ఎవరికి వారు.. టీడీపీ తీరే వేరు
జిల్లా టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా మరోసారి బహిర్గతమయ్యాయి. జిల్లాలో పలుచోట్ల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పార్టీ దివంగత నేతకు నివాళిగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలను సంబరాల తరహాలో జరపడం విమర్శల పాలైంది.
నరసాపురంలో రెండు గ్రూపులుగా ఎన్టీఆర్ వర్ధంతి
భీమవరంలోనూ అదే పరిస్థితి
సొంత గడ్డపై కార్యక్రమాలకు సీతారామలక్ష్మి డుమ్మా
నరసాపురం :
జిల్లా టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా మరోసారి బహిర్గతమయ్యాయి. జిల్లాలో పలుచోట్ల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పార్టీ దివంగత నేతకు నివాళిగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలను సంబరాల తరహాలో జరపడం విమర్శల పాలైంది. నరసాపురం నియోజకవర్గంలో ఎవరికి వారే అన్నట్టుగా వీటిని నిర్వహించారు. పట్టణంలోని స్టీమర్ రోడ్డులో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, అన్నదానం నిర్వహించగా.. మునిసిపల్ చైర్‌పర్సన్ పి.రత్నమాల, ఏఎంసీ చైర్మన్ రాయుడు శ్రీరాములు, మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్ వారి అనుచరులతో కలసి శివాలయం సెంటర్‌లో కార్యక్రమాలు చేశారు.
భీమవరంలో వర్గపోరు నడుమ..
భీమవరం:
భీమవరం నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు నడుమ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలో 12 చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తన స్వస్థలమైన భీమవరంలో మొక్కుబడిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), రాష్ట్ర మంత్రి పీతల సుజాత వర్గీయులు వేర్వేరుగా కార్యక్రమాలు జరిపారు. భీమవరం పట్టణ టీడీపీ శ్రేణులు మూడు గ్రూపులుగా విడిపోయారు. గత ఎన్నికల్లో భీమవరం సీటును తోట సీతారామలక్ష్మి తన కుమారుడు జగదీష్‌కు ఇప్పించుకునేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. అప్పటినుంచి ఎమ్మెల్యే అంజిబాబు, ఎంపీ సీతారామలక్ష్మి మధ్య వర్గపోరు నడుస్తోంది. అదేవిధంగా పార్టీ రాష్ట్ర నాయకుడు మెంటే పార్థసారథి కూడా అప్పట్లో సీటు ఆశించి భంగపడ్డారు. ఆయన ప్రత్యేక గ్రూపు నడుపుతున్నట్టు టీడీపీ శ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి.
తమ్ముడూ.. బూతులతో కుమ్ముడు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) :
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య నెలకొన్న కుమ్ములాటలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోసారి బయటపడ్డాయి. జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. బూతులు ఉపయోగించి మరీ ఒకరినొకరు పరోక్షంగా తిట్టుకున్నారు. తొలుత శేషమహల్ రోడ్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కొందరు టీడీపీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు హాజరయ్యారు. సభ పూర్తయ్యే సమ యానికి పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఈలి నాని, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అక్కడికి రాగా.. అప్పటికే కార్యక్రమాలు అయిపోయాయి. దీంతో వారు కంగుతిన్నారు. అదే సమయంలో మంత్రి మాణిక్యాలరావు తన దారిన తాను వెళ్లిపోయారు. దీంతో సీతారామలక్ష్మి తదితరులు అక్కడి నుంచి పాదయాత్రగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేసిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ వెళ్లారు. చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తదితరులు ప్రాంగణం బయటే ఉండిపోయారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఒక వర్గం వారు వర్ధంతి సభ నిర్వహించడంపై వాడీవేడిగా చర్చించారు. ఆ కార్యక్రమానికి మీరెందుకు వెళ్లారంటూ కొంత మంది నాయకులను జెడ్పీ చైర్మన్ నిలదీశారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఎక్కడ జరిగినా వెళ్తామని చెప్పగా.. ఇంకొందరు అలా ఎలా వెళతారంటూ నిలదీశారు. జెడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేయగా.. అక్కడున్న నాయకుల్లో కొందరు బూతు పంచాంగా విప్పారు.