సాధారణంగా నవంబర్ మధ్యలో ప్రారంభమై దాదాపు నెల రోజులపాటు జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈసారి డిసెంబర్ 15న ప్రారంభమై సెలవు లన్నీ పోగా మొత్తం 13 రోజులపాటు కొనసాగి శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి. వెంటవెంటనే మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించే కీలకమైన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా, రాజ్యసభలో మాత్రం దానికి చుక్కెదురైంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా ప్రధాని ఆధ్వ ర్యంలో అఖిలపక్ష సమావేశం జరగడం... దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించి, వాటి పరిష్కారానికి సమష్టిగా పనిచేయాలని అధికార, విపక్ష సభ్యులు ఏకాభిప్రాయానికి రావడం రివాజు. ఆ తర్వాత ఏదో ఒక సమస్య ముంచుకొచ్చి పెద్ద రగడ జరగడం, వాదోపవాదాలతో సభలు దద్దరిల్లడం కూడా మామూలే. ప్రతిపక్షాలు ప్రతిష్టకు పోయే సమస్య ఏర్పడితే చెప్పనవసరమే లేదు... రోజుల తరబడి నిరవధికంగా సభలు వాయిదాలతో గడిచిపోతాయి. ఈసారి సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి ఎన్డీయే ప్రభుత్వం ఢిల్లీ వాతా వరణాన్ని కారణంగా చెప్పినా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానితో సహా అధికార పక్ష నేతలందరూ తలమునకలై ఉండటం వల్లనే ఇలా జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘దేశద్రోహం’ ఆరోపణలు ఈసారి సమావేశాలను తుడిచి పెట్టేస్తాయన్న అనుమానాలు అందరిలో తలెత్తాయి. సమావేశాల తొలిరోజునే ఆ వివాదం ఉభయసభలనూ కుదిపేసింది. ఒక వారమంతా ఒడిదుడుకుల్లోనే గడిచి పోయింది. మన్మోహన్ పాకిస్తాన్‌తో కలిసి కుట్ర చేసినట్టు ఆధారాలుంటే అవి బయటపెట్టాలని కాంగ్రెస్ సవాల్ చేసింది. మోదీ క్షమాపణ చెబితే తప్ప శాంతిం చబోమని హెచ్చరించింది. ప్రధానిని మీరు దూషించలేదా అంటూ బీజేపీ ఎదురు దాడికి దిగింది. బహుశా తలాక్ బిల్లు వంటి కీలకమైన బిల్లును లోక్‌సభలో ఈ సమావేశాల సమయంలోనే ఆమోదింపజేసుకోవాలన్న సంకల్పం బీజేపీకి లేకపోయి ఉంటే ఈ వివాదం అవిచ్ఛిన్నంగా కొనసాగి ఉండేది. కానీ రెండు ప్రధాన పార్టీలూ తెరవెనక ఎడతెరిపి లేకుండా పరస్పరం చర్చించుకున్నాయి. వివాదంపై ఉభయ సభల్లో తమ తమ పార్టీల తరఫున చెప్పదల్చుకున్నదేమిటన్న అంశాలకు సంబంధిం చిన ముసాయిదాను ఒకరికొకరు అందజేసుకున్నారు. వాటిపై మళ్లీ అభ్యంతరాలు, నచ్చజెప్పుకోవడం వగైరాలు పూర్తయి చివరకు అవగాహన కుదిరాక ప్రభుత్వ పక్షం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ తరఫున రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ ప్రకటనలు చేశాక వివాదం సమసిపోయింది.
అధికార, ప్రతిపక్షాల మధ్య సామరస్యత ఏర్పడి సభలు సజావుగా సాగడం హర్షించదగిందే. కానీ అందుకు అయిదారు రోజులు పట్టడం విచారకరం. మొత్తంగా ఈ వివాదం వల్ల వరసగా రెండు వారాలపాటు ఉభయ సభలూ సక్రమంగా జరగలేదు. ఏదోవిధంగా ఇదంతా సమసిందని అందరూ ఊపిరిపీల్చుకునేలోగా కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే లౌకికవాదంపై ఒక కుల సంఘం సభలో చేసిన వ్యాఖ్యలు రోజంతా లోక్‌సభనూ, రాజ్యసభనూ కుదిపేశాయి. చివరకు తన మాటల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు హెగ్డే చెప్పడంతో పరిస్థితి ఉపశమించింది. మహారాష్ట్రలో ఏటా దళితులు జరుపుకునే భీమా–కోరెగావ్ విజయోత్సవ సభల సందర్భంగా ఘర్షణలు తలెత్తడం, అవి రాష్ట్రమంతా వ్యాపించడం కూడా సమావేశా లపై ప్రభావం చూపింది. పలుమార్లు రెండు సభలూ వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాలకూ, శీతాకాల సమావేశాలకూ మధ్య దేశవ్యాప్తంగా ఎందరో రైతులు రుణభారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఎప్పటిలాగే వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం ఈసారి పార్లమెంట్‌లో చర్చకు రాలేదు.
మొత్తంగా సమావేశాల కాలంలో లోక్‌సభ 91.58 శాతం, రాజ్యసభ మాత్రం 56.29 శాతం పనిచేసిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సమావేశాలు సక్రమంగా సాగితే మొదటగా పేరొచ్చేది పాలకపక్షానికే. సమస్యలొచ్చినప్పుడు విపక్షాలతో చర్చిం చడం, వారి వాదనల్లోని సహేతుకతను గుర్తించి తమవైపుగా సరిదిద్దుకోవాల్సినవి ఉంటే ఆ పని చేయడం, లేనట్టయితే విపక్షాల డిమాండు సరికాదని ఓపిగ్గా నచ్చ జెప్పడం ప్రభుత్వ పక్షం బాధ్యత. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయానికి చోటివ్వా లన్న మౌలికాంశాన్ని పాలకులు గుర్తిస్తే ఏదీ సమస్యగా మారదు. పార్లమెంటు వాయిదాలతో పొద్దుపుచ్చుతుంటే మొదటగా అప్రదిష్ట కలిగేది ప్రభుత్వానికే.
ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ రూపొందించిన బిల్లుకు లోక్‌సభలో సులభంగా ఆమోదం లభించినా రాజ్యసభలో అది సాధ్యపడదని ఎన్డీయే ప్రభు త్వానికి తెలుసు. వెంటవెంటనే మూడుసార్లు తలాక్ చెప్పిన భర్తను అరెస్టు చేయాలన్న నిబంధన వల్ల దంపతుల మధ్య సామరస్యత కుదిరే అవకాశాలు సన్నగిల్లుతాయని, ఇది అంతిమంగా బాధిత మహిళనే నష్టపరుస్తుందని ఆ పార్టీలు హెచ్చరించాయి. బిల్లుకు కాంగ్రెస్ సవరణలు ప్రతిపాదించినా వాటిపై పట్టు బట్టలేదు గనుక మూజువాణి ఓటుతో అది ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో విపక్షాలదే పైచేయి. సహజంగానే అక్కడ అవరోధాలు ఎదు రయ్యాయి. ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభ మవుతాయని శీతాకాల సమావేశాల ముగింపు రోజునే ప్రకటించారు. కనుక ఇప్పుడు తలాక్ బిల్లు ఆమోదం కోసం ఆలోగా ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారా లేక బడ్జెట్ సమావేశాలు ముగిశాక దాని సంగతి ఆలోచిస్తారా అన్నది చూడాలి.
తలాక్‌పై చట్టం తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో దాన్ని ప్రధాన ప్రచారాస్త్రం చేసుకోవాలన్న ఆలోచన ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్నట్టుంది. మొత్తానికి పార్లమెంటు వంటి అత్యున్నత చట్టసభ బలప్రదర్శనకు వేదిక కాకూడదన్న అవగాహన ఇరు పక్షాలకూ ఉండాలి. అప్పుడే పార్లమెంటు సమావేశాలు అర్ధవంతంగా సాగుతాయి. అవి ఫలప్రదమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment