‘పఠాన్‌కోట’ చెబుతున్నదేమిటి?
స్క్రిప్టు ఏ కొంచెమూ మారలేదు. భారత్-పాక్‌లు రెండూ చర్చలకు సిద్ధపడుతున్న సమయంలో ఉగ్రవాదులు యథాప్రకారం రెచ్చిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ పర్యటనకెళ్లి పదిరోజులు కాకుండానే పాకిస్థాన్‌వైపు నుంచి మన దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోటలో ఉన్న వైమానిక దళ స్థావరంపై శనివారం తెల్లారుజామున దాడికి దిగారు. ఏడుగురు భద్రతా సిబ్బందిని కాల్చిచంపడంతోపాటు 20మంది జవాన్లను గాయపరిచారు. ఉగ్రవాది మృతదేహం వద్దనున్న గ్రనేడ్‌ను నిర్వీర్యం చేయబోతూ ఒక లెఫ్టినెంట్ కల్నల్ కన్నుమూశారు.
సోమవారం కూడా వైమానిక దళ స్థావరంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నదంటే ఇది ఏ స్థాయి దాడో అర్ధమవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో అఫ్ఘానిస్థాన్‌లోని భారత్ కాన్సుల్ జనరల్ కార్యాలయంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సోమవారం పంజాబ్‌లోనే మరోచోట ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకుని వారినుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని నగరంలోకి కొందరు ఉగ్రవాదులు ప్రవేశించినట్టు ఇంటెలిజెన్స్ సమాచారం చెబుతోంది. ఈ ఉదంతాలన్నీ గమనిస్తే ఉగ్రవాదుల వ్యూహం ఎంత పకడ్బందీగా ఉన్నదో తెలుస్తుంది. దాడులకు అవసరమైన మనుషుల్ని సమీకరించి, దాడి చేయాల్సిన ప్రాంతాల వివరాలను అందజేసి, మారణాయుధాలిచ్చి పంపడం సాధారణ వ్యక్తులకూ, సంస్థలకూ సాధ్యంకాని పని. ఇరు దేశాలమధ్యా చర్చలు సాగడం ఇష్టంలేని పాకిస్థాన్ భద్రతా వ్యవస్థలోని శక్తుల ప్రమేయం లేకుండా ఇది జరిగే అవకాశం లేదు. ప్రస్తుత దాడికి కారణంగా భావిస్తున్న జైషే మహమ్మద్ సంస్థతో ఐఎస్‌ఐకి ఉన్న సాన్నిహిత్యం జగద్వితం.
వైమానిక దళ స్థావరంపై జరిగిన దాడి అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుందనుకునే ఆ స్థావరంలోకి ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో ప్రవేశించడాన్ని తేలిగ్గా తీసుకోలేం. వాస్తవానికి డిసెంబర్ 31నాడే ఉగ్రవాదులు అక్కడికి ప్రవేశించి ఉండొచ్చునని, వారు రెండు బృందాలుగా విడిపోయి సమయం కోసం కాచుక్కూర్చున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైమానిక దళ స్థావరంలో ఉన్న అత్యంత విలువైన యుద్ధ విమానాలను ధ్వంసం చేసి, తీవ్ర నష్టం కలిగించడంతోపాటు మన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు.
దీన్ని నిలువరించడంలో మన భద్రతా బలగాలు ప్రశంసనీయమైన పాత్రే పోషించాయి. అయితే సైనిక దుస్తుల్లో ఉన్నంతమాత్రానే ఉగ్రవాదులు స్థావరంలోకి ప్రవేశించగలగడం, వారి ఆనుపానుల్ని భద్రతా బలగాలు సకాలంలో పసిగట్టలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కశ్మీర్, పంజాబ్ కలిసేచోట ఉన్న పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం అత్యంత కీలకమైనది. ఆ ప్రాంతంలో పటిష్టమైన ఫెన్సింగ్‌తోపాటు అటు పాక్ బలగాలూ, ఇటు భారత్ బలగాలూ నిరంతరం పహరా కాస్తుంటాయి. అయినా 2013 సెప్టెంబర్‌తో మొదలుపెట్టి ఇప్పటికి అయిదుసార్లు ఆ ప్రాంతంనుంచే ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడ్డారు. పాక్ సైన్యం పుట్టించిన ఐఎస్‌ఐ ప్రాపకంతోనే ఇదంతా జరుగుతున్నది కనుక ఉగ్రవాదులు అటు నుంచి ఫెన్సింగ్ దాటడం కష్టమేమీ కాదు. కానీ ఇటు మన బీఎస్‌ఎఫ్ జవాన్ల అప్రమత్తత ఏమైపోయింది? మొదటిసారంటే తప్పిదమని సరిపెట్టుకోవచ్చు. కానీ పదే పదే అదే పునరావృతం కావడం ఆశ్చర్యకరం. ఆ సరిహద్దుల్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి అక్కడ అన్ని రకాలైన నిఘా వ్యవస్థలనూ ఏర్పాటు చేసి ఉంటే ఇది జరిగేది కాదు.
ఇంతేకాదు...గురుద్వారాలో ప్రార్థనల కోసం వెళ్లి తిరిగొస్తున్న గురుదాస్‌పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్‌ను శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారని తెలిసినప్పుడు వెనువెంటనే అటు పోలీసులూ, ఇటు సైన్యం అప్రమత్తం కావాల్సింది. అది జరగలేదు. తనపై ఎవరో దాడిచేసి, కొట్టి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ చెప్పినప్పుడు ఉన్నతాధికారులకు అది నమ్మశక్యంగా కనబడలేదు. అది ఉగ్రవాదులపనేనని నిర్ధారించుకోనేసరికి దాదాపు 15 గంటల సమయం వృథా అయింది. వెంటనే ఆ పని జరిగితే పఠాన్‌కోట ఉదంతాన్ని నివారించగలిగేవారు. ఎస్పీ స్థాయి ఉన్నతాధికారే అబద్ధం చెబుతున్నారని భావించడమే కాదు...ఆయనకు వంత పాడుతున్నాడని ఎస్పీ సహాయకుడొకరిని పోలీసులు చావబాదారు! ఎస్పీ చెప్పింది నమ్మకపోవడానికి కారణమేం లేదు. మొన్న జూలై నెలలో అదే ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. అసలు ఉగ్రవాదులు తాము కిడ్నాప్ చేసింది ఎస్పీ స్థాయి అధికారినని తెలియక వదిలేశారా లేక మరే ఇతర కారణమైనా ఉన్నదా అనే కోణంలో మాత్రం దర్యాప్తు జరగవలసి ఉంది.
ఇరు దేశాలూ చర్చలకు నిర్ణయం తీసుకున్నప్పుడల్లా, అందుకు తేదీలు ఖరారైనప్పుడల్లా ఉగ్రవాదులు బరితెగించడం రివాజుగా మారింది. ఎప్పటిలానే పఠాన్‌కోట దాడిని సైతం పాక్ ఖండించింది. అయితే ఇది సరిపోదు. దాడి వెనకున్నవారి ఆచూకీని పాక్ రాబట్టగలగాలి. ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సిన చర్చలను తక్షణం నిలిపేయాలని మన దేశంలో కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాద దాడులు ఆగితే తప్ప చర్చలు సాధ్యంకాదని పాకిస్తాన్‌కు చెప్పాలని సలహా ఇస్తున్నారు. కానీ అది తెలివైన పనికాదు. నిజానికి ఇప్పుడే చర్చల అవసరం ఎక్కువుంది.
దాడుల సందర్భంగా సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాదులిచ్చిన సమాచారాన్నీ, ఎస్పీ ఫోన్‌నుంచి పాక్‌లోని కుట్రదారులతో ఉగ్రవాదులు సాగించిన సంభాషణల్నీ, వాటికి సంబంధించిన నంబర్లనూ అందించి వాటి ఆధారంగా సూత్రధారులను పట్టుకోవాలని ఒత్తిళ్లు తీసుకురావాలి. అంతర్జాతీయంగా ఉగ్రవాద బెడద ఎక్కువైన నేపథ్యంలో ఈ విషయమై ప్రపంచ దేశాలు కూడా పాక్‌ను వదిలిపెట్టవు. ఉగ్రవాద దాడులతో చర్చలకు ఆటంకం కల్పించడంద్వారా సమస్యలు అపరిష్కృతంగా ఉండేలా...వాటి మూలాలు వెల్లడికాకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నామని పాక్ భద్రతా వ్యవస్థలోని ఒక వర్గం నమ్ముతూ ఉండొచ్చు. అలాంటి శక్తుల ఎత్తు పారకుండా చేయడమే మన లక్ష్యం కావాలి. మన ప్రధాని మోదీ అన్నట్టు ‘మానవాళికే శత్రువులు’గా పరిణమించిన ఉగ్రవాదులను తుదముట్టించడానికి ఇది చాలా అవసరం.