అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలి. ఆ అసాధారణ నిర్ణయాలు సృజనాత్మకంగా కూడా వుంటే తప్ప అటువంటి విపత్కర పరిస్థితులనుంచి క్షేమంగా బయటపడటం అసాధ్యం. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక విపత్తును ఎదుర్కొనడానికి ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఇది మన జీడీపీలో పది శాతం.
గత ఏడాది మన జాతీయ వార్షిక బడ్జెట్ రూ. 30,42,230 కోట్లు. ఇప్పుడు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అందులో దాదాపు రెండు వంతుల మొత్తం. కనుక ఏ విధంగా చూసిన ఇది అత్యంత సాహసోపేత చర్య. దీన్ని ఏరకంగా వ్యయం చేస్తారు... ఏ రంగానికి ఎంతెంత మొత్తం కేటాయిస్తారు...ఏ వర్గానికెంత దక్కు తుందన్న అంశాలు రాగల కొద్దిరోజుల్లో వెల్లడవుతాయి. వీటి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడతలవారీగా ప్రకటిస్తారని మోదీ తెలియజేశారు.
ఆయన సోమవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారు అమలు చేస్తున్న కార్య క్రమాలు తెలుసుకున్నారు. ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోవడం వల్ల, కరోనా వైరస్‌ను ఎదు ర్కొనడానికి భారీ మొత్తంలో వ్యయం చేయాల్సిరావడం వల్ల తమకు కలుగుతున్న ఆర్థిక ఇబ్బం దుల్ని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తమ పథకాలకు నిధులం దించాలని కూడా కోరారు.
ఇటీవల ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర ఆర్థిక రంగ సలహాదారొకరు భారీ మొత్తంలో ప్యాకేజీని ఆశించడం సరికాదని చెప్పారు. అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ వంటివి జీడీపీలో పదిశాతం మొత్తాన్ని ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించిన మాట వాస్తవమే అయినా...మనవంటి దేశం ఆ స్థాయిలో ఆసరా ఇవ్వడం కష్టమని చెప్పారు. కానీ ఇప్పుడు మోదీ చేసిన ప్రకటన చూస్తే అటువంటివారి ఊహలకు మించి ఆయన ముందడుగు వేశారని చెప్పాలి. తొలిదశ లాక్‌డౌన్ మొదలైన మూడురోజుల తర్వాత నిర్మలాసీతారామన్ రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. రైతులు, సీనియర్ సిటిజన్‌లు, వితంతువులు, వికలాంగులు, మహిళా స్వయం ఉపాధి బృందాలు, కూలీలు, కార్మికులు, నిర్మాణరంగ కార్మికులు, వైద్య సిబ్బంది తదితర వర్గాలకు లబ్ధి చేకూరేలా ఈ ప్యాకేజీని రూపొందించినట్టు ఆమె ప్రకటించారు.
అనంతరం ఆర్‌బీఐ ప్రకటించిన ఇతరత్రా ప్యాకేజీలు కలుపుకుంటే రూ. 7 లక్షల కోట్లుపైగా ఇప్పటికే వ్యయం చేశారు. అయితే అమలుకు వచ్చే సరికి అనేక సమస్యలు తప్పలేదు. ఏ వర్గాలూ సంతృప్తితో వున్న దాఖలా కనబడటం లేదు. మధ్య తరగతికి ఈఎంఐలలో మూడు నెలలపాటు వెసులుబాటిచ్చినా, అందుకయ్యే వడ్డీ మొత్తాన్ని కూడా అసలుకు జోడించి వసూలు చేస్తామని బ్యాంకులు చెప్పడంతో మధ్యతరగతి జీవులు షాకయ్యారు. ఇదంతా చివరకు తడిసిమోపెడవుతుందని రుజువైంది.
అలాగే రైతులకు, మరికొన్ని వర్గాలకు ఇచ్చిన వరాలు అంతక్రితం ప్రకటించినవేనని, అవి ఇప్పుడు ప్యాకేజీలో భాగం చేశారని అనేకులు విమ ర్శించారు. అనుకున్నట్టు జరిగితే ఈ ప్యాకేజీల ప్రభావం ద్వారా అంతిమంగా అట్టడుగు వర్గాలకు మేలు జరగాలి. కానీ అదేం కనబడలేదు. కష్టకాలంలో ఎవరికి వారు మొహం చాటేయడంతో వలస జీవులు వందలు, వేల కిలోమీటర్ల దూరంలోని స్వస్థలాలకు నడిచి వెళ్లడం మొదలుపెట్టారు. ఇలాం టివారి కోసం ప్రత్యేక రైళ్లు నడుస్తున్నా, అనేక కారణాలవల్ల అందులో అవకాశం దక్కని వేలాది మంది నడుస్తూనే వున్నారు.
గత నెల్లాళ్లుగా మన ఆర్థిక రంగ నిపుణులు భారీ ఆర్థిక ప్యాకేజీ కోరుతున్నారు. లేనట్టయితే దేశం సంకటస్థితిలో పడుతుందని హెచ్చరిస్తూ వస్తున్నారు. చుట్టూవున్న పరిస్థితులు చూస్తుంటే, మీడి యాలో రోజూ వస్తున్న వార్తలు గమనిస్తుంటే ఈ పరిస్థితి చివరికెటు దారితీస్తుందో తెలియని అయోమయం అంతటా అలుముకుంది. దాదాపు యాభైరోజులక్రితం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా చిన్నా పెద్దా పరిశ్రమల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే గ్రీన్ జోన్‌లలో వాటిని పునః ప్రారంభించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అందుకవసరమైన కార్మికులు ఇంటిబాట పట్టారు.
ఇప్పుడు ప్రకటించిన భారీ ప్యాకేజీ ఉద్దేశమేమిటో తన ప్రసంగంలో మోదీ సూచనప్రాయంగా చెప్పారు. మన దేశంలో మరింతగా ఉత్పత్తిని పెంచడమే తమ లక్ష్యమని, దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తామని తెలియజేశారు. ఈ ఉద్దేశం నెరవేరాలంటే స్వస్థలాలకు వెళ్లిన వలస జీవులంతా తిరిగొచ్చి ఉత్పాదనలో పాలుపంచుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ప్రకటించిన భారీ ప్యాకేజీలో అన్ని వర్గాలకూ చోటుంటుందని మోదీ చెప్పారు గనుక అందులో వలసజీవుల వెతలు తీరడానికి అనువైన పథకం వుంటుందని ఆశించాలి. మన దేశంలో వున్న అరకొర చట్టాలు, అంతం తమాత్రంగా అమలవుతున్న తీరు పర్యవసానంగా ఇంతక్రితం ప్రకటించిన ప్యాకేజీల వల్ల ఇటువంటి వర్గాలకు మేలు కలగలేదు.
దీన్ని ప్రభుత్వాలు గుర్తించాయి గనుక ఈ వర్గాలకు వేరే మార్గంలో మేలు చేయడం ఎలాగో ఆలోచించాలి. ఈ కష్టకాలం నేర్పిన గుణపాఠంతో వైద్యం, ఇతర రంగాల్లో మౌలిక సదుపాయాల మెరుగుకు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. అట్టడుగు వర్గాలకు తోడ్పడే పథకాలు రూపొందిస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సమస్యల్లో చిక్కు కుని కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిపై ఆధారపడిన కార్మికులు రోడ్డునపడ్డారు. ఉన్న ఉద్యోగాలు కోల్పోయి, వేతనాల్లో కోతపడి మధ్యతరగతి పడుతున్న ఇబ్బందులు సరేసరి. ఇప్పుడు ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ అన్ని వర్గాల అవసరాలనూ స్పృశిస్తూ ఒక సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరిస్తుందని, ఇప్పుడేర్పడిన సంక్షోభాన్ని అధిగమించడానికి అన్ని వర్గాలకూ తోడ్పడుతుందని అందరూ ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment