ఉగ్రవాద సర్పం మరోసారి పడగవిప్పింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ సమీపంలో ఉన్న దినానగర్‌లో సోమవారం వేకువజామున 5 గంటలకు ప్రారంభమైన ఉగ్రవాద దాడి సాయంత్రం వరకూ కొనసాగి ఒక పోలీసు ఉన్నతాధికారితోసహా నలుగురు పోలీసులు, ముగ్గురు పౌరుల ప్రాణాలు బలిగొనడంతో ముగిసింది. పంజాబ్ పోలీసుల కాల్పుల్లో దాడికి తెగించిన ముగ్గురు ఉగ్రవాదులూ హతమయ్యారు. ఈ దాడికి కారకులైనవారు ఎటునుంచి వచ్చారన్న విషయం ఇంకా స్పష్టంగా నిర్ధారణ కావలసే ఉన్నా...దాడి తీరుతెన్నులను గమనిస్తే వారు పాక్ భూభాగంనుంచే వ చ్చి ఉండొచ్చునని నిపుణులు అనుమానిస్తున్నారు. 2008లో ముంబై నగరంపై జరిగిన దాడి, ఈ ఏడాది మొదట్లో జమ్మూలోని పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడి ఉదంతాలను గుర్తుకు తెచ్చుకుంటే దినానగర్ దాడి కూడా సుశిక్షితులైనవారి పనిగానే కనిపిస్తుంది. పంజాబ్ పోలీసులు దాడి సంగతి తెలిసిన తక్షణమే రంగంలోకురికి ఉగ్రవాదులను గట్టిగా ప్రతిఘటించగలిగారు. బస్సుపై దాడికి ప్రయత్నించినప్పుడు డ్రైవర్ అప్రమత్తమై వేగంగా తీసుకెళ్లడంవల్ల ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. అలాగే ఉగ్రవాదులు బాంబులు అమర్చిన ట్రాక్‌కు చాలా దూరంగా రైలు ఆపడంవల్ల పెనుముప్పు తప్పింది. ఉగ్రవాదులు మొదటగా రోడ్డుపక్కనున్న టిఫిన్‌సెంటర్‌పై దాడిచేసి ఒకరిని చంపడం, ఒక మారుతీకారును అటకాయించి అపహరించి అందులో పోలీస్‌స్టేషన్ వైపు వెళ్లడంవంటివి గమనిస్తే...వారివద్ద ఏకే-47లు, గ్రెనేడ్‌లు, ఇతర మారణాయుధాలు పట్టుబడిన తీరు చూస్తే వారు ఎంతటి బీభత్సాన్ని సృష్టించదల్చుకున్నారో అంచనా వేసుకోవచ్చు. నిర్దిష్ట ప్రాంతాలను దాడికి లక్ష్యంగా చేసుకోవడాన్నిబట్టి గతంలో ముంబై దాడికి పథక రచన చేసిన ఉగ్రవాద ముఠా లష్కరే-తొయిబా సంస్థగానీ, ఈ ఏడాది మొదట్లో జమ్మూలో పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసిన జైషే మహమ్మద్‌గానీ ఈ దాడికి కారణమనుకోవచ్చునని భద్రతా సంస్థలు ప్రాథమికంగా నిర్ధారణకొస్తున్నాయి.
ఉగ్రవాదులు పాకిస్థాన్‌నుంచే వచ్చారనుకుంటే వారు జమ్మూ-కశ్మీర్‌లోకి చొరబడి పంజాబ్‌లోకి ప్రవేశించారా లేక పంజాబ్‌వైపునున్న సరిహద్దునుంచి ప్రవేశించారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నట్టు ఉగ్రవాదులు పంజాబ్‌లోని పాకిస్థాన్ సరిహద్దు వెంబడే వచ్చి ఉంటే అది ప్రమాదకరమైన సంకేతమే. పాక్‌తో పంజాబ్ పొడవునా మనకు 460 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ పొడవునా ఇనుప కంచె, ఫ్లడ్‌లైట్లు ఉంటాయి. గట్టి నిఘా ఉంటుంది. 1993లో ఇదంతా పూర్తయినప్పటినుంచీ ఇంతవరకూ అక్కడ ఒక్క చొరబాటు ఘటన కూడా చోటుచేసుకోలేదు. అయితే రాష్ట్రంలోని పఠాన్‌కోటలో నిరుడు ఒక ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఉగ్రవాదులు జమ్మూ-కశ్మీర్‌తోపాటు పంజాబ్‌ను కూడా ఇకపై దాడులకు లక్ష్యంగా చేసుకోదల్చుకున్నారని దినానగర్ దాడితో నిర్ధారించుకోవచ్చునన్నది ఇంటెలిజెన్స్ వర్గాల భావన. ఒకప్పుడు గురుదాస్‌పూర్‌తో సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు మిలిటెన్సీతో పెను హింసను చవిచూసినవే. ఖలిస్తానీ కమాండో ఫోర్స్, బబ్బర్‌ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్‌వంటి సంస్థలు ఎన్నో విధ్వంసక చర్యలకు, హత్యలకు పాల్పడ్డాయి. అయితే, 2012లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన ఘటన మినహా 2007 తర్వాత రాష్ట్రంలో చెప్పుకోదగ్గ మిలిటెంట్ ఘటనలేవీ జరగలేదు. ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో ఉన్న అపారమైన అనుభవం కారణంగానే పంజాబ్ పోలీసులు దినాపూర్‌లో వెనువెంటనే చురుగ్గా కదిలి ముష్కరులను కట్టడి చేయగలిగారు.
ఉగ్రవాద దాడి మన వ్యవస్థలో నెలకొని ఉండే లోపాలను మరోసారి వేలెత్తి చూపింది. దాడి జరిగే అవకాశాలున్నాయి...అప్రమత్తంగా ఉండాలని తాము పంజాబ్ ప్రభుత్వాన్ని హెచ్చరించామని కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ ప్రభుత్వం మాత్రం అలాంటి సమాచారం అందినట్టు అంగీకరించడంలేదు. అందుకు సంబంధించిన అంచనాలున్నపుడు సరిహద్దుల్ని మూసేయడానికి అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదన్నది పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ ప్రశ్న. ఆయన బీజేపీకి మిత్రపక్షమైన అకాలీదళ్ నాయకుడు. ఉగ్రవాదులు పాక్ వైపునుంచే వచ్చి ఉంటారని ఆయన కూడా అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు మిలిటెన్సీతో అట్టుడికినందువల్ల పంజాబ్‌లోని ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చునని అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ సంగతిని గట్టిగా చెబుతున్నారు. ఇలాంటి దాడులు జరిగినప్పుడు వెనువెంటనే అధికార పక్షంపై ఆరోపణలు చేయడం, ఉగ్రవాద దాడిని నివారించడంలో వైఫల్యం చెందిందని విమర్శించడం సాధారణమే. అలాగే పాకిస్థాన్ తీరు మారకపోయినా ఆ దేశానికి స్నేహహస్తం అందించడమేమిటన్న ప్రశ్నలూ వినిపిస్తాయి. కాంగ్రెస్ కూడా ఆ పనే చేసింది. విపక్షంలో ఉంటే ఆ బాధ్యతను బీజేపీ స్వీకరించి ఉండేదని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఈ దాడిని తీవ్రంగా ఖండించడంతోపాటు అందులో తమ ప్రమేయం లేదని పాకిస్థాన్ ప్రకటించింది. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరిని సజీవంగా పట్టుకున్నారని తొలుత వార్తలు వెలువడినా అది నిజం కాదని తేలింది. నిజానికి అలాంటి ప్రయత్నం చేయడంవల్లే ఆపరేషన్ అంతసేపు సుదీర్ఘంగా సాగిందని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. ముంబై దాడి సమయంలో కసబ్ పట్టుబడినట్టు ఈ దాడిలో ఒకరైనా సజీవంగా దొరికివుంటే సూత్రధారులెవరో, వారి నెట్‌వర్క్ ఏమిటో, వారి పథకాలేమిటో వెల్లడయ్యేవి. ఉగ్రవాదుల విషయంలో సదా అప్రమత్తంగా మెలగాల్సిన అవసరాన్ని తాజా ఘటన గుర్తుచేస్తోంది. ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చిన వర్తమాన పరిస్థితుల్లో ఈ విషయంలో మరింతగా జాగ్రత్తగా ఉండకతప్పదు.
పంజాబ్‌లో ఉగ్ర సర్పం
Published Tue, Jul 28 2015 3:29 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement