ఇరాన్‌పై ఉగ్ర పంజా
ఖతర్‌తో సౌదీ అరేబియా, మరికొన్ని దేశాలూ దౌత్య సంబంధాలను తెంచుకోవడం పర్యవసానంగా పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం ఇంకా కొలిక్కి రాకముందే ఇరాన్ పార్లమెంటుపైనా, ఆయతుల్లా ఖొమేనీ స్మారక భవనంపైనా సాయుధ దాడి చేయడం ద్వారా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరో సంక్షోభానికి బీజం నాటారు. బుధవారం జరిగిన ఈ రెండు దాడుల్లో 17మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ముందస్తు సమాచారం అందడం వల్ల మరో దాడిని నిరోధించగలిగామని, ఆ ముఠా సభ్యుల్ని అరెస్టు చేశామని ఇరాన్ చెబుతోంది. ఇరాన్‌లో ఈ తరహా దాడులు కొత్తేమీ కాదు. కానీ పటిష్టమైన భద్రత ఉండే రాజ ధానిపైనా, అందునా ఆ దేశం ప్రాణప్రదంగా భావించే చిహ్నాలపైనా దాడి చేయడం ద్వారా తాము ఎంతకైనా తెగించగలమని ఉగ్రవాదులు తెలియజెప్పారు.
సున్నీ ముస్లింలు అత్యధికంగా ఉన్న సౌదీ తదితర గల్ఫ్ దేశాలకూ, షియాలు ఎక్కువగా ఉన్న ఇరాన్‌కూ మధ్య ఎప్పుడూ వైరమే. దాన్ని ఈ ఉగ్రదాడి మరింత తీవ్రం చేసే ప్రమాదం కనబడుతోంది. ఈ దాడి వెనక సౌదీ హస్తం ఉండొచ్చని ఇరాన్ నేరుగా అనకపోయినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్‌కు కటువుగా ఇచ్చిన జవా బులో అలాంటి అర్ధమే ధ్వనించేలా ఇరాన్ వ్యాఖ్యానించడం దీన్నే సూచిస్తోంది. ప్రభుత్వ స్పందన ఇలా ‘మర్యాద’గానే ఉన్నా దేశ ఆంతరంగిక భద్రతా వ్యవస్థను పర్యవేక్షించే అతివాద ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ) మాత్రం నేరుగా సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలూ ఈ దాడులకు సూత్రధారులంటూ విరుచుకుపడింది. ఇరాక్‌లోని షియా తెగ ప్రార్ధనా మందిరాల్లో తరచు మానవ బాంబుల ద్వారా విధ్వంసం సృష్టించి హతమార్చడం, ఆ మందిరాలను సందర్శించే ఇరాన్ యాత్రీకులను బాంబు దాడుల్లో హతమార్చడంలాంటివి చేస్తున్న ఐఎస్‌పై అటు ఇరాక్‌లోనూ, ఇటు సిరియాలోనూ ఇరాన్ పోరాడుతోంది.
1979నాటి విప్లవా నికి నాయకత్వంవహించి ఇరాన్ షా ను పదవీభ్రష్టుణ్ణి చేసిన ఖొమేనీ స్మృతి ఆ దేశా నికి ప్రాణప్రదం. ఇక పార్లమెంటు అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థకు చిహ్నం. ఈ రెండింటినీ దాడికి ఎంచుకోవడం ద్వారా ఇరాన్ నైతిక సై్థర్యాన్ని దెబ్బతీయడమే ఐఎస్ ఉగ్రవాదుల లక్ష్యం. ఖొమేనీ స్మృతి మందిరాన్ని నిత్యం వేలాదిమంది ఇరాన్ పౌరులు సందర్శిస్తారు గనుక అక్కడ భద్రత తక్కువే. కానీ ఇరాన్ పార్లమెంటు కట్టుదిట్టమైన సైనిక పహారాలో ఉంటుంది.
ఇరాన్ షియాల ప్రాబల్యం ఉన్న దేశమే అయినా అక్కడ ఐఎస్‌కు పలుకుబడి లేకపోలేదు. ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలోని సిస్తాన్–బలూచిస్తాన్ రాష్ట్రంలో సున్నీ జనాభా అధికం. అయిదారేళ్లక్రితం సున్నీ తెగకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే ఉగ్రవాద సంస్థ ఒక మసీదుపై దాడి చేసి 39మందిని హతమార్చింది. ఇప్పుడు దాడికి తెగబడ్డవారు ఈ ప్రాంతానికి చెందినవారేనని ఇరాన్ చెబుతోంది. ఇరాక్, సిరియాల్లో తమపై కలిసికట్టుగా దాడిచేసి నష్టపరుస్తున్న శత్రువులను విడి విడిగా వారి ప్రాబల్య ప్రాంతాల్లో నష్టపరచాలన్నది ఐఎస్ వ్యూహంలా కనబడు తోంది. మాంచెస్టర్, కాబూల్, లండన్ తదితర ప్రాంతాల్లో జరిగిన దాడులన్నీ ఈ వ్యూహాన్నే సూచిస్తున్నాయి. నిజానికి ఈ తరుణంలో ఐఎస్‌పై పోరాడే శక్తులన్నీ మరింత ఐక్యంగా ఉండాలి. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధమైన పోకడలు పోతున్నారు.
ఇరాన్‌లో జరిగిన దాడుల తర్వాత ఆయన ఇచ్చిన ట్వీట్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం చివరకు దానికే బలవుతుందని వ్యాఖ్యానించారు. నిజానికి ఇరాన్‌కు అలాంటి చరిత్ర లేదు. అందుకు విరుద్ధంగా అల్–కాయిదా, ఐఎస్ సంస్థలకు డబ్బు, ఆయుధాలు చేరేసిన చరిత్ర అమెరికాకూ, దాని మిత్రులుగా ఉన్న గల్ఫ్ దేశాలకూ ఉంది. ఆ రెండు సంస్థల ఆవిర్భావంలో అమెరికా పాత్ర తిరుగులేనిది. ఇక 2000 సంవత్సరంలో అప్పటి జార్జి బుష్ ప్రభుత్వం ఇరాన్‌లోని మిలిటెంట్ బృందాలకు నిధులు పంపడం, ఆయుధాలు అందించడంలాంటి పనులు చేసిన సంగతి ఎవరూ మరిచిపోరు. ఆ బృందాలు ఇరాన్‌లో అనేకసార్లు దాడులు జరిపాయి. వాస్తవం ఇదికాగా ఇరాన్ ప్రపంచ ఉగ్ర వాద కేంద్రమంటూ ఆరోపించడం, దాన్ని ఏకాకిని చేయాలని పిలుపునీయడం... ఉగ్రవాద దాడి జరిగిన ఈ తరుణంలో కూడా ఆ ఆరోపణలనే మరోసారి వల్లిం చడం ఏవిధంగా సమర్ధనీయం?
దీన్నంతటినీ గమనిస్తే ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలోని దేశాలను కూడగట్టి పశ్చిమాసియాను పెద్ద రణరంగంగా మార్చాలని అమెరికా ప్రయ త్నిస్తున్నట్టు కనబడుతోంది. సిరియాలో ఐఎస్ ఉగ్రవాదులపై సాగుతున్న పోరులో ఇరాన్ పాలుపంచుకోవడం, అందుకు రష్యా మద్దతునీయడం అమెరికాకు కంటగింపుగా ఉంది. తాము లొంగదీసుకోవడంలో విఫలమైన ఐఎస్ సంస్థ కాస్తా ఇరాన్ వల్ల దెబ్బతింటే ప్రపంచంలో తమ పరువు పోతుందని అమెరికా బెంబే లెత్తుతున్నది. అదే జరిగితే పశ్చిమాసియాలో ఇరాన్ ప్రాబల్యం పెరగొచ్చునన్న అంచనాలు కూడా దానికున్నాయి. అందుకే ఐఎస్‌ను కట్టడి చేయడం కంటే ఇరాన్‌కు వ్యతిరేకంగా అందరినీ కూడగట్టడంపైనే ట్రంప్ దృష్టి కేంద్రీకరించారు. నిజానికి ఇప్పటికే పశ్చిమాసియా పెను సంక్షోభంలో ఉంది.
యెమెన్‌లో అంతర్యుద్ధం, ఇరాక్‌లో ఐఎస్‌పై పోరు అనునిత్యం మారణహోమాలు సృష్టి స్తున్నాయి. నాలుగైదు రోజులక్రితం ఖతర్–సౌదీ వైరం బద్దలైంది. రాచరికాన్ని వెలగబెడుతూ జనంపై స్వారీ చేసే గల్ఫ్ నియంతృత్వ పాలకులతో పోలిస్తే ఇరాన్ ఎంతో మెరుగు. కనీసం అక్కడ ఎన్నికైన పార్లమెంటు, అధ్యక్షుడూ ఉన్నారు. ఉగ్రవాదంపై పోరాడాల్సిన ఈ సమయంలో అలాంటి దేశంపై ఆరోపణలు చేయడం, దానికి వ్యతిరేకంగా అందరినీ కూడగట్టాలని చూడటం అంతిమంగా ఎవరికి ఉపయోగపడుతుందో, ఎవరి ప్రయోజనాలను నెరవేరుస్తుందో ట్రంప్ గ్రహించాలి. ఇరాన్–సౌదీ అరేబియాల మధ్య యుద్ధం చెలరేగితే అది పశ్చి మాసియాను మాత్రమే కాదు... మన దేశంతోపాటు ప్రపంచాన్నే సంక్షోభంలో పడేస్తుంది. తీరని నష్టం కలిగిస్తుంది. ఉగ్రవాదానికి ఊతమిస్తుంది. ఆ వివేకం అమెరికాకు కలగాలి.