
బడి చదువుల్లో దోపిడీ
బడి చదువులకెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకు ఏటా స్కూళ్లు తెరుస్తున్నారంటేనే గుబులు. ఫీజుల బాదుడు ఎంత ఉంటుందో, అందుకవసరమైన డబ్బు ఎక్కడ తీసుకురావాలో తోచక భయం. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ స్థితిలో కాస్తయినా మార్పు రాలేదని... తల్లిదండ్రులది అరణ్యరోదనే అవుతున్నదని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌పీఏ) వెల్లడించిన అంశాలు చెబుతున్నాయి.
ఈ సమస్య ఒక్క హైదరాబాద్‌కి మాత్రమే పరిమితమైనది కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలన్నిటా ఈ పరిస్థితే నెలకొంది. నిరసనలు వ్యక్తమైనప్పుడల్లా అధిక ఫీజుల బెడదను కట్టడి చేస్తామని చెప్పడం, వారం పదిరోజులు గడిచేసరికి యధాప్రకారం మౌనముద్ర దాల్చడం అధికారంలో ఉన్నవారికి అలవాటైంది. అందువల్లే ప్రైవేటు పాఠశాలల దోపిడీ అంతకంతకు పెరుగుతున్నదే తప్ప నియంత్రణలోకి రావడంలేదు. ఒక ప్రైవేటు పాఠశాల గత ఏడేళ్లలో ఫీజుల్ని 225 శాతం పెంచిందని హెచ్‌ఎస్‌పీఏ బాధ్యుడొకరు చెప్పిన ఉదాహరణ మన ప్రభుత్వాల పనితీరును వెల్లడిస్తుంది.
తమ సంతానానికి ‘మంచి చదువు’ చెప్పించాలని సహజంగానే ఏ తల్లిదండ్రులైనా తపన పడతారు. ఆ బలహీనతను ప్రైవేటు విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. పర్యవసానంగా సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువులకే హారతి కర్పూరమవుతున్నది. చదువుల సీజన్ మొదలయ్యే జూన్‌లోనే తల్లిదండ్రులపై ఫీజుల బండ పడుతుంది. మునుపటి కన్నా 20 శాతం పెంచామని, 30 శాతం పెంచామని ప్రకటించి ప్రైవేటు పాఠశాలలు దిక్కుతోచని స్థితి కల్పిస్తాయి. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు సాధించిన ర్యాంకుల్ని ఏకరువు పెట్టి వారిని అయోమయంలోకి నెట్టేస్తాయి.
ఈ బడి మాన్పిస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో...గట్టిగా నిలదీస్తే పిల్లల చదువు ఎక్కడ కుంటుపడుతుందోనని బెంగటిల్లి తల్లిదండ్రులు అప్పో సప్పో చేస్తున్నారు. ఇద్దరు పిల్లలున్న కుటుంబం విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలకు చెల్లించుకునే మొత్తం దాదాపు రూ. 2 లక్షలవరకూ ఉంటుందని అంచనా. ఈ స్థాయిలో వసూళ్లు చేస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. తామే తీసుకొచ్చిన జీవోలను యాజమాన్యాలు అపహాస్యం చేస్తున్నా, న్యాయస్థానాలు జోక్యం చేసుకుని బాధ్యతను గుర్తు చేసినా ప్రభుత్వాలకు పట్టడంలేదు. గత అయిదేళ్లుగా వన్‌టైమ్ ఫీజు పేరిట పాఠశాలలు నిలువుదోపిడీ చేస్తున్నా, కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నా అడిగే నాథుడు లేడని హెచ్‌ఎస్‌పీఏ చెబుతోంది.
ఇంజనీరింగ్, మెడిసిన్ కళాశాలల్లో వసూలు చేసే ఫీజులకు ఎన్ని లోటుపాట్లతో అయినా ఓ విధానమంటూ ఉంది. ఆయా కళాశాలల గ్రేడ్‌ల ఆధారంగా విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసే పద్ధతి పెట్టారు. పాఠశాలల విద్యకు సంబంధించినంత వరకూ అదేమీ లేదు. ఇష్టానుసారం ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచడాన్ని నిరోధించడం కోసం జిల్లా స్థాయిల్లో ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పరుస్తూ జీవో జారీ అయినా దానికి వ్యతిరేకంగా యాజమాన్యాలు స్టే తెచ్చుకున్నాయి. పర్యవసానంగా అది అమలు కావడంలేదు.
ఫీజుల దోపిడీని అరికట్టేందుకు 2009లో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యల స్ఫూర్తితోనే ఇక్కడ కూడా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేశారు. అయితే తేడా ఏమంటే... తమిళనాట విజయవంతమైన ప్రయోగం ఇక్కడ విఫలమైంది. పాఠశాల ఉన్న ప్రాంతం, అందులో చదివే విద్యార్థుల సంఖ్య, ఆ పాఠశాల సమకూరుస్తున్న మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, ప్రయోగశాల, పారిశుద్ధ్యం, మంచినీటి సదుపాయం, ఉత్తీర్ణత శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తమిళనాడులో జిల్లా కమిటీలు ఫీజులు నిర్ణయిస్తాయి. ఇందుకు పాఠశాలల అభ్యంతరాలేమిటో తెలుసుకుంటారు. తుది నిర్ణయం కమిటీలదే. ఇలా నిర్ణయించిన ఫీజు మూడేళ్లు అమలవుతుంది. ఆ తర్వాత ఫీజుల్ని సవరించమని పాఠశాలలు కోరవచ్చు. 2013లో రాజస్థాన్ ప్రభుత్వం సైతం దీన్ని ఆదర్శంగా తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం విధించిన నిబంధనలకు తోడు టీచర్ల అర్హతలను కూడా పరిగణనలోకి తీసుకుంది. కర్ణాటక, మహారాష్ట్రలు సైతం ఇవే తరహా చట్టాలను ఈ ఏడాదినుంచి అమలు చేయడం ప్రారంభించాయి.
కార్పొరేట్ విద్యా సంస్థలు టెక్నో, కాన్సెప్ట్, ఒలంపియాడ్ వంటి విశేషణాలు తగిలించి తల్లిదండ్రుల్ని సమ్మోహనపరుస్తున్నాయి. భవిష్యత్తులో పిల్లలు ఐఐటీలకు ఎంపిక కావాలంటే తమ పాఠశాలలే అందుకు తగినవని ఊదరగొడుతున్నాయి. ఈ క్రమంలో వసూలు చేసే ఫీజులు అవధులు దాటుతున్నా, జీవోల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నా పట్టించుకునేవారుండటం లేదు. అధిక ఫీజులనుంచి తమను కాపాడాలని సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లకు సైతం ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో అవి ఏళ్ల తరబడి ఎటూ తేలకుండా ఉండిపోతున్నాయని హెచ్‌ఎస్‌పీఏ ముఖ్యుడొకరు చెబుతున్నారు.
ఇదే నిజమైతే ప్రభుత్వాలు సిగ్గుపడాలి. చిన్నప్పుడు పాఠశాలలో లభించే విద్య భవిష్యత్తుకు పునాది అవుతుందంటారు. కానీ అంగడి సరుకుగా మారిన విద్య అలాంటి పునాదిని అందించగలదా? ఆమధ్య తమిళనాడులోని ఒక పాఠశాల... కమిటీ నిర్ణయించిన ఫీజుకు అదనంగా చెల్లిస్తే వైద్య సదుపాయం, క్రీడలు, కేంటీన్ వగైరా 59 సౌకర్యాలుంటాయని తల్లిదండ్రుల్ని ఊరించింది. కమిటీ నిర్ణయించే ఫీజులు చెల్లించే పిల్లలు లైబ్రరీ సదుపాయానికి, పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొనడానికి, విహారయాత్రలకూ అనర్హులవుతారని తెలిపింది. విద్యా వ్యాపారం ఎంత వెర్రితలలు వేస్తున్నదో ఈ ఉదంతమే నిరూపిస్తున్నది.
ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మేల్కొని విద్యా వ్యాపారానికి కళ్లెం వేయాలి. అంతకన్నా ముందు ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యను అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. రేపటి పౌరుల్ని తీర్చిదిద్దడంలో అలసత్వం పనికిరాదని గ్రహించాలి.