లక్నో : ఓటమి నేర్పే గుణపాఠాలే సరైన దారిచూపుతాయనే రీతిలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పార్టీ వ్యవస్ధాపకుడు, పెద్దదిక్కైన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ను సలహాల కోసం ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురైంది. దాదాపు రెండున్నరేళ్లు ములాయంను పక్కనపెట్టిన అఖిలేష్ యాదవ్‌కు వరుస ఓటములు పలకరించడంతో వాస్తవ పరిస్థితి బోధపడింది. పార్టీని అన్ని వర్గాలకు చేరువ చేసేందుకు తండ్రి మార్గదర్శకత్వం కోసం యువనేత వెంపర్లాడుతున్నారు. 2017లో యూపీ సీఎంగా వ్యవహరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం, ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో దోస్తీ కట్టినా మెరుగైన స్దానాలు రాకపోవడం అఖిలేష్‌ను ఆలోచనలో పడవేశాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
గతంలో తండ్రిని ఖాతరు చేయని అఖిలేష్ వరుస ఓటములతో మళ్లీ ఆయన సలహాల కోసం సంప్రదిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీపై నెలకొన్న యాదవుల పార్టీ ముద్రను చెరిపేసేందుకు యాదవేతర నేతలకూ ప్రాధాన్యత ఇవ్వాలని అఖిలేష్‌కు ములాయం సూచించినట్టు సమాచారం. పార్టీలో నిర్ణయాలు తీసుకునే క్రమంలో సీనియర్ నేతలను సంప్రదించాలని అఖిలేష్‌కు ఆయన సూచించారు. పార్టీ నుంచి దూరమైన శివపాల్ యాదవ్‌నూ చేరదీయాలని ములాయం తన కుమారుడిని కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అఖిలేష్ హయాంలో పార్టీలో కిందిస్ధాయి కార్యకర్తలు, నేతలతో సమాచార లోపం నెలకొందని, ఇక పార్టీ వర్గాలతో నేరుగా అఖిలేష్ సమాలోచనలు జరుపుతారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment