రేప్ల ఎఫెక్ట్.. 10మంది ఐపీఎస్ల బదిలీ
ఉత్తరప్రదేశ్లో వరుసపెట్టి జరుగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో, ఎట్టకేలకు అఖిలేష్ ప్రభుత్వం స్పందించింది. పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. గతవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి లాంటి అత్యున్నత అధికారులను సైతం అఖిలేష్ ప్రభుత్వం గత వారం తప్పించింది. మొరాదాబాద్, బిజ్నోర్, హాపూర్, సహారన్పూర్, ఔరియా జిల్లాలకు చెందిన ఎస్పీలు, సీనియర్ ఎస్పీలను బదిలీ చేశారు.
వీళ్లకు ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండా లక్నోలోని డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేశారు. కొత్తగా స్పెషల్ టాస్క్ఫోర్స్ ఐజీ పోస్టును సృష్టించి, అధికారిని నియమించారు. బదాయూలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం, హత్య కేసుతో యూపీ సర్కారు ప్రతిష్ఠ ఒక్కసారిగా మసకబారిపోయింది. తర్వాత ఏకంగా ఓ మహిళా జడ్జిపై ఆమె అధికారిక నివాసంలోనే అత్యాచారం, హత్యాప్రయత్నం జరగడంతో పరిస్థితి మరింత దిగజారింది.