![‘సత్యలోకం’ అడుగుజాడల్లో... - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71417839099_625x300.jpg.webp?itok=wfqflMbZ)
‘సత్యలోకం’ అడుగుజాడల్లో...
చూడబోతే సమాజానికి ఇబ్బందికరంగా మారిన బాబాలను, స్వాములను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన స్థితిలో పడుతున్నట్టుంది. హర్యానాలోని బర్వాలాలో సత్యలోకం పేరిట ఆశ్రమాన్ని నిర్మించుకుని వందలాదిమంది అనుచరులను పోగేసిన బాబా రాంపాల్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టుచేసి కోర్టుముందు హాజరు పరిచేసరికి సర్కారు తల ప్రాణం తోకకొచ్చింది. ఊరు ఊరంతా రణరంగాన్ని తలపించగా... యాసిడ్ సీసాలతో, తుపాకులతో తమపై దాడికి దిగిన రాంపాల్ అనుచరులను దారికి తెచ్చేందుకు పోలీసులు ఎన్నో ఇబ్బందులు పడాల్సివచ్చింది.
ఆరుగురు చనిపోయి, అంతా ధ్వంసమయ్యాక లెక్క చూసుకుంటే రూ. 26 కోట్లు ఖర్చయిందని తేలింది. అది పూర్తయి కొద్దిరోజులైనా గడవకుండానే ఈసారి పంజాబ్‌కు అచ్చం అదే మాదిరి సమస్య వచ్చిపడింది. ఈ బాబా వేరు...ఈయన తీరు వేరు. రాంపాల్‌లా ఈయన జీవించి లేరు. ఈ ఏడాది జనవరి 29న కాలం చేశారు. జలంధర్ సమీపంలో దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్ పేరిట పెద్ద ఆశ్రమాన్ని కట్టుకున్న ఈ బాబా పేరు అశుతోష్ మహరాజ్. ఆయనకు అన్ని మతాల్లోనూ అనుచరులూ, భక్తులు ఉన్నారు.
అశుతోష్ మహరాజ్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించడం, ఆయనకు బంధువులుగా చెప్పుకుంటున్నవారు అంత్యక్రియలు పూర్తిచేయాలనుకోవడం...అన్నీ అయ్యాయి. కానీ ఆశ్రమ నిర్వాహకులు, అశుతోష్ భక్తగణం అందుకు ససేమిరా అంగీకరించడంలేదు. బాబా సమాధిలోకి వెళ్లారని... ఆయనకు నిత్య పూజలు, భజనలు చేస్తే ఎప్పుడో మళ్లీ మనల్ని అనుగ్రహించి వెనక్కు వస్తారని చెబుతున్నారు.
గతంలో మూడు సందర్భాల్లో ఆయన వారంరోజుల చొప్పున సమాధిలోకి వెళ్లి తిరిగొచ్చారంటున్నారు. అశుతోష్ అనుగ్రహించే సమయానికి భౌతికకాయం పంచభూతాల పాలబడి పాడవకూడదన్న సదుద్దేశంతో దాన్ని గాజు రిఫ్రిజిరేషన్‌లో ఉంచారు కూడా. ఈ రెండు వర్గాలమధ్యా తలెత్తిన తగువు చివరకు హైకోర్టుకెక్కింది. పక్షం రోజుల్లోగా అశుతోష్ భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మన రాజ్యాంగంలోని 51(ఏ)(హెచ్) అధికరణం... శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసనూ, సంస్కరణభావాన్నీ పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యతగా చెబుతున్నది. కానీ, పౌరులకు అలాంటి బాధ్యత ఉన్నదని పాలకులు చెప్పరు. ఆ బాధ్యతను వారు నెరవేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోరు. అసలు తాము కూడా ఈ దేశ పౌరులమే గనుక తమకూ అది వర్తిస్తుందని గుర్తించరు. ఎవరి వెనకైనా చెప్పుకోదగిన సంఖ్యలో భక్తులో, అనుచరులో ఉన్నారంటే అలాంటివారి అనుగ్రహాన్ని సంపాదించడానికి వెంపర్లాడతారు.
సమస్త యంత్రాంగాన్నీ చేతుల్లో పెట్టుకుని ఏ సమాచారాన్నయినా చిటికెలో తెప్పించుకోగలిగిన స్థితిలో ఉండి కూడా పాలకులు ఇలా ప్రవర్తించడమంటే బాధ్యతారాహిత్యం తప్ప మరేమీ కాదు. వాస్తవానికి అశుతోష్ మహరాజ్ కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. 1998లో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ)తో వైరం ఏర్పడ్డాక ఆయనకు జడ్ సెక్యూరిటీ రక్షణ కల్పించారు. అయిదేళ్లక్రితం రెండు వర్గాలూ ఘర్షణకు దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఒకరు మరణించారు. రాంపాల్‌కు సైతం క్రిమినల్ కేసులో చిక్కుకుని బెయిల్‌పై విడుదలయ్యాక గత నాలుగేళ్లనుంచి కోర్టుకు హాజరుకావడమే మానుకున్నారు. అయినా రాజకీయ నాయకులకూ, ప్రభుత్వంలో ఉన్నవారికీ అలాంటి వ్యక్తితో సన్నిహితంగా మెలగకూడదన్న స్పృహ లేదు.
హర్యానాలో రాంపాల్ విషయంలో జరిగిన తప్పే ఇప్పుడు అశుతోష్ ఆశ్రమ వ్యవహారంలో కూడా సాగుతున్నది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్కారు మీనమేషాలు లెక్కిస్తుంటే ఆ ఆశ్రమానికి వెల్లువలా భక్తులు వచ్చిపడుతున్నారు. రాంపాల్ ఆశ్రమానికి కూడా ఇలాగే వేలాదిమంది చేరడంతో ఆయనను అరెస్టు చేయడం ఎంతో కష్టమైంది. ఘర్షణ సమయంలో పిల్లలు, మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. దీన్నుంచి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం తీసుకున్న దాఖలా కనబడ దు. ప్రజల్లో ఆథ్యాత్మిక చింతనను పెంపొందించడానికి, భక్తి మార్గాన్ని బోధించడానికి ఎవరికైనా హక్కుంటుంది.
ఆ తరహా సేవను ఎంతో చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న వారు దేశంలో ఎందరో ఉన్నారు. మన రాజ్యాంగంలోని 25, 26 అధికరణాలు నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ప్రచారం చేయడానికి స్వేచ్ఛ ఇస్తున్నది. అందులో భాగంగా మతపరమైన, ధార్మికమైన సంస్థలను నెలకొల్పుకోవడానికి, వాటికి ఆస్తులను సమకూర్చుకోవడానికి వీలుకల్పిస్తున్నది. అయితే ఆ వ్యవహారాలన్నీ అమలులో ఉన్న చట్టాలకు లోబడి ఉండాలని అంటున్నది. మన పాలకులు మాత్రం ఆయా మత సంస్థల వ్యవహారాలు ఎలాంటివో తెలియనట్టు నటిస్తున్నారు. పరిమితులకు లోబడి ఉన్నంతవరకూ ఈ నాటకాలవల్ల ఎవరికీ ఇబ్బందులుండవు. కానీ ఒక స్థాయి దాటాక ఆ సంస్థల నిర్వాహకులు తాము అన్నిటికీ అతీతమన్న భ్రమలోకి జారుకుంటారు. వారు ఆ స్థాయికి చేరుకున్నాక చర్య తీసుకోవడం మాట అటుంచి, వారిని ఏమైనా అనడానికి కూడా ప్రభుత్వంలో ఉన్నవారికి ధైర్యం చాలదు.
అలా చేస్తే తమకు వచ్చే ఓట్లు కాస్తా ప్రత్యర్థిపక్షానికి పోతాయని భయపడతారు. మొన్న రాంపాల్ ఉదంతంలోనైనా, ఇప్పుడు అశుతోష్ వ్యవహార ంలోనైనా జరుగుతున్నది ఇదే. పంజాబ్, హర్యానాల్లోని అనేక ఆశ్రమాలు సైన్యంలో రిటైరైన సిబ్బందితో తమ అనుచరులకు ఆయుధ శిక్షణనిప్పించుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఇటీవలే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అక్కడ పరిస్థితి ఎంత దిగజారిందో దీన్నిబట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా పాలకులు తమ బాధ్యతను గుర్తెరగాలి.