జనాగ్రహం పోటెత్తితే ఎంతటి నియంతైనా తలవంచాల్సిందేనని హాంకాంగ్ ఉద్యమకారులు నిరూపించారు. తమ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కొంచెం కొంచెంగా కబళించి, చివరకు పూర్తిగా నగరాన్ని చెప్పుచేతల్లోకి తీసుకోవచ్చుననుకున్న చైనాకు శృంగభంగం చేశారు. నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మూడు నెలలుగా ఉవ్వెత్తున సాగుతున్న నిరసనోద్యమానికి చైనా తలొంచక తప్పిందికాదు. సవరణ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు ఆ నగర చీఫ్ ఎగ్జి క్యూటివ్ కారీ లామ్ బుధవారం ప్రకటించారు. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది. తమ ఉద్యమ పరిధి విస్తరించిందని, కేవలం బిల్లు ఉపసంహరణ మాత్రమే సరిపోదని ఆందోళనకారులు ఇప్పుడు చెబుతున్నారు. ఇది అక్షరాలా ప్రజోద్యమం. ఎందుకంటే దీనికి నాయకులంటూ ఎవరూ లేరు.
అయిదు నెలలక్రి తం ఈ చిన్నగా మొదలైన ఆందోళన చూస్తుండగానే విస్తరించింది. వేలాది మందితో జరిగే నిరసనలు కాస్తా లక్షల్లోకి ఎగబాకాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే నగర విమానాశ్ర యానికి పది లక్షలమంది వచ్చిపడటంతో చైనా పాలకులకు, వారి తరఫున రాజ్యమేలుతున్న కారీ లామ్‌కు ఎటూ పాలుపోలేదు. ఆధునిక టెక్నాలజీ సాయంతో ఆందోళనకారుల కూపీ లాగి ఎక్కడి కక్కడ అరెస్టులు చేస్తే అంతా సద్దుమణుగుతుందని వారు భావించారు. సెల్‌ఫోన్ల ఆధారంగా ఆందోళనకారులు ఎక్కడినుంచి వస్తున్నారో, ఎటుపోతున్నారో సులభంగా తెలుసుకోవచ్చునను కున్న ప్రభుత్వ వ్యూహాన్ని అదే టెక్నాలజీ సాయంతో యువతరం తుత్తినియలు చేశారు. నిఘా కెమెరాలు తమను గుర్తుపట్టకుండా మాస్క్‌లు ధరించారు.
రోజులు గడిచేకొద్దీ ఆందోళన ఉధృత మైందే తప్ప ఎక్కడా తగ్గలేదు. బిల్లు ఇక మురిగిపోయినట్టేనని, దాన్ని గురించి ఎవరికీ ఆందోళన అవసరం లేదని కారీ లామ్ కొన్ని వారాల క్రితం చేసిన ప్రకటన ఎవరినీ సంతృప్తిపరచలేదు. చివ రకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే వగైరాలు వినియోగించారు. 1,100మందిని అరెస్టు చేశారు. ఉద్యమకారుల వేషంలో వెళ్లి నిరసనల్ని విచ్ఛి న్నం చేసే ప్రయత్నం చేశారు. ఏం చేసినా ఉద్యమం ఆగకపోవడంతో చైనాకు దిక్కుతోచలేదు. ఇక చేసేది లేక సవరణ బిల్లును ఉపసంహరించుకుంటున్నామని తాజాగా ప్రకటించాల్సివచ్చింది.
ఎన్నడో 1840లో ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకున్న బ్రిటిష్ వలస పాలకులు ఆ తర్వాత 1898లో చైనాతో 99 ఏళ్ల లీజుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మధ్యలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్వల్పకాలం అది జపాన్ ఏలుబడిలోకి కూడా వెళ్లింది. లీజు పూర్తయ్యాక 1997 జూలై 1న హాంకాంగ్‌ను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు 50 ఏళ్లపాటు... అంటే 2047 వరకూ ఆ నగరానికి స్వయంప్రతిపత్తిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని ఆనాటి చైనా ఉపప్రధాని డెంగ్ జియావోపింగ్ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.
‘ఒకే దేశం–రెండు వ్యవస్థల’ విధానాన్ని పాటిస్తా మని, ఆ నగరంపై తమ పెత్తనం రుద్దబోమని ఆయన చెప్పారు. ఈ విధానం కింద హాంకాంగ్ తన ఆర్థిక, వాణిజ్య విధానాలను తానే నిర్ణయించుకోవచ్చు. పాలనా నిర్వహణ, శాసనాధికారం, న్యాయవ్యవస్థ కూడా హాంకాంగ్‌వే కొనసాగాలి. కానీ ఆచరణలో ఇదంతా నీరుగారింది. పాలన హాంకాంగ్‌దే అయినా, తాను నిర్ణయించిన వ్యక్తే దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యేవిధంగా చైనా పావులు కదిపింది. తెరవెనక ఉంటూ తన నిర్ణయాలు అమలు చేయడంతోపాటు హాంకాంగ్‌కి ఉన్న అధికారాలను కత్తిరించడం ప్రారంభించింది. 2017లో కారీ లామ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది.
పాలనా వ్యవస్థలోని చైనా వ్యతిరేకుల్ని అనర్హులుగా ప్రకటించడం, ఉద్యమాల్లో పాల్గొనేవారికి పోటీ చేసే హక్కును నిరాకరించడం, చైనా వ్యతిరేకు లుగా ముద్రపడినవారిని చైనాకు అపహరించుకుని తీసుకెళ్లడం వగైరాలన్నీ సాగాయి. వీటన్నిటికీ పరాకాష్టగా నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లు రంగ ప్రవేశం చేసింది. అది చట్టమైతే ఎవ రినైనా, ఏ సాకుతోనైనా చైనాకు అప్పగించవచ్చు. ఏమాత్రం విశ్వసనీయతలేని న్యాయవ్యవస్థ రాజ్యమేలుతున్న చైనాలో నేరం రుజువైందన్న పేరిట ఎంత కఠిన శిక్షలైనా విధించే ప్రమాదం ఉంది. పైగా అది వెనకటి కాలంనుంచి వర్తిస్తుందన్న నిబంధన ఉండటంతో హాంకాంగ్ ప్రజల సహనం నశించింది.
దాని పర్యవసానమే ప్రస్తుత ఉద్యమం. మార్చిలో తొలుత ఇది కేవలం చిన్న పాటి నిరసనలకే పరిమితమైంది. అది చూస్తుండగానే జూన్ నాటికి పూర్తిస్థాయి మహోద్యమంగా మారింది. ఒక దశలో చైనా సైన్యం రంగంలోకి దిగుతుందన్న కథనాలు వినబడ్డాయి. బిల్లు ఉపసం హరణకు అనుమతించమంటూ తాను కోరినా చైనా పాలకులు అందుకు అంగీకరించడంలేదని, ఇక రాజీనామా చేయడం తప్ప గత్యంతరం లేదని కారీ లామ్ వ్యాపారవేత్తల సమావేశంలో మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వెల్లడై చైనా పరువుతీశాయి.
ఆ ఉద్యమాన్ని అణిచేస్తే తన ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో పడకతప్పదని చైనా ఆలస్యంగా నైనా గ్రహించకతప్పలేదు. గతంతో పోలిస్తే హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ నీరసించినా 2016 గణాంకాల ప్రకారం చైనాలోని 13,370 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 61 శాతం ఆ నగరంద్వారా వచ్చినవే. వేరే దేశాల్లో చైనా పెట్టే పెట్టుబడుల్లో 60 శాతం హాంకాంగ్‌లోనే ఉన్నాయి. ఉద్యమంపై ఉక్కుపాదం మోపితే ఇదంతా పేకమేడలా కూలుతుంది కనుకే ఆ దేశం వెనక్కి తగ్గింది. ఇలాంటి ఉద్యమమే తన గడ్డపైన తియనాన్మెన్ స్క్వేర్‌లో అంకురించినప్పుడు చైనా దాన్ని ఉక్కుపాదంతో అణిచేసింది. కానీ అలాంటి ఎత్తుగడలు హాంకాంగ్‌లో చెల్లుబాటు కాలేదు. అసమ్మతిని, భిన్నాభి ప్రాయాలను గౌరవించలేని పాలకులకు హాంకాంగ్ ఉద్యమం కనువిప్పు కావాలి. ప్రజలకిచ్చిన హామీలను గౌరవించనప్పుడూ, వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకోనప్పుడూ ప్రతిఘటన తప్పదని గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment