సమాజంలో అలుముకున్న అనాగరిక ప్రవృత్తిని కఠినమైన చట్టాల ద్వారా, పౌరుల్లో చైతన్యం తీసుకురావడంద్వారా సరిదిద్దవలసిన పాలకులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఏమవుతుందో ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో తరచుగా జరుగుతున్న అత్యాచారాలు తేటతెల్లం చేస్తు న్నాయి. ముంబై శివార్లలో అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు మొ న్నటి ఏప్రిల్‌లో ఉరిశిక్ష విధించినప్పుడు ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ములాయం ‘కుర్రాళ్లన్నాక తప్పులు చేయడం సహజం. అంతమాత్రానికే ఉరితీస్తారా?!’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆయన ఆగలేదు. తమకు అధికారమిస్తే ఇలాంటి చట్టాలను రద్దుచేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆయన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తండ్రిని మించిపోయారు. ఆయన ఇంగ్లిష్ చదువులు చదువుకున్నారని, మరో కులానికిచెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు గనుక ఆయనకు ప్రగతిశీల స్వభావం కూడా ఉన్నదని భావించినవారంతా నిర్ఘాంతపోయేలా మాట్లాడారు. ‘రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటార’ని అడిగిన మహిళా విలేకరినుద్దేశించి ‘మీకైతే అంతా బాగానే ఉంది కదా...ఆ సంగతి గురించి రాయండి. సరిపో తుంద’ని జవాబిచ్చారు. దీనిపైనే తీవ్ర నిరసనలు వ్యక్తంకాగా ఆయన మరో అడుగు ముందుకేశారు. ‘ఇది గూగుల్ యుగం. నెట్‌లోకి వెళ్లి చూడండి. అత్యాచారాలు ప్రపంచమంతటా జరుగుతున్నాయి. ఒక్క యూపీ గురించి మాత్రమే పట్టించుకుంటున్నారెందుక’ని ప్రశ్నిం చారు. సమాజాన్ని సరైన దోవలో నడిపించవలసినవారు, బాధ్యతా యుతంగా వ్యవహరించి నేరాలను అరికట్టవలసినవారు ఇంతటి అజ్ఞానాన్ని, ఇంతటి అవగాహనాలేమిని ప్రదర్శిస్తే సహజంగానే నేరాలు మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంటుంది. యూపీలో ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇద్దరు దళిత బాలికలపై అత్యాచారం చేసి, ఆపై వారిని చెట్టుకు ఉరేసి ప్రాణం తీసిన తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుం డగానే మరికొన్ని ఘటనలు చోటుచేసు కున్నాయి. అదే రాష్ట్రంలోని అలీ గఢ్‌లో మంగళవారం ఒక మహిళా న్యాయమూర్తిపై అత్యాచారం జరిపి, ఆమెతో విషం తాగించారు. ఆమె ఇప్పుడు చావుబతుకుల్లో ఉన్నారు.
ముంబై అత్యాచారం కేసులో ఉరిశిక్ష విధించడంపై ములాయం మాత్రమే కాదు... హక్కుల సంఘాల నేతలు కూడా వ్యతిరేకించారు. అయితే, ఆ వ్యతిరేకతలో తేడా ఉన్నది. హక్కుల సంఘాల నేతలు ఉరిశిక్ష ఉనికినే సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తారు. ఎంతటి తీవ్ర నేరం చేసి నవారినైనా సంస్కరించాలి తప్ప చంపడంవల్ల సమస్య పరిష్కారం కాదంటారు. తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని రుజువైనప్పుడు జీవి తాంతం ఖైదు చేయడంవంటి చర్యలు తీసుకుంటే నేరం చేసేవారికి అదొక గుణపాఠంగా ఉంటుందంటారు. కానీ, ములాయం ఉద్దేశం అది కాదు. అత్యాచారం లాంటి చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష విధిం చడమేమిటన్నది ఆయన ప్రశ్న. మహిళలను చిన్నచూపు చూడటం ములాయంకు కొత్త కాదు. లోగడ మహిళా కోటా బిల్లు పార్లమెం టులో చర్చకొచ్చినప్పుడు ఇది చట్టమైతే సభలో ఆడవాళ్ల సంఖ్య పెరు గుతుందని, పర్యవసానంగా ఇక్కడ కూడా పిల్లికూతలు, ఈలలు విన బడక తప్పదని వ్యాఖ్యానించి అందరినీ దిగ్భ్రాంతిపరిచారు. ఒక్క ములాయం మాత్రమే కాదు... దాదాపు పాలకులుగా ఉంటున్నవారం దరిదీ మహిళల విషయంలో ఇలాంటి అజ్ఞానమే. చిత్రమేమంటే, అత్యాచారాల విషయానికొచ్చేసరికి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఇదే ఆలోచనాధోరణిని ప్రదర్శించారు. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో అత్యాచారం జరిగినప్పుడు అదంతా తమ ప్రభు త్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికుద్దేశించిందేనని వ్యాఖ్యానించారు. పైగా ఆ కేసులో నిందితులను వెనువెంటనే అరెస్టుచేసిన పోలీసు అధికారులను అభినందించాల్సిందిపోయి మందలించారు.
ఆధిపత్య సంస్కృతిలో అత్యాచారం ఒక ఆయుధం. సమాజంలో అణగారిన వర్గాలపై ఆధిపత్యం చెలాయించాలని చూసేవారూ, మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుంటే తమ ఆధిపత్యానికి ఎక్కడ ముప్పు కలుగుతుందోనని అభద్రతతో కుంగిపోయేవారూ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. స్త్రీ పురుష సంబంధాల్లోనూ, కుల వ్యవస్థలోనూ నెలకొన్న ఆధిపత్య భావజాలంవల్లే మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. యూపీలోని బదాయూలో జరిగింది ఇదే. ములాయం కులానికే చెం దిన ఏడుగురు దుండగులు దళితులను భయభ్రాంతులను చేయడా నికే, వారిపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికే ఇద్దరు బాలిక లపైనా అత్యాచారం జరిపి, వారిని చెట్టుకు వేళ్లాడదీశారు. ఇలాంటి ఆధిపత్య సంస్కృతికి నేతలు తమ తెలివితక్కువ వ్యాఖ్యానాలతో నారూ నీరూ పోస్తున్నారు. నేరగాళ్లు తమ కులస్తులనో, పార్టీ కార్యకర్త లనో లెక్కేసి వారికి రక్షణ కల్పిస్తున్నారు. పల్లెసీమల్లో అట్టడుగు కులాలవారికి బతకలేని స్థితిని కల్పిస్తున్నారు. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు నేతలందరూ నోరుపారేసుకుని తమ మరు గుజ్జుత నాన్ని బయటపెట్టుకున్నారు. తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాక కొంద రు క్షమాపణలు కూడా చెప్పారు. మీడియా ప్రభావం ఇంతగా పెరి గిన ఈ కాలంలో కూడా అలాంటి ఉదంతాలనుంచి గుణపాఠం నేర్చు కుని సక్రమంగా వ్యవహరించాలన్న స్పృహ ఇతర నాయకులకు కల గటం లేదు. అలాంటివారి జాబితా రోజురోజుకూ పెరుగుతూనే ఉం ది. ఈ బాపతు నాయకులు కాస్తయినా ఎదగాలి. ధోరణిని మార్చు కుని పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. మంచి చేయకపోతే పోయారు... కనీసం చెడుకు కారకులు కాకూడ దన్న స్పృహ వారిలో కలగాలి.
నేతల తీరు మారాలి!
Published Thu, Jun 5 2014 12:20 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement