సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉదయం 10 గంటలకు: విజయనగరం జిల్లా చప్పబచ్చమ్మపేటలో ప్రజా సంకల్పయాత్ర ముగించుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కారులో విశాఖ బయల్దేరారు.
12.15 విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
12.20 వీఐపీ లాంజ్‌లోకి వెళ్లారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న జిల్లా పార్టీ నేతలను పలకరించిన అనంతరం జగన్ వాష్‌రూమ్‌కు వెళ్లారు.
12.28 వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చి పార్టీ నేతలతో మాట్లాడుతూ సోఫాలో కూర్చున్నారు.
12.32 ఫ్యూజన్ ఫుడ్స్‌కు చెందిన ముగ్గురు వెయిటర్లు లాంజ్‌లోకి ప్రవేశించారు. అందరికీ మంచినీళ్లు,
టీ, కాఫీ ఇవ్వడం ప్రారంభించారు.
12.35 వెయిటర్ శ్రీనివాసరావు.. కాఫీ తాగుతున్న జగన్‌ను పలకరించాడు. ‘సార్, ఈసారి మీరు 160 సీట్లు గెలుస్తారు..’ అంటూ మాట కలిపాడు.
12.37 ‘సార్.. మీతో సెల్ఫీ కావాలి’ అని జగన్‌ను శ్రీనివాసరావు అడిగాడు. ఇందుకు జగన్ స్పందిస్తూ.. ‘తప్పకుండా.. దగ్గరికి రా అంటూ’ అతన్ని పిలిచారు. ఇంతలో శ్రీకాళహస్తికి చెందిన పార్టీ నేత మధుసూదన్‌రెడ్డి వీఐపీ లాంజ్‌లోకి వచ్చారు.
12.38 ‘అన్నా.. నమస్తే’ అంటూ మధుసూదన్‌రెడ్డి పలకరిస్తుండగానే.. శ్రీనివాసరావు ఒక చేత్తో.. బేసిక్ ఫోన్ కోడి పందేల కత్తి తీసుకొని ఒక్క ఉదుటున జగన్ మెడపై దాడి చేసేందుకు యత్నించాడు. జగన్.. మధుసూదన్‌రెడ్డి వైపు తిరగడంతో ఆ కత్తి పోటు జన నేత భుజంలో దిగబడింది.
12.39 ‘అమ్మా..’ అంటూ జగన్ తన భుజంపై అయిన గాయాన్ని పట్టుకున్నారు. పక్కనే ఉన్న విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, జగన్ వ్యక్తిగత సహాయకుడు కలసి శ్రీనివాస్‌ను పక్కకు తోసేందుకు ప్రయత్నించారు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మరోసారి దాడి చేసేందుకు కత్తిని బయటకు తీసిన శ్రీనివాస్‌ను.. వారు గట్టిగా వెనక్కి తోసేశారు. దీంతో దుండగుడు కిందపడిపోయాడు.
12.41 జగన్‌కు గాయమైందని తెలుసుకున్న పార్టీ నేతలు, భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. దుండగుడిని పట్టుకొని దేహశుద్ధి చేసేందుకు యత్నించారు. ఎవరు పంపారంటూ ప్రశ్నించారు. పార్టీనేతలు దుండగుడిని పోలీసులకు అప్పగించారు.
12.44 జగన్ సోఫాలో కూలబడిపోయారు. విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్టు వైద్య సిబ్బంది హుటాహుటిన వీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌కు ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. టీటీ ఇంజక్షన్ వేశారు.
12.49 ప్రాథమిక చికిత్స జరుగుతున్నప్పుడే జగన్ చేతి నుంచి రక్తం ధారగా కారుతోంది. దీంతో ఆందోళన చెందిన పార్టీ నేతలంతా ‘ఆస్పత్రికి వెళ్దాం రండన్నా..’ అంటూ జగన్‌ను కోరారు. అయితే తాను హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం బయల్దేరే సమయం దగ్గర పడుతోందని, తన వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడకూడదంటూ జగన్ వారికి సర్దిచెప్పారు.
12.55 సోఫాలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం జగన్ వీఐపీ లాంజ్ నుంచి విమానం వైపు కదిలారు. ఎవరూ అధైర్యపడొద్దంటూ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు.
1.10 జగన్ ఎక్కిన విమానం హైదరాబాద్ బయలుదేరింది.
2.15 జగన్‌మోహన్‌రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. అక్కడ లాంజ్‌లో వైద్యులు గాయాన్ని పరిశీలించి డ్రస్సింగ్ చేశారు. అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లారు (సుమారు 40 నిమిషాల ప్రయాణం).
3.10 ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి కుట్లు వేశారు. అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment