నీచమైన కుట్ర | Editorial On Murder Attempt On YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 26 2018 12:58 AM | Last Updated on Fri, Oct 26 2018 12:58 AM

Editorial On Murder Attempt On YS Jagan Mohan Reddy - Sakshi

దాదాపు ఏడాది కాలంగా జనంలో ఉంటూ, పాదయాత్ర చేస్తూ వారి ఆవేదనలను వింటూ, భరోసా కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో గురువారం జరిగిన హత్యాయత్నం అశేష ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అదృష్టవశాత్తూ ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడగలిగారు. ఈ పాదయాత్రలో ఆయన అడుగులో అడుగేస్తూ వేలాదిమంది కదులు తుంటే... నియోజకవర్గాల్లో ఆయన నిర్వహిస్తున్న సభలకు ఇసుకేస్తే రాలని స్థాయిలో ప్రజలు హాజ రవుతుంటే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కంట గింపుకావడం ప్రతిరోజూ ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. ఆయన ప్రసంగించే సభ ఉన్నచోట విద్యుత్‌ సరఫరా అర్ధాంతరంగా నిలిపేయడం, ఆ సభల ప్రత్యక్ష ప్రసారం ఎవరూ వీక్షించకుండా కేబుల్‌ ప్రసారాలకు అవాంతరాలు కల్పించడం, మనుషుల్లేని అంబులెన్స్‌ల్ని వేరే మార్గాలున్నా ఆ సభలు జరిగేవైపే పంపడం వంటి చిల్లరపనులకు పాల్పడటం ఏపీలో రివాజుగా మారింది. కానీ ఆ కంటగింపు ఇంత నీచమైన కుట్రలకు పాల్పడే దుస్థితికి దిగజారుతుందని ఎవరూ ఊహించలేదు. 

దుండగుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న కాసేపటికే డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు అతగాడి గుట్టుమట్లు సర్వం తెలిసిపోయాయి! అతని కులమేదో, ప్రాంతమేదో, ఎవరి అభిమానో ఆయన ఏకరువు పెట్టారు. ఎందుకు చేసి ఉంటాడో కూడా ఆయన పోలీసు బుర్రకు తట్టింది. అతనికి ‘వేరే ఉద్దేశాలు’ ఏమీ లేవని సైతం ఆయనగారు తేల్చేశారు. కానీ అతగాడు పనిచేస్తున్న కేఫ్‌టేరియా ఎవరిదో, అతని దగ్గరకు ఈ దుండగుడు ఎలా వచ్చాడో, హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఏమాత్రం ప్రవేశం లేనివాడికి అక్కడ ఉద్యోగమెలా వచ్చిందో మాత్రం తెలియనట్టుంది!! ఒక ఘటన జరిగినప్పుడు అందులో దర్యాప్తు మొదలుకాకుండానే అతనొక్కడే ఈ పనికి పాల్పడ్డాడని, మరెవరి ప్రమేయమూ లేదని ఎలా నిర్ణయిస్తారు? ఆర్పీ ఠాకూర్‌ ఒక సాధారణ కానిస్టేబుల్‌ అయి ఉంటే ఆయన ఒట్టి అమాయకత్వంతో తెలిసీ తెలియక మాట్లాడి ఉంటాడని కొట్టిపారేయొచ్చు.

ఆయన తెలుగుదేశం సాధారణ కార్యకర్త అయితే ఆత్మరక్షణ కోసం అవాకులు, చవాకులు మాట్లా డుతున్నాడని ఉపేక్షించవచ్చు. కానీ ఠాకూర్‌ రాష్ట్ర పోలీసు విభాగానికి నాయకత్వంవహిస్తున్న ఒక ఉన్నతస్థాయి అధికారి. రాష్ట్ర ప్రజలందరి భద్రతకూ, క్షేమానికీ పూచీ పడాల్సిన అధికారి. అటు వంటి అత్యున్నతాధికారి నుంచి ఇంతకంటే మెరుగైన వ్యవహారశైలిని ప్రజలు ఆశించడం సహజం. కానీ ఠాకూర్‌ మాట్లాడిన మాటలు గమనిస్తే చంద్రబాబును రాజకీయంగా కాపాడటమే తన ఏకైక కర్తవ్యమని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. దీని పూర్వాపరాలను అన్ని కోణాల్లోనూ సమ గ్రంగా దర్యాప్తు చేయించి నిగ్గుతేల్చవలసింది పోయి... తమవైపుగా జరిగిన వైఫల్యాలేమిటో ఆరా తీయాల్సింది పోయి జరిగినది అతి సాధారణమైన విషయమన్నట్టు మాట్లాడారు. పైగా వీఐపీ లాంజ్‌లో తమకు ప్రవేశం ఉండదని, అక్కడి భద్రత తమకు సంబంధంలేని విషయమని చెబు తున్నారు. ఇదే విమానాశ్రయంలో రెండేళ్లక్రితం రన్‌వేపైకొచ్చి పోలీసులు జగన్‌పట్ల దురుసుగా ప్రవర్తించిన సందర్భాన్ని ఠాకూర్‌ మరిచిపోతున్నారు. ‘అతని కంటె ఘనుడు...’ అన్నట్టు డీజీపీకి ఏమాత్రం తీసిపోని అజ్ఞానాన్ని చంద్రబాబు ప్రదర్శించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో సెటిల్మెంట్ల రాజ్యం నడుస్తున్నదని, అది మాఫియా పాలనను తలపిస్తున్నదని ఎప్పటినుంచో విమర్శలున్నాయి. అక్కడి ఇంటెలిజెన్స్‌ విభాగం పక్కనున్న తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరిని కొనుగోలు చేయొచ్చునో ముఖ్యమంత్రికి ఉప్పందిస్తుంది. వచ్చే ఎన్నికల్లో అక్కడ ఏ ఏ స్థానాల్లో తెలుగుదేశం గెలుస్తుందో సర్వే కూడా జరిపి ఆయన చెవిన వేస్తుంది. కానీ ప్రతిపక్ష నాయకుడి భద్రతకు ముప్పు పొంచి ఉందని మాత్రం ఆ విభాగానికి తెలియదు. మరో పక్క తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పుకునే ఒక మాజీ సినీ నటుడికి మాత్రం రాష్ట్రంలో ఈ హత్యాయత్నం జరుగుతుందని చాలా ముందుగానే తెలిసిపోతుంది. పైగా దాడి జరిగాక ఆ మాజీ నటుడు మీడియా ముందుకొచ్చి ‘ఈ సంగతి ముందే చెప్పాను కదా!’ అంటున్నాడు.

ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉండగా, మంత్రులంతా కట్టగట్టుకుని అతనేదో అతీంద్రియ శక్తులున్న అసాధారణ వ్యక్తిగా ఆ ‘గరుడ పురాణాన్ని’ వల్లె వేయడం విస్మయం కలిగిస్తుంది. దుండగుడు జగన్‌ అభిమానంటూ  డీజీపీ అలా ప్రకటించారో లేదో... అతను చాన్నాళ్లక్రితం తయారుచేయించిన ఫ్లెక్సీగా పచ్చమీడియా ఒక బొమ్మను ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఇటీవలికాలంలో మాజీ నటుడు వినిపిస్తున్న ‘ఆపరేషన్‌ గరుడ’ నిన్నమొన్నటిది కాగా... ఎన్నడో జనవరిలో నూతన సంవత్సర ఆగమనం సందర్భంగా దుండగుడు పెట్టాడంటున్న ఫ్లెక్సీలో గరుడ పక్షి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా అది ఒక ఫ్లెక్సీని ఫొటో తీసినట్టు కాకుండా, ఫొటోషాప్‌లో చేసిన డిజైన్‌గా స్పష్టమవుతోంది. దీన్ని ముఖ్య మంత్రి కనుసన్నల్లో పనిచేసే సోషల్‌ మీడియా విభాగం రూపొందించిందని  మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ ఒక పెద్ద కుట్రకు ముందే అమర్చి పెట్టుకున్న ‘ఎలిబీ’లని మామూలు కంటికి కూడా తెలిసిపోతున్నాయి.

ఘటన జరిగిన క్షణం నుంచి చంద్రబాబు, ఆయన మంత్రులు, ఉన్నతాధికారులు మాట్లాడు తున్న మాటలు ఈ విషయంలో ఉన్న అనుమానాలను మరింతగా పెంచుతున్నాయి. దుండగుడు రాశాడంటున్న లేఖ కూడా మరిన్ని సంశయాలను రేకెత్తిస్తోంది. అధికారంలోకి రావడం కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచి ఆయన మనోవ్యాధితో మరణించడానికి కారకుడైన వ్యక్తి... దాన్ని నిలుపుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడన్నది సుస్పష్టం. కనుక హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వ ర్యంలో దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపించి, దోషులెవరో నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement