చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే చేయదల్చుకున్న పనికి ఎవరూ ఆటంకాలు కల్పించ లేరు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపి బీభత్సాన్ని సృష్టించిన అనంతరం ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల నుంచి భారత్- పాకిస్తాన్‌లు రెండూ చాకచక్యంగా బయటికొచ్చి జరగాల్సిన చర్చలపై అంగీకారాని కొచ్చాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను ‘పరస్పర అవగాహన’తో వాయిదా వేసుకున్నాయి. ‘చాలా సమీప భవిష్యత్తులోనే’ ఈ చర్చలు మొదలవుతాయని రెండు దేశాలూ ప్రకటించాయి. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి అనంతర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్చల్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో సంయమనంతో వ్యవహరించింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే విషయంలో పాకిస్తాన్ చిత్తశుద్ధిని శంకించడానికి కారణమేమీ కనబడటం లేదని మూడురోజులక్రితం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించినప్పుడే ఇందుకు సంబంధించిన సూచనలు కనబడ్డాయి. పఠాన్‌కోట్ దురాగతానికి సూత్రధారిగా భావిస్తున్న జైషే మహమ్మద్ సంస్థ స్థావరాలపై పాక్ భద్రతా దళాలు దాడులు చేయడం, కారకులుగా భావిస్తున్నవారిని అరెస్టుచేయడం వంటి పరిణామాలు మన దేశానికి సంతృప్తి కలిగించాయి.
అయితే అలా అరెస్టయిన వారిలో సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఉన్నాడని మీడియాలో వెలువడిన కథనాలపై పాక్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆ విషయంలో మన దేశం కూడా పట్టుబట్టలేదు. చర్చల కొనసాగింపును దానితో ముడిపెట్టలేదు. ఇప్పటి కిప్పుడు ఆ అరెస్టులపై బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేయడంవల్ల మనకు ఒరిగేదేమీ ఉండదు. సరిగదా దీన్ని వక్రీకరించి భారత్ ఒత్తిళ్లకు నవాజ్ షరీఫ్ లొంగిపోతున్నారని పాక్‌లోని అతివాదులు ప్రచారం చేసే ప్రమాదం ఉంటుంది. మసూద్ అజర్ నేపథ్యం గమనిస్తే ఈ సంగతి అర్ధమవుతుంది.
1994లో కశ్మీర్‌లో ఉగ్రవాద ముఠాలమధ్య ఏర్పడ్డ విభేదాలను తొలగించేందుకు వచ్చిన అజర్‌ను పోలీసులు అరెస్టు చేస్తే 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అఫ్ఘాన్‌కు దారి మళ్లించి మన ప్రభుత్వంతో బేరాలాడి అతన్ని ఉగ్రవాదులు విడిపించుకున్నారు. 2001లో మన పార్లమెంటు భవనంపై జరిగిన ఉగ్రవాద దాడి వెనక అతని హస్తమున్నదన్న ఆరోపణతో పాక్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, సరైన సాక్ష్యాధారాలను భారత్ అందజేయలేదన్న సాకుతో ఏడాది తర్వాత అతన్ని వదిలేశారు. వాస్తవానికి ఆ దాడిలో అజర్ ప్రమేయం ఉన్నదని పాక్ పార్లమెంటులో ఆనాటి ముషార్రఫ్ సర్కారులోని మంత్రే స్వయంగా ప్రకటించారు. అయినా సైన్యం ఒత్తిళ్లతో అతన్ని విడిచిపెట్టారు. అజర్‌కు బిన్ లాడెన్, ముల్లా ఒమర్‌వంటి ఉగ్రవాదులతో సంబంధాలున్నా పాక్ అతన్ని అరెస్టు చేయదు. అమెరికా అందుకు పట్టుబట్టదు. ఇలాంటి పరిస్థితుల్లో జైషే మహమ్మద్ ప్రమేయాన్ని పాకిస్తాన్ అంగీకరించడంతోపాటు ఆ సంస్థ బాధ్యుల్ని అరెస్టు చేయడం మంచి పరిణామం. అందులో అజర్ ఉన్నాడా లేడా అన్నది కొద్ది రోజుల్లో తేలుతుంది. అతన్ని అరెస్టు చేయడంతోపాటు పఠాన్‌కోట్ దాడి వెనకున్న కుట్రను వెల్లడించి ప్రపంచానికి తన సచ్ఛీలతను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నవాజ్ షరీఫ్‌పై పడింది.
ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో చడీ చప్పుడూ లేకుండా లాహోర్‌ను సందర్శించింది మొదలుకొని ఆ పర్యటన పర్యవసానంగా ఏర్పడ్డ సుహృద్భావ వాతావరణాన్ని ఎలా చెడగొట్టాలా అని ఇరు దేశాల్లోనూ రకరకాల శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మోదీతోపాటు వచ్చిన అనేకమంది అధికారులకు వీసాల ఊసే లేకుండా ప్రవేశం కల్పించడం ద్వారా పాకిస్తాన్ సార్వ భౌమాధికారానికి నవాజ్ షరీఫ్ మహాపచారం చేశారని అక్కడి అతివాదులు హోరెత్తించారు. మన దేశంలోనూ అలాంటి శక్తులు చురుగ్గానే పనిచేశాయి. ఉగ్రవాదానికి అండదండలివ్వడాన్ని విరమించుకుంటామన్న హామీ లేకుండా ఆ గడ్డపై మోదీ ఎలా అడుగుపెడతారని కొందరు ప్రశ్నించారు. సరిహద్దుల్లో సైనికుల తలలు తెగుతుంటే లాహోర్‌లో కులాసా కబుర్లు చెబుతారా అని నిలదీశారు.
వీటన్నిటినీ దాటుకుని చర్చల తేదీలు ఖరారయ్యేసరికి ఉగ్రవాదులు యథాప్రకారం దాడులు మొదలెట్టారు. ఈసారి అఫ్ఘాన్‌లోని మన దౌత్య కార్యాలయాలపై కూడా గురిపెట్టారు. పఠాన్‌కోట్ దానికి కొనసాగింపే. ఇవి ఆగుతాయనుకోవడానికి కూడా లేదు. చర్చలకు ఎలాగైనా గండికొట్టాలన్న పట్టుదలతో ఉగ్రవాదులు మరింతగా బరితెగిస్తారు. వారి కుట్రలను వమ్ము చేయడానికి మనం అప్రమత్తంగా ఉండకతప్పదు. అదే సమయంలో ఇలాంటి చర్యలను కారణాలుగా చూపి పాకిస్తాన్‌తో సాగవలసిన చర్చలకు స్వస్తి చెప్పడం కూడా తెలివైన నిర్ణయం అనిపించుకోదు. అలా చేయడం నలుగురైదుగురు ఉగ్రవాదులు పాల్పడే మతిమాలిన చేష్టలకు ప్రాధాన్యమీయడమే అవుతుంది. వారి కోర్కెను ఈడేర్చినట్టవుతుంది.
రెండు ఇరుగుపొరుగు దేశాలమధ్య సమస్యలున్నప్పుడు వాటి పరిష్కారం కోసం చర్చించడమే సరైంది. అలాగని ఆ చర్చలపై అత్యాశలు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. పాక్‌లో పౌర ప్రభుత్వం ఒక వైఖరితో, సైన్యం మరో వైఖరితో వ్యవహరిస్తాయి. ప్రపంచ దేశాల ఒత్తిళ్లతో ఇప్పుడిప్పుడే ఆ స్థితి మారుతోంది. ఉగ్రవాదులను ఉపయోగించి భారత్‌ను నెత్తుటిముద్దగా మారిస్తే కశ్మీర్ విషయంలో ఆ దేశం దిగొస్తుందనే భ్రమలను వదులుకోవాలని పాక్ పౌర సమాజం అక్కడి సైన్యానికీ, ప్రభుత్వానికీ హితవు పలుకుతున్నది. ఇలాంటి సమయంలో మనవైపు మరింత సంయమనం, ఓపిక అవసరమవుతాయి. ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. చర్చల విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆ కోణంలో ప్రశంసనీయమైనది.
సరైన నిర్ణయం
Published Fri, Jan 15 2016 1:04 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement