‘బదాయూ’తో భారత్ బద్నాం!
ములాయంకు అత్యాచారం సంఘటన కన్నా ఓట్లు విలువైనవి. ఆయన పురుష దురహంకార ధోరణికీ, లింగపరమైన వివక్షకూ ముమ్మూర్తులా ప్రతీకగా నిలుస్తున్నారు. ములాయం, అఖిలేశ్ యాదవ్‌లు అత్యాచారాన్ని ఒక చిన్న సంఘటనగానే భావిస్తారు. ఇలాంటి రాజకీయాలు నడిపినందుకే ఇటీవల ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారు.
సభ్యసమాజం తలదించుకునేలా ఏదైనా అనాగరిక సంఘటన జరిగితే భయాందోళనతో నిశ్చేష్టులు కావడం ప్రజాస్వామ్య స్పందన కాజాలదు. ప్రజల అభిప్రాయాలను విననప్పుడు అది ప్రజాస్వామ్యమే కాదు.ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో ఇద్దరు దళిత యువతులను గ్యాంగ్‌రేప్ చేసి ఒక చెట్టుకు ఉరివేయడం చాలా ఘోరమైన సంఘటన. ఇది ఆ నేరగాళ్ల విపరీతబుద్ధికి నిదర్శనం. కులతత్వ దురహంకారంతోనే దళిత యువతులపై అఘాయిత్యానికి ఒడిగట్టారని స్పష్టమవుతూనే ఉంది. ఈ సంఘటనలోని సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పోలీసులు, అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. అంతేకాదు స్థానిక పోలీసులు తమను కాపాడతారన్న ధీమా రేపిస్టుల్లోనూ, హంతకుల్లోనూ ఉంది.
వెలుగుచూడని కేసులు మరెన్నో
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అత్యాచార సంఘటనల్లో ఎంతమంది బాధిత యువతులు అవమానంతో కుంగిపోయారో? గ్రామాల్లో కుల కండకావరంతో రెచ్చిపోయే కీచకుల అఘాయిత్యాలతో ఆ బాధిత యువతుల మౌనంలో ఎన్ని కేసులు వెలుగులోకి రాకుండా మూలనపడ్డాయో ఎవరికి ఎరుక? జీవితంలో ప్రశాంతత కోసం పరుగులు పెట్టే మనలో కొందరు భయంకర వాస్తవాన్ని తెలుసుకోడానికి ఇష్టపడరు. అణచివేత బహు రూపాలుగా సాగుతుంది. దానికి ఎన్ని సాకులైనా చూపించుకోవచ్చు. అణచివేత ఒక జాతిలో వివిధ స్థాయిల్లో కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ అసహ్యకర పరిణామాలను నిలువరించేందుకు ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య సాధనాలు మనకు ఉపయోగపడవు. అందుకే పౌరులు అప్పుడప్పుడు బిగ్గరగా నిరసనలు ప్రకటిస్తారు. దాంతో మీడియా కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ సంఘటనలను ఎలుగెత్తి చాటుతాయి. సమాజం మేలుకోవల్సిందిగా పిలుపిస్తాయి.
కాని అధికారంలో ఉన్న వారు నిద్రలేస్తారా? ప్రస్తు తం ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దేశం లో ఇప్పుడు రాజకీయ నాయకుల వయసురీత్యా చూస్తే 40 ఏళ్ల అఖిలేశ్ యువకుడే. ముఖ్యమంత్రి కుర్రాడు కాబట్టి కొంత వివేకంతో ఆలోచిస్తాడని ఎవరైనా భావి స్తారు. అదే ఉద్దేశంతో దళిత యువతుల గ్యాంగ్‌రేప్ సం ఘటన గురించి కాన్పూర్‌లో ఒక మహిళా విలేకరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం అక్కడి వారిని నిశ్చేష్టుల్ని చేసింది. ‘‘మీకేమీ కాలేదు కదా?’’ అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఒక మహిళా జర్నలిస్టునుద్దేశించి అనడం బట్టి ఎంత సిగ్గుమాలినతనంతో, తెంపరితనంతో ఆయన బదులిచ్చారో అర్థమవుతూనే ఉంది.
మహిళా విలేకరులు ఇక అదృష్టంపైనే ఆధారపడాల్సి ఉంది. రాజకీయ నాయకుల్ని ఎక్కువగా ప్రశ్నలడిగి ఇబ్బంది పెట్టకూడదు మరి. తర్వాత ఎవరి వంతో ఎవరికి తెలుసు? ఇదే యూపీ ముఖ్యమంత్రి ప్రజలకిచ్చే సందేశం!
పురుష దురహంకార ధోరణి
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గ్యాంగ్ రేప్‌లకు సంబంధించి అఖిలేశ్ తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఒక సం చలన వ్యాఖ్య చేశారు. గ్యాంగ్ రేప్ సంఘటనలో దోషులుగా రుజువైన ముంబైకు చెందిన నలుగురు యువకులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నేరానికి పాల్పడిన వారు ఏ వర్గానికి చెందిన వారో ఆ వర్గీయుల ఓట్లపై కన్నేసిన ములాయం సింగ్ యాదవ్ దోషులను వెనకేసుకొచ్చారు. అలాంటి ‘బాల్యచాపల్య’ నేరాలకు అంతటి ఘోర శిక్షలేమిటని నిగ్గదీశారు. దీన్నిబట్టి సై ద్ధాంతికంగా మరణశిక్షను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసినట్టుగా భావించనక్కర్లేదు. ములాయంకు అత్యాచారం సంఘటన కన్నా ఓట్లు విలువైనవి. పురుష దురహంకార ధోరణికీ, లింగపరమైన వివక్షకూ ము మ్మూర్తులా ఆయన ప్రతీకగా నిలుస్తున్నారు. యూపీని పాలిస్తున్న సీఎం నుంచి గప్పాలు కొట్టి కాలం వెళ్లదీసే వారూ, నేరగాళ్లూ, సోమరిపోతు పోలీసులూ ఏం తెలుసుకుంటారు? ములాయం, అఖిలేశ్‌ల పాలనలో అత్యాచారం అన్నది ఒక చిన్నపాటి సంఘటన మాత్రమే అని భావి స్తారు. ఇలా ద్వేషంతో రాజకీయాలు నడపడాన్ని ఇటీవల ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారు. అందుకే యూపీలో సమాజ్‌వాదీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.
బదాయూకు కొన్ని వేల మైళ్ల పశ్చిమాన పొరుగున పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఒక హృదయవిదారకరమైన సంఘటన జరిగింది. మే 27న మంగళవారం 25 ఏళ్ల గర్భవతిని ఆమె సన్నిహిత బంధువులే రాళ్లతో కొట్టి చంపారు. ఆమెను అక్షరాలా రాళ్లతో బంధువులే అత్యం త కిరాతకంగా కొట్టి చంపారు. లాహోర్ నగరంలో పట్టపగలు ఒక కోర్టు వెలుపల ఆ యువతి తండ్రి, సోదరులు, బంధువులలో 20 మంది మగవాళ్లు కలిసి రాళ్లతో చంపారు. ఇది పట్టపగలు జరిగిన హత్య, రాత్రి వేళ జరిగింది కాదు. తన అనుమతి లేకుండా తన కూతురు ప్రేమించిన యువకుడిని పెళ్లిచేసుకోవడంతో ఆగ్రహించిన ఆ తండ్రి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాదు, కూతుర్ని రాళ్లతో కొట్టి చంపినందుకు ఆ తండ్రి విచారించలేదు. పైగా అదే తగిన శిక్ష అని సమర్థించుకున్నాడు కూడా.
ఈ క్రూరమైన హత్యాకాండకు పాల్పడిన వారి మానసిక ధోరణి ఎన్ని శతాబ్దాలు తిరోగమనంలో ఉందో చెప్పకనే చెపుతోంది. అయితే నాకు చిన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఒక మహిళను పట్టపగలు రాళ్లతో కొట్టి చంపుతుంటే, ఇంతటి ఘోరమైన దురంతం జరుగుతుంటే ఎవరూ ఎందుకు ఆపలేకపోయారు? పాకిస్థాన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన లాహోర్‌లో, అదీ... ఒక కోర్టు బయట జరిగింది. సాధారణంగా కోర్టు బయట పెద్ద సంఖ్యలో ప్రజలు తిరుగాడుతుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా పోలీసులు డ్యూటీలో ఉంటారు కూడా. ఒక రాయి విసిరి ఒక అమ్మాయిని చంపలేం. ఆమె ఆటవిక తండ్రి, సోదరులు అనేకసార్లు రాళ్లతో కొట్టి ఉంటారు. అక్కడ రాళ్లు కూడా దొరక్కపోతే పక్కనే నిర్మాణంలో ఉన్న ఇటుకలను కూడా తీసుకువచ్చి రువ్వారు. ప్రజలూ, పోలీసులూ ఆపకుండా చోద్యం చూశారు. ఒక్కరు కూడా ఈ సంఘటనను ఎందుకు ఆపలేకపోయారు?
పాక్‌లో ‘పరువు’ హత్యలు
ఉజ్వల నాగరికతకూ, గొప్ప జీవన విధానాలకూ లాహో ర్ నగరం పెట్టింది పేరు. ‘పరువు’ హత్యలకు బంధువుల చేతుల్లోనే 2013లో పాక్‌లో 869 మంది మహిళలు ఆహుతి అయినట్లు పాకిస్థాన్ మానవహక్కుల కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. పాక్‌లో మహిళల అణచివేత చెప్పనలవికాదు. అక్కడ అనేక కుటుంబాల్లో స్త్రీలను సేవకులుగా చూడడం, ఇంటి పని మనుషులుగా వాడుకోవడం, వయసు వచ్చాక వారిని అమ్మేయడం కూడా జరుగుతూ ఉంటుంది. పాకిస్థాన్‌లో గత ఏడాది పరువు హత్యలకు 869 మంది మహిళలు బలైన సంఖ్య నా దృష్టిలో అతి తక్కువ అని అంచనా. ఒక ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో పోలీసులు నమోదు చేసే అధికారిక అత్యాచారాల సంఖ్యలో ఎంత ‘పాక్షిక వాస్తవం’ ఉంటుందో, దీనిలో కూడా అంతే నిజం ఉంటుంది!
ఈ ఉపఖండంలోని ప్రజల నరనరాల్లో ఈ స్థాయిలో క్రూరత్వం నిండిపోయిందా?
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎం.జె.అక్బర్