యూపీలో పొత్తుల పర్వం | Editorial Article On SP And BSP Alliance In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 15 2019 1:06 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Editorial Article On SP And BSP Alliance In Uttar Pradesh - Sakshi

ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు పొత్తుల కోసం అన్వేషించడం, వ్యూహా లకు పదును పెట్టుకోవడం సాధారణమే. దేశంలో అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)–బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ)ల మధ్య శనివారం కుదిరిన ఎన్నికల పొత్తు ఇప్పుడు అనేక కారణాల వల్ల అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. చెరో 38 స్థానా లకూ పోటీ చేయాలని ఆ రెండు పార్టీలూ అంగీకారానికొచ్చాయి. కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యంవహిస్తున్న అమేథీ స్థానాలను ఆ పార్టీకే విడిచిపెట్టాలని ‘పెద్ద మనసు’తో నిర్ణయించాయి. మరో రెండింటిని అజిత్‌సింగ్‌ పార్టీ ఆర్‌ఎల్‌డీకి ఇవ్వదల్చుకున్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అక్కడ మిత్రపక్షాలతో కలిసి 73 స్థానాలు గెల్చుకుంది. అటు తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడక్కడ ప్రధాన రాజకీయ పక్షాలైన ఎస్‌పీ, బీఎస్‌పీలు రెండూ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సహజంగానే బీజేపీలో వణుకు పుట్టిస్తోంది. అయితే ఆ పార్టీని జాతీయ స్థాయిలో సవాలు చేస్తున్న కాంగ్రెస్‌ను సైతం ఈ పరిణామం ఇరకాటంలో పడేయటమే విశేషం.

ఒకపక్క రాహుల్‌గాంధీ భావి ప్రధాని అని డీఎంకే వంటి యూపీఏ మిత్రపక్షాలు చెబుతున్నాయి. బీజేపీపై పోరాడుతున్న యోధుడుగా పేరు తెచ్చుకోవడానికి నానా పాట్లూ పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఆ మాట అనకపోయినా కాంగ్రెస్‌తో పొత్తు ‘ప్రజాస్వామిక అనివార్యత’ అని అడిగినవారికీ, అడగనివారికీ చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో ప్రధాన ప్రాంతీయ పార్టీలు రెండూ కాంగ్రెస్‌ను పూర్తిగా విస్మరించటం ఆ పార్టీ సామ ర్థ్యంపై సంశయాలు కలగజేస్తుంది. రాజకీయంగా కీలకమైన రాష్ట్రంలో తనను అసలు కూటమి ఏర్పాటులో పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల జాతీయ స్థాయిలో తన పాత్ర కుంచించుకు పోవడం ఖాయమని కాంగ్రెస్‌కు తెలుసు. ఇది చాలదన్నట్టు ఎస్‌పీ–బీఎస్‌పీ పొత్తు కుదిరిన 24 గంటల్లో రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ) నాయకుడు, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజశ్వి యాదవ్‌ యూపీకి తరలివెళ్లి ఆ కూటమికి మద్దతు ప్రకటించడం కాంగ్రెస్‌ను మరింత కలవరపరిచి ఉండాలి.

బిహార్‌లో ఆర్‌జేడీ–కాంగ్రెస్‌లు ఇప్పటికే కూటమిగా ఉన్నాయి. అయితే బిహార్‌లో తేజశ్వి ఇలాంటి ప్రయోగం చేయడానికి అవకాశం లేదు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు చెందిన జనతాదళ్‌(యూ), రాంవిలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) బీజేపీకి మిత్రపక్షా లుగా ఉన్నాయి. కనుక ఎస్‌పీ–బీఎస్‌పీల తరహాలో కాంగ్రెస్‌ను దూరం పెట్టి పొత్తు పెట్టుకోవడా నికి తగిన బలమైన ప్రాంతీయ పార్టీ తేజశ్వికి బిహార్‌లో దొరక్కపోవచ్చు. 

ఎస్‌పీ–బీఎస్‌పీ పొత్తుతో ఖంగుతిన్న కాంగ్రెస్‌ తాము మొత్తం 80 స్థానాలకూ పోటీ చేస్తామని బింకంగా చెబుతున్నా ఆ రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న ఆ పార్టీకి అంతమంది అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే. కాంగ్రెస్‌ను కూడా కూటమిలో చేర్చుకుంటే అది మరింత బలంగా ఉండే దని చెబుతున్నవారున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకున్న సూచనలు కనబడ్డాయని వారి వాదన. దాంతోపాటు ముస్లిం ఓట్లలో చీలిక వస్తే ఆమే రకు బీజేపీ లాభపడుతుందని వారంటున్నారు. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నుంచి తనకెదురైన భంగపాటుకు ఇది మాయావతి ఇచ్చిన జవాబు అని చెప్పాలి. పొత్తు కుదిరాక జరిగిన విలేకరుల సమావేశంలో ఇది స్పష్టంగా బయటపడింది. కాంగ్రె స్‌పై ప్రశ్నలు ఎదురైనా ఎస్‌పీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా మౌనంగా ఉండిపోగా, మాయావతి మాత్రం నిప్పులు చెరిగారు.

ఇదంతా ఆ రెండు పార్టీల నేతలూ ముందుగా నిర్ణయించుకున్న వ్యూహంలో భాగమే కావొచ్చు. కాంగ్రెస్‌తో రెండు భిన్న సందర్భాల్లో ఆ రెండు పార్టీలూ యూపీలో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నాయి. మాయావతి వ్యక్తి గతంగా పొత్తు లకు వ్యతిరేకం. రెండు దశాబ్దాలపాటు పొత్తుల కోసం వెంపర్లాడటం వల్లనే రాష్ట్రంలో తమ పార్టీ దెబ్బతిన్నదని ఆమె భావన. అందుకే ఆమె వీటికి దూరంగా ఉన్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో  20 స్థానాలకు పరిమితమైన ఆమె పార్టీ 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూశారు. అనంతరం 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెల్చుకోలేకపోయారు.

రాష్ట్రంలో ఫలానా కులం లేదా మతం ఓట్లు లభించడానికి ఆ వర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్నా మని చెప్పే పార్టీలతో పొత్తు కంటే... నేరుగా ఆ వర్గాలవారికి రాయితీలిస్తామని చెప్పడమే మార్గ మని ఆమె నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్‌పీ–బీఎస్‌పీ కూటమిగా ఏర్పడాలని నిర్ణ యించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రాంతీయ పార్టీలు సన్నిహితం కావడం సాధారణ విషయం కాదు. అఖిలేష్‌ యాదవ్‌ గట్టిగా కృషి చేయకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. బీజేపీని దెబ్బతీయడానికి బీఎస్‌పీతో కలిసి నడ వటం అవసరమని ఆయన గుర్తించటంతోపాటు మాయావతిని కూడా అందుకు ఒప్పించారు.  

ఉత్తరప్రదేశ్‌లో సాగుతున్న వరస ఎన్‌కౌంటర్లు, గోరక్షణ పేరుతో కొన్ని ముఠాలు సాగిస్తున్న దాడులతో ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీతో విసుగెత్తి ఉన్న మాట వాస్తవం. కానీ ఆ అసంతృప్తి మాత్రమే ఎస్‌పీ–బీఎస్‌పీ కూటమికి అధిక స్థానాలు సాధించిపెట్టదు. జనం ఎదుర్కొంటున్న సమస్యలపై తమ వైఖరేమిటో, వాటికి తమ పరిష్కారాలేమిటో అవి చెప్పగలగాలి. ఆ రెండు పార్టీలూ తనను ఎందుకు దూరం పెట్టాయో కాంగ్రెస్‌ సైతం ఆత్మ విమర్శ చేసుకోవాలి. తనకు బలమున్న చోట ఎవరినీ లెక్క చేయకపోతే తనకూ వేరేచోట అదే పరిస్థితి ఏర్పడుతుందని యూపీ అనుభవంతో కాంగ్రెస్‌ గ్రహించాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement