుంటున్న శక్తులు కేవలం ఒక మతానికి చెందినవారు మాత్రమే కాదు. అలాంటివారు అన్నిటా ఉన్నారు. ఇలాంటి శక్తులు పోటీపడి సాగిస్తున్న కార్యకలాపాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడమే కాదు...అమయాక పౌరుల ప్రాణాలను కూడా బలిగొంటున్నాయి.
ఓటు లెక్కలేసుకుని రాజకీయ పార్టీలు అడుగులేయడంవల్లే ప్రధా నంగా మత ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నది నిజం. గ్రామ స్థాయినుంచి కమిటీలు, కార్యకర్తలు దండిగా ఉండే ఈ పార్టీలకు తెలి యకుండా, వాటి ప్రమేయం లేకుండా ఎక్కడైనా, ఏదైనా జరుగుతుం దనుకోవడం భ్రమ. ఇలాంటి ఘర్షణల్లో తాము సైతం లబ్ధిపొంద వచ్చునని ప్రతి ఒక్కరూ తహతహలాడబట్టే అవి నిర్నిరోధంగా సాగిపోతున్నాయి. జాతీయ సమగ్రతా మండలిలో మత కల్లోలాలను తీవ్రంగా ఖండించడం, మతతత్వాన్ని నిరోధించేందుకు ఉమ్మడిగా కృషి చేద్దామని పిలుపునివ్వడం తప్ప మత ఘర్షణల మూలకార ణాల్లోకి పార్టీలుగానీ, ప్రభుత్వాలుగానీ ఏనాడూ పోలేదు. మత హింస నిరోధానికి బిల్లు తెస్తామని చెప్పిన యూపీఏ ఆ వంకన మైనారిటీలకు దగ్గరవుదామని ప్రయత్నించింది. ఆ బిల్లు అయినా లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడ్డాక పార్లమెంటు ముందుకు తీసు కొచ్చింది. రాజకీయ పక్షాలు ఇకనైనా పాక్షిక ప్రయోజనాలను పక్కన బెట్టి ఆలోచించాలి. మతకలహాల చిచ్చును మొగ్గలోనే తుంచడానికి ప్రయత్నించాలి.
కల్లోల ప్రదేశ్!
Published Wed, Aug 6 2014 12:35 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement