ఆరు స్థానాల్లో సొంత అభ్యర్థులు
మహారాష్ట్రలో 12 స్థానాలు కోరుతూ 5చోట్ల అభ్యర్థుల ప్రకటన
మధ్యప్రదేశ్‌లో బుద్నీలో కాంగ్రెస్‌కు పోటీగా ఎస్పీ అభ్యర్థి
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీరు కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 37 పార్లమెంట్ స్థానాలు కొల్లగొట్టామన్న అతివిశ్వాసంతో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని కాలదన్నుతోంది.
ఎస్పీ ఒంటెద్దు పోకడలు కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. యూపీలో తమతో మాటైన చెప్పకుండా ఎస్పీ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌కు సమస్యగా మారింది. తాము పోటీలో ఉన్న మధ్యప్రదేశ్‌లో మరో అభ్యర్థిని బరిలో దించి పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చింది. మహారాష్ట్రతో మహా వికాస్ అఘాడీ కూటమిలో పొరపొచ్చాలు పెరిగేలా 12 సీట్లు కోరుతూ కాంగ్రెస్‌కు ఎస్పీ ఇక్కట్లు తెస్తోంది.
యూపీలో ఏకపక్షంగా..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న 9 స్థానాల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని ఎస్పీ, కాంగ్రెస్‌లు ప్రాథమిక నిర్ణయానికొచ్చాయి. అయితే ఇంతవరకు పోటీ చేసే స్థానాలపై స్పష్టత రాలేదు. హరియాణా ఎన్నికల్లో అతి విశ్వాసం కారణంగా ఓటమిపాలైన కాంగ్రెస్‌తో పెట్టుకుంటే లాభం లేదని ఎస్పీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఏకపక్షంగా 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల్లో తమ ఓటుబ్యాంకు పటిష్టంగా ఉందని బల్లగుద్ది చెబుతోంది.
కాంగ్రెస్‌తో కనీస అవగాహనకు రాకుండానే సొంత అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం సైతం మొదలుపెట్టింది. ప్రకటించని మూడు స్థానాల్లో ఘజియాబాద్ సదర్, ఖైర్, కుందర్కి అసెంబ్లీ స్థానాలుండగా ఇందులో ఘాజియాబాద్ సదర్, ఖైర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని కోరుతోంది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ ప్రాభల్యం బలంగా ఉంది.
ఘజియాబాద్ సదర్‌లో దాదాపు 80వేల మంది దళితులు, 60వేల మంది బ్రాహ్మణులు, 40వేల మంది బనియాలు, 35వేల మంది ముస్లిం, 20వేల మంది ఠాకూర్లు ఉన్నారు. ఇక్కడ బీఎస్పీ పోటీలో ఉండటంతో దళితుల ఓట్లు తనకు అనుకూలంగా మారతాయన్న నమ్మకం కాంగ్రెస్‌కు లేదు. ఠాకూర్‌లతో పాటు సంఖ్యాపరంగా ప్రాభల్యం ఉన్న బ్రాహ్మణ, బనియా వర్గాలు బీజేపీతో ఉండటంతో ఇక్కడ గెలుపు సులభం కాదని కాంగ్రెస్ అంచనావేస్తోంది. ఇక ఖైర్‌లో లక్ష ఓటర్లు ఉన్నారు.
ఇక్కడి జాట్‌లు పూర్తిగా ఎన్‌డీఏ కూటమికి మద్దతు పలకడం, 55,000 దళిత ఓట్లలో బీఎస్పీ చీలిక తెస్తుందన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. దీంతో ఎస్పీ ఇస్తామన్న రెండు సీట్లపై కాంగ్రెస్ అయిష్టత చూపుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో అసలు పొత్తులు ఉంటాయా? లేదంటే విడివిడిగా బరిలోకి దిగుతారా? అనే ప్రశ్న ఇరుపార్టీల శ్రేణుల్లో తలెత్తుతోంది. మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ రాజీనామా చేసిన బుద్నీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ను వీడి ఎస్పీలో చేరిన అర్జున్ ఆర్యను ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ బుద్నీలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అంశం సైతం కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు.
మహారాష్ట్రలో అదే తీరు
మహారాష్ట్రలో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్‌పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పార్టీల మధ్య పొత్తు విషయంలో చర్చలపై ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. ఈలోపే మధ్యలో దూరిన ఎస్పీ తమకు 12 సీట్లు కావాలని డిమాండ్‌చేస్తూ కొత్త పేచీలు మొదలెట్టింది. ఇప్పటికే రెండు స్థానాల్లో ఎస్పీ ఎమ్మెల్యేలు ఉండగా, ఆ అసెంబ్లీ స్థానాలకు చుట్టూ ఉన్న మరో 10 స్థానాలను తమకే కేటాయించాలని కోరుతోంది. ఇందులో మెజార్టీ స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలపాలని ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాయి. ఎస్పీ అంతటితో ఆగకుండా బుధవారం ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. దీంతో ఎస్పీతో ఎలా డీల్ చేయాలో కాంగ్రెస్‌కు అంతుపట్టని వ్యవహారంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment