ఇది న్యాయమేనా?! | Editorial On Shillon Times Journalist Patricia Mukhim Incidenet | Sakshi
Sakshi News home page

ఇది న్యాయమేనా?!

Published Wed, Mar 13 2019 12:34 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

Editorial On Shillon Times Journalist Patricia Mukhim Incidenet - Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మేఘాలయ హైకోర్టు ఒక దురదృష్టకర తీర్పు వెలువ రించింది. స్థానిక పత్రిక ‘షిల్లాంగ్‌ టైమ్స్‌’ సంపాదకురాలు పట్రిషియా ముఖిం, ప్రచురణకర్త శోభా చౌధురిలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ కోర్టు సమయం ముగిసేవరకూ న్యాయ స్థానంలో ఒక మూల కూర్చోవాలని శిక్ష విధించడంతోపాటు ఇద్దరూ చెరో రెండు లక్షల రూపా యలూ జరిమానా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించకపోతే ఆర్నెల్లు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆ పత్రిక ముగిసిపోతుందని(నిషేధానికి గురవుతుందని) కూడా న్యాయస్థానం తేల్చిచెప్పింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఆరేళ్లక్రితం రిటైరైన జస్టిస్‌ శైలేంద్రకుమార్‌ 2010లో కోర్టు ధిక్కారం కింద శిక్షించే అధికారాన్ని దుర్వినియోగం చేయడం న్యాయమూర్తులకు రివాజుగా మారిందని వ్యాఖ్యానించారు.

ఫలితంగా సరిగా ఆలోచించేవారికి, నమ్మినదానికి కట్టుబడి ఉండే సాహసికులకు ఇబ్బందులెదురవుతున్నా యని చెప్పారు. ఆయనే కాదు... వివిధ సందర్భాల్లో జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్, జస్టిస్‌ జేఎస్‌ వర్మ వంటి న్యాయకోవిదులు సైతం కోర్టు ధిక్కార నేరాన్ని న్యాయస్థానాలు అత్యంత జాగురూకతతో వినియోగించాలని హితవు పలికారు. న్యాయమూర్తుల పదవీ విరమణానంతరం వారికి అందా ల్సిన సదుపాయాలపై మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ‘షిల్లాంగ్‌ టైమ్స్‌’ పత్రిక రెండు కథనాలు ప్రచురించింది. ఈ విషయంలో పత్రికపై ఎలాంటి చర్య తీసుకోవాలో సూచించడానికి కోర్టు సహాయకులుగా నియమించిన న్యాయవాదులపై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేశా రని, ఆ పోస్టుల్లో న్యాయవ్యవస్థను హేళన చేశారని ధర్మాసనం భావించింది.

మీడియా స్వేచ్ఛ అంటే మీడియా సంస్థలు ఇష్టానుసారం రాసే స్వేచ్ఛ కాదు. జరిగిన ఉదంతాలను, మాట్లాడిన మాటలను వక్రీకరించే స్వేచ్ఛ అంతకన్నా కాదు. అది భావ ప్రకటనా స్వేచ్ఛకు పూచీ పడుతున్న రాజ్యాంగంలోని 19(1)(ఏ) ద్వారా ప్రజలకు సమకూరిన హక్కు. ఈ హక్కును దుర్వినియోగం చేస్తూ, అవాంఛనీయ పోకడలకు పోతూ ఇష్టానుసారం ప్రవర్తించే మీడియా సంస్థలు లేకపోలేదు. ప్రజలకు గల తెలుసుకునే హక్కును గుర్తించి, గౌరవించి దాన్ని బాధ్యతగా వినియోగించని మీడియా సంస్థలు ఎంతో కాలం మనుగడ సాగించలేవు. ఎప్పటి కప్పుడు లోటుపాట్లను సరిదిద్దుకుంటూ, విశ్వసనీయతను పెంచుకోవడానికి ప్రయత్నించని సంస్థలు మీడియాలో మాత్రమే కాదు...ఏ రంగంలోనూ నిలబడలేవు. అత్యధిక మీడియా సంస్థలు ఎన్నో పరిమితుల్లో శక్తివంచన లేకుండా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో వాటికి రాజకీయ నాయకుల నుంచి, అవినీతి అధికారుల నుంచి, భూ కబ్జాదారులనుంచి, మాఫియా ముఠాల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. నిజాలు వెల్లడించినందుకు, ప్రజల్ని అప్రమత్తం చేసి నందుకు ఎందరో పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో అత్యంత ప్రధానమైన న్యాయవ్యవస్థ మీడియాకు అండగా నిలబడాలని అందరూ కోరుకుంటారు. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ భద్రంగా ఉండాలంటే ఇదెంతో అవసరం. కానీ మేఘాలయ హైకోర్టు వెలువరించిన తీర్పు దానికి విరుద్ధంగా ఉంది. ‘షిల్లాంగ్‌ టైమ్స్‌’ ప్రచురించిన మొదటి కథనం నిరుడు డిసెంబర్‌ 6 నాటిది. జస్టిస్‌ ఎస్‌ఆర్‌ సేన్‌ ఇచ్చిన ఆ తీర్పు రిటైరైన న్యాయమూర్తులకూ, వారి కుటుంబాలకు కల్పించాల్సిన సదుపాయాలు, భద్రతకు సంబంధించింది. ఆ వార్త తీర్పులోని అంశాలను యధాతథంగా ఇచ్చింది తప్ప ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. అదే నెల 12న ప్రచురించిన రెండో కథనం సైతం ఆ కోవలోనిదే. ఆ సదుపాయాల జాబితాను ఇచ్చింది. రిటైరైన న్యాయమూర్తులకు ప్రొటోకాల్‌ అమలు, గెస్ట్‌హౌస్‌ సదుపాయం, వారి కుటుంబసభ్యులకు వైద్యసాయం, ఇంకా మొబైల్‌/ఇంటర్నెట్‌ చార్జీలు ఇవ్వడం వంటివన్నీ అందులో ఉన్నాయి.

అంతక్రితం మరో ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన ఈ మాదిరి తీర్పును ఆ కథనం ప్రస్తావించింది.  రిటైరైనవారికి జడ్‌ కేటగిరి, వై కేటగిరి భద్రత కల్పించాలని ఆదేశిస్తూ ఇచ్చిన ఆ తీర్పును గుర్తుచేసింది. మార్చి నెలలో జస్టిస్‌ ఎస్‌ఆర్‌ సేన్‌ రిటైర్‌ కాబో తున్నారని తెలిపింది. అంతేతప్ప ఆయనకు ఎలాంటి ఉద్దేశాలనూ ఆపాదించలేదు. రిటైర్‌ కాబో తున్నవారు ఇలాంటి తీర్పులివ్వడం చట్టవిరుద్ధమనిగానీ, అనుచితమనిగానీ అనలేదు. అయినా ఆ కథనంపై ముఖిం బేషరతుగా క్షమాపణలు చెప్పారు. శిక్షను తప్పించుకోవడానికే ఆమె క్షమాపణ కోరుతున్నారని న్యాయమూర్తి భావించారు. విశేషమేమంటే రిటైరైన న్యాయమూర్తులకు వై కేటగిరి, జడ్‌ కేటగిరి భద్రత కల్పించాలంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రిటైరైన న్యాయమూర్తులకు సాధారణ భద్రత సరిపోతుందని తేల్చిచెప్పింది. 

కోర్టు ధిక్కార చట్టం ఏ ఏ అంశాలు కోర్టు ధిక్కారం కిందికొస్తాయో చెబుతోంది. న్యాయ కార్యకలాపాలను సముచితమైన, ఖచ్చితమైన సమాచారంతో తెలిపినా... న్యాయస్థానం వెలువ రించిన తీర్పులోని యోగ్యతాయోగ్యతలపై సముచితమైన విమర్శ, వ్యాఖ్య చేసినా కోర్టు ధిక్కారం కిందకు రాదని చట్టం చెబుతోంది. దాని ప్రకారం తప్పుడు రాతలు, దురుద్దేశపూర్వకమైన రాతలు మాత్రం కోర్టు ధిక్కారమవుతాయి. ఎందుకంటే అవి న్యాయమూర్తుల ప్రవర్తనపై సంశయాలను కలిగిస్తాయి. అంతిమంగా దేశంలో న్యాయ పాలనకు విఘాతం కలిగిస్తాయి. కానీ ‘షిల్లాంగ్‌ టైమ్స్‌’ కథనాలు ఈ పరిధిలోకొస్తాయని అనుకోలేం. అవి తీర్పును తప్పుబట్టలేదు. వ్యక్తిగత ప్రయో జనాలు పొందేందుకే ఈ తీర్పునిచ్చారనలేదు. అయినా కోర్టు ధిక్కార చట్టం కింద చర్యలు తీసుకోవడం విచారకరం. ఈ విషయంలో ఎడిటర్స్‌ గిల్డ్, పాత్రికేయ సంఘాలు వ్యక్తం చేస్తున్న ఆందోళన సహేతుకమైనది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పత్రికాస్వేచ్ఛను పరి రక్షిస్తుందని ఆశిద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement