తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వేర్వేరు రాష్ట్రాలుగా మనుగడ ప్రారంభించిన నాలుగున్నరేళ్ల తర్వాత ఏపీకి విడిగా హైకోర్టు ఏర్పడింది. అది నేటినుంచి పనిచేయడం ప్రారంభించ బోతోంది. న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువ కావాలని ఆశించేవారంతా దీన్ని హృద యపూర్వకంగా స్వాగతిస్తారు. ఇంత సువిశాల దేశంలో నిజానికి ఇప్పుడున్న న్యాయ స్థానాలు సరిపోవు. వాటి సంఖ్య పెంచాలని కోరడంతోపాటు సుప్రీంకోర్టు బెంచ్‌లు వేర్వేరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని, కొన్ని హైకోర్టులకు ఆయా రాష్ట్రాల పరిధిలో వేరే చోట్ల బెంచ్‌లు ఏర్పాటు చేయాలని అనేకులు కోరుతున్నారు. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో సుప్రీంకోర్టు బెం చ్‌లు ఏర్పాటు చేస్తే దేశ పౌరులకు వ్యయప్రయాసలు తగ్గుతాయని, సత్వర న్యాయానికి వీలవుతుందని చాన్నాళ్లక్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వేర్వేరు లా కమిషన్‌లు, పార్లమెంటరీ స్థాయీ సంఘాలు సైతం భిన్న సందర్భాల్లో కేంద్రానికి సిఫార్సు చేశాయి. కానీ స్పందించాల్సిన కేంద్ర పాలకులు మాత్రం ఎప్పుడూ వాటి గురించి తమ వైఖరి వెల్లడించలేదు. కానీ మూడేళ్లక్రితం సుప్రీంకోర్టులో దాఖలైన ఒక వ్యాజ్యంపై విచారణ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త బెంచ్‌ల ఏర్పాటు కుదరదని తేల్చిచెప్పింది.
వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం హైకోర్టు బెంచ్ కావాలంటూ న్యాయవాదులు ఆందోళన చేశారు. 1994 నుంచి అడపా దడపా సాగుతున్న ఈ ఆందోళనలకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతునిస్తూ వచ్చాయి. ఇప్పుడూ ఎటూ కొత్త రాష్ట్రం ఏర్పడింది కనుక రాజ్యాంగంలోని 214వ అధికరణానికి అనుగుణంగా హైకోర్టు కల సాకారమైంది. దీన్ని అమరావతిలో కాక కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు, విశాఖలో ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్రవాసులు గత కొన్నేళ్లుగా డిమాండు చేస్తూ వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకున్నట్టు చివరకు అమరావతిలోనే హైకోర్టు వచ్చింది. కొత్త హైకోర్టు ఏర్పాటుపై మొన్న బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ ప్రక్రియంతా ఎవరిలోనూ అసంతృప్తి లేకుండా పూర్తయి ఉంటే ఈ శుభసందర్భానికి అతికినట్టు ఉండేది. ఎందుకంటే హైకోర్టును ఎప్పుడు విభజిస్తారంటూ తెలంగాణ న్యాయవాదులు అడిగినట్టే, తమకు కొత్త హైకోర్టు ఎప్పుడు ఏర్పాటవుతుందంటూ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు డిమాండు చేస్తూ వచ్చారు. కానీ నోటిఫికేషన్ విడుదలయ్యాక కొన్ని అసంతృప్తి స్వరాలు వినబడ్డాయి. అవి సహేతుకమైనవేనని చెప్పకతప్పదు. అక్కడ అవసరమైన భవనాలు ఇంకా సిద్ధం కాకుండా ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలని కోరడం ఎంత వరకూ న్యాయమన్నది అందులో ప్రధానమైనది. న్యాయమూర్తులు, న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులు తరలి వెళ్లడమంటే మాటలు కాదు. వారందరూ తలదా చుకోవ డానికి గూడు దొరకాలి. వారందరూ పనిచేయడానికి కావలసిన సమస్త సౌకర్యాలతో భవనం ఉండాలి. వీటన్నిటా బాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.
కొత్త హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా, దాని ప్రమేయం లేకుండా అది ఏర్పడే ప్రశ్నే ఉత్పన్నం కాదు. హైకోర్టు విభజన విషయంలో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేసి నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడమే తరవాయి అని కేంద్రం ఒకటి రెండుసార్లు వివరణనిచ్చింది. తాత్కాలిక హైకోర్టు భవనం 2018 డిసెంబర్ 15కల్లా సిద్ధమవుతుందని ప్రమాణపూర్వకంగా సుప్రీంకోర్టు ముందు బాబు సర్కారు రెండు నెలల క్రితమే అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆ అడ్డంకి కూడా తొలగింది. భవంతుల నిర్మాణానికి రూ. 500 కోట్లు కేంద్రం విడుదల చేసింది. అనంతరం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు స్వయంగా వచ్చి నిర్మాణం పనుల్ని పరిశీలించారు. వారి వెంట మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌లు వెళ్లారు. గడువు తేదీలోగా అన్నీ పూర్తవుతాయని హామీ ఇచ్చారు.
అనంతరం చంద్రబాబు సైతం ఆ మాటే చెప్పారు. తీరా చూస్తే భవంతులు పూర్తికాకపోవడమే కాదు...కనీసం వాటిని చేరేందుకు సరైన రహదారే లేదు. చినుకు పడిందంటే ఆ ప్రాంతం మోకాల్లోతు బురదతో నిండి నడిచి వెళ్లడానికే అసాధ్యంగా మారుతుంది. ఇక వాహనాలు వెళ్లడం గురించి ఆలోచించనవసరమే లేదు. హైకోర్టుకు అవసరమైన భవనం సమకూర్చాలని నాలుగున్నరేళ్లక్రితమే తెలిసినప్పుడు, కేంద్రం అందుకు అవసరమైన నిధులు అందజేసినప్పుడు చంద్రబాబుకు ఉన్న అడ్డంకులేమిటి? మొన్న మార్చి వరకూ నిర్మాణపనులు మొదలుకాకపోవడానికి, ఆ తర్వాతైనా అవి నత్తనడకన సాగటానికి కారణమేమిటి? రెణ్ణెల్లక్రితం సుప్రీంకోర్టు ముందు తప్పుడు అఫి డవిట్ ఎందుకు దాఖలు చేశారు?
కనీసం డిసెంబర్ మొదట్లోనైనా వాస్తవాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి ఎందు కు తీసుకెళ్లలేకపోయారు? ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు వచ్చినప్పుడైనా నిజం ఎందుకు చెప్పలేకపోయారు? పైగా నోటిఫికేషన్ విడుదలైనరోజున దాన్ని కీర్తిస్తూ, అది తమ ఘనతేనంటూ చెప్పినవారు 24 గంటలు తిరగకుండా స్వరం ఎందుకు మార్చారు? వీటన్నిటికీ సంజాయిషీ చెప్పవలసిన బాబు...యధాప్రకారం తనకలవాటైన రీతిలో ఎదుటివారిపై బురదజల్లి తప్పించు కోవాలను కుంటున్నారు. నదురూ బెదురూ లేకుండా సుప్రీంకోర్టు మొదలుకొని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరకూ అందరిపైనా నిందలేస్తూ తన నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఒక చారిత్రక సందర్భాన్ని తన వక్రీకరణలతో, వంచనతో మలినం చేసినందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు... సర్వోన్నత న్యాయస్థానంతో సహా అందరికీ క్షమాపణ చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment